Oct 28,2023 16:42
  • పెద్దాపురం మున్సిపల్ కౌన్సిల్ సమావేశం

ప్రజాశక్తి - పెద్దాపురం : సమస్యల పరిష్కారంలో మున్సిపల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు కౌన్సిలర్లు అధికారులను నిలదీశారు. శనివారం మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు అధ్యక్షతన జరిగిన కౌన్సిల్ సాధారణ సమావేశంలో 2 వ వార్డ్ కౌన్సిలర్ ఆకుల కృష్ణ బాపూజీ మాట్లాడుతూ తమ వార్డు పరిధిలోని స్మశానం అస్తవ్యస్తంగా ఉందన్నారు. స్మశానం నిండా చెత్తను డంపు చేయడం వల్ల చెత్త చెదారం రహదారిలో పేరుకుపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ముఖ్యంగా ఈ స్మశానంలో బోరు పనిచేయకపోవడంతో స్మశానానికి వెళ్లిన వారు స్నానాలు లేక అవస్థలు పడుతున్నారన్నారు. ప్రభుత్వ స్థలాలు ఆక్రమణలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని తాను అనేక కౌన్సిల్  సమావేశాల్లో చెబుతున్నప్పటికి అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. తమ వార్డు పరిధిలోని మున్సిపల్ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీవ్రంగా ఉందని, చాలింతమంది ఉపాధ్యాయులని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.1వ వార్డు కౌన్సిలర్ ఆరేళ్ల వీరరాఘవ మాట్లాడుతూ పట్టణ పరిధిలో ప్రత్యేక పారిశుధ్య పనులు నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు.వీధిలైట్ల ఏర్పాటుకు విద్యుత్ స్తంభాలను కేటాయించాలన్నారు. విజ్జపు రాజశేఖర్ మాట్లాడుతూ టౌన్ ప్లానింగ్ విభాగంలో టిపిఓ, టిపిఎస్ లు లేక పనులు కుంటుపడుతున్నాయన్నారు. వెంటనే ఈ పోస్టులలో నియామకాలు జరపాలన్నారు.మెయిన్ రోడ్డు లోని మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులు జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.త్సలికి సత్య భాస్కరరావు మాట్లాడుతూ అధికారుల దృష్టికి తీసుకు వచ్చిన ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్,కనకాల మహాలక్ష్మి,కమిషనర్ జె సురేంద్ర,డి ఈ ఈ ఆదినారాయణరావ్,ఆర్ ఓ చంద్రశేఖర రావు,పలువురు కౌన్సిలర్లు,కో ఆప్షన్ సభ్యులు పాల్గొన్నారు.