- విధుల్లోకి తీసుకోవాలని జిజిహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
- హైకోర్టు ఉత్తర్వులు అమలు చేయాలని డిమాండ్
ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో తొలగించిన ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, సిబ్బంది ఆందోళన శనివారం నాటికి 600 రోజులకు చేరుకుంది. 2021 సెప్టెంబరులో 65 మంది కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ సిబ్బందిని, 2022 జూన్‌లో 89 వికాస ఔట్ సోర్సింగ్ సిబ్బందిని జిల్లా అధికారుల ఆదేశాల మేరకు విధుల నుంచి ఆసుపత్రి యాజమాన్యం తొలగించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి తమకు న్యాయం చేయాల్సిందిగా హైకోర్ట్ ఆదేశాలను అమలు చేయాలంటూ ఆసుపత్రి ఎదుటే నిరశన దీక్షలు ప్రారంభించారు. మండుటెండను, కుంభవృష్టి వర్షాన్ని కూడా లెక్కచేయకుండా గత 600 రోజులుగా నిరశన కొనసాగిస్తున్నారు.
ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రిలో అడ్డగోలుగా తొలగింపులు జరుగుతున్నాయని విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారి ఉత్తర్వులను కూడా జిజిహెచ్ అధికారులు లెక్కచేయడం లేదన్నారు. వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు కూడా జిజిహెచ్లో జరుగుతున్న అక్రమ తొలగింపులపై స్పందించాలన్నారు. ఈ విషయంపై జిల్లాలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించి జిజిహెచ్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను విధుల్లోకి తీసుకోవడానికి సహకరించాలని కోరుతున్నామని వీరబాబు చెప్పారు.
అవుట్ సోర్సింగ్ ఉద్యోగ సంఘ నాయకులు ఇంద్రాణి, గంగాధర్ లు మాట్లాడుతూ తమను అన్యాయంగా విధులకు దూరం చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. చాలీచాలని జీతాలతో, కోవిడ్ సమయంలో ప్రాణాలు పణంగా పెట్టి సేవలు చేసామన్నారు. అందుకు కానుకగా ప్రభుత్వం, జిల్లా అధికారులు తమను ఉద్యోగాల నుండి తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వేతనాలు చెల్లించకుండా, నోటీసు ఇవ్వకుండా ఉన్నపలంగా తమను, తమ కుటుంభాలను రోడ్డున పడేశారని విచారం వ్యక్తం చేశారు. 2018 అక్టోబర్‌లో 483 మందిని రాష్ట్రవ్యప్తంగా నియమించడంలో బాగంగా కాకినాడ ప్రభుత్వాసుపత్రిలో 66 మందిని నియమించినట్టు తెలియజేశారు. జిల్లా అధికారులతో పాటు రాష్ట్ర అధికారులకు కూడా పలుసార్లు విన్నవించామని వెల్లడించారు. ఇటీవల బాధ్యతలు చేపట్టిన డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ డివిఎల్ నరసింహంను కలిసి తమ గోడు వినిపించుకున్నట్టు వారు వెల్లడించారు. 2021 సెప్టెంబర్ లో, 65 మంది అప్కోస్ ఉద్యోగులను అక్రమంగా తొలగించారని, తిరిగి తమని విధులలొకి తీసుకోవాలని వారు విన్నవించారు.
యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు డిఎ రతన్ రాజ్, జిజిహెచ్ నాయకులు జి నాయుడు, శానిటేషన్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు సిహెచ్ విజయ్ కుమార్లు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల ఉద్యమానికి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల నాయకులు పిఎస్ రాయుడు, సిహెచ్ ఏడుకొండలు, చక్రవర్తి, దుర్గా లక్ష్మి, అరుణ, వసంత, బేబి రాణి, లలిత, దయానంద్, రమణ, శ్రీనివాస్, పవన్, శివ శంకర్, ధనుంజయ్, ప్రసాద్, మౌలాలీ తదితరులు పాల్గొన్నారు.










