Apr 28,2023 15:13

ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : దేశ సంపదను కార్పొరేట్లకు దోచిపెట్టి బిజెపి ప్రభుత్వాన్ని పారదోలాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జి.రామకృష్ణ అన్నారు. కర్నూల్ మండలంలోని గార్గేయపురం, ఈ తాండ్రపాడు గ్రామాలలో మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ప్రచార బేరి కార్యక్రమాన్ని మండల కార్యదర్శి ఉసేనయ్య అధ్యక్షతన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై జి.రామకృష్ణ మాట్లాడుతూ దేశ ఉమ్మడి సంపదగా ఉన్న బ్యాంకులను, ప్రభుత్వ రంగ పరిశ్రమలను, ఓడరేవులను, అన్నం పెట్టే వ్యవసాయాన్ని సైతం మోడీ ప్రభుత్వం కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తుంది  అని అన్నారు. మోడీ అండదండలతో ఆదాని ఏ విధంగా ప్రపంచాన్ని మోసం చేసి రూ. లక్షల కోట్లను కొల్లగొట్టాడో హిండెన్ బర్గ్ నివేదిక బట్టబయలు చేసిందని అన్నారు. దానిమీద విచారణకు అంగీకరించకుండా ఆదానిని ఈ కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొస్తుందన్నారు. పైగా మరింత వేగంగా దేశంలోని అడవులను, భూములను, విద్యుత్ ప్రాజెక్టులను గనులను కార్పొరేట్లకు అక్రమంగా కట్టబెడుతుందన్నారు. సామాన్య ప్రజల పైన ఏ మాత్రం చిత్తశుద్ధి, కనికరం చూపని కేంద్ర ప్రభుత్వం వారిపైన భారాలు మోపుతూ బతుకులు బుగ్గి చేస్తుందన్నారు. నరేంద్ర మోడీ ప్రజా వ్యతిరేక విధానాలను అర్థం చేసుకొని బిజెపిని తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల నాయకులు రాఘవేంద్ర, మృత్యుంజయ, బాలపీర, బాబు, తదితరులు పాల్గొన్నారు.