ప్రజాశక్తి - మంగళగిరి రూరల్ : మోడీ అమిత్ షా జోడి ఈ దేశానికి పట్టిన పీడను వదిలించుకుంటే తప్ప దేశం అభివృద్ధి చెందదు. మోడీని గద్దె దించుదాం భారతదేశాన్ని కాపాడుకుందాం.. రాజధాని గ్రామమైన కురగల్లులో శుక్రవారం నాడు ప్రచార బేరి కార్యక్రమాన్ని సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి ఎం రవి, సిపిఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ,రాష్ట్రంలోని వైసిపి ఏపీ రాజధానికి నమ్మకద్రోహం చేశారని విమర్శించారు. ఎనిమిది సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లోఒక్క రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి కేటాయించలేదని అన్నారు వైసిపి మూడు రాజధానులు పేరిట అమరావతి రాజధానినీ విచ్చిన్నం చేసే కుట్రలు చేస్తుందని అన్నారు. రాజధాని అమరావతిపై కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం రోజుకో మాట చెబుతూ, ముసలి కన్నీరు కారుస్తూ కపట నాటకం ఆడుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ శక్తులకు ధారా దత్తంచేస్తుందని మండిపడ్డారు. ఆంధ్రులు 32 మంది తమ ప్రాణాలను బలిదానం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు జోలికొస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీ చట్టాలను అమలు చేయకుండా, రాజధానికి పోలవరానికి నిధులు కేటాయించకుండా ద్రోహం చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి వైసీపీ దాసోహం అనడంసిగ్గుచేటని అన్నారు. బిజెపి, వైసిపి కూడా పలుక్కొని తోడు దొంగల లా వ్యవహరిస్తూ రాష్ట్ర ప్రజలపై భారాల మీద భారాలు వేస్తున్నారని అన్నారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేటర్ శక్తులకు కారు చౌకగా కట్టబెడుతుందని అన్నారు.కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక వినాశకర విధానాలకు వ్యతిరేకంగా ప్రజలంతా గళం ఇప్పాలని వారు కోరారు. ప్రచార బేరి క్యాంపెయిన్ లో భాగంగా ఈనెల 24వ తేదీ సాయంత్రం ఐదు గంటలకు మంగళగిరి ఆటోనగర్ వద్ద సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో జరిగే బహిరంగ సభలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని వారు కోరారు. ఈ సభలో సిపిఎం పోలీట్ బ్యూరోసభ్యులు బివి రాఘవులు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శికె రామకృష్ణ పాల్గొంటారని వారు తెలిపారు. సిపిఎం, సిపిఐ ఆధ్వర్యంలో జరిగిన ప్రచార బేరి కార్యక్రమం శుక్రవారం నాడు కురగళ్లు, నీరుకొండ బేతపూడి, నిడమర్రు, నవులూరు గ్రామాలలో పర్యటించి కరపత్రాలు పంపిణీ చేస్తూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం రాజధాని డివిజన్ కార్యదర్శి వర్గ సభ్యులు ఎం భాగ్యరాజు వల్లభాపురం వెంకటేశ్వరరావు డివిజన్ నాయకులు కట్టపోగు ప్రకాశరావు సిపిఐ మంగళగిరి మండల కార్యదర్శి జాలాది జాన్ బాబు సిపిఐ నాయకులు వెంకటరామయ్య శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.










