న్యూఢిల్లీ : ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులపై జరుగుతున్న దాడులను నిలిపివేయాలని కోరుతూ సిపిఎం ప్రతినిధుల బృందం త్రిపుర ముఖ్యమంత్రిని కోరింది. బాధిత కుటుంబాలకు సరైన పరిహారం ఇప్పించేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు మాణిక్ సర్కార్ నేతృత్వంలోని ప్రతినిధుల బృందం విజ్ఞప్తి చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల అనంతరం రాష్ట్రవ్యాప్తంగా 2,016 హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో ఐదుగురు మరణించగా, పలువురికి గాయాలయ్యాయి. సోమవారం సిపిఎం బృందం ముఖ్యమంత్రి మాణిక్ సాహాతో సమావేశమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది.
ఎన్నికలు ముగిశాయని, బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని, అన్ని సంస్థలు, పార్టీలు, వ్యక్తులు ప్రజాస్వామ్య యుతంగా తమ విధులను నిర్వర్తిస్తున్నాయని నిర్థారించుకోవాలని, లేకుంటే శాంతి, సుస్థిరత అసాధ్యమని మాణిక్‌సర్కార్ పేర్కొన్నారు. రబ్బరు తోటలు, వ్యవసాయ క్షేత్రాలు, నీటివనరులతో పాటు సామాన్యుల జీవనోపాధిపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. ఈ వాస్తవాలను సిఎం దృష్టికి తీసుకువెళ్లాలని భావించామని అన్నారు.










