Mar 14,2023 07:24

ప్రపంచ చలనచిత్ర రంగం ప్రతిష్టాత్మకంగా భావించే ఆస్కార్‌ పురస్కారం మన తెలుగు సినిమా 'ఆర్‌ఆర్‌ఆర్‌'ను వరించడం తెలుగు జాతికి గర్వకారణం. విశ్వ సినీ యవనికపై తెలుగు సినిమా సత్తా చాటడం పట్ల తెలుగు వారందరూ సంబరపడుతున్న ఉద్విగ క్షణాలివి. ఇండియా సినీ ఇండిస్టీ నుంచి ఉత్తమ ఒరిజినల్‌ సాంగ్‌ కేటగిరీకి 'ఆర్‌ఆర్‌ఆర్‌' మూవీ లోని 'నాటు నాటు' పాట నామినేట్‌ కాబడి ఆస్కార్‌ బరిలో నిలిచినప్పుడే అవార్డు ఖాయమని అందరూ ఊహించారు. కోట్లాది మంది ఆకాంక్షలు సాకారమయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూసిన 2023 సంవత్సర ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం అమెరికా లాంస్‌ఏంజిల్స్‌లో జరగ్గా, 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్రం లోని 'నాటు నాటు' సాంగ్‌ బెస్ట్‌ ఒరిజినల్‌ స్కోర్‌ అవార్డును సొంతం చేసుకొని అంతర్జాతీయ వేదికపై భారత దేశ జెండాను, తెలుగువారి ఖ్యాతిని ఇనుమడింపజేయడం హర్షణీయం. ఒక ప్రాంతీయ భాషా చిత్రంలోని పాట హాలీవుడ్‌ సాంగ్స్‌ను తలదన్ని ఆస్కార్‌ను దక్కించుకోవడం భారతీయ సినీ చరిత్రలో మరపురాని ఘట్టం. తెలుగు ఫిలిం ఇండిస్టీ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించతగ్గ పర్వం.
          తెలుగు సినిమాను ఆస్కార్‌ దాకా తీసికెళ్లడానికి వెనుక 'ఆర్‌ఆర్‌ఆర్‌' చిత్ర బృందం చేసిన కృషి, పడ్డ శ్రమ, చూపించిన ధైర్యం, పట్టుదల ఎంతో ఉంది. ఎవరో ఒక్కరి వల్ల సాధ్యం కాలేదు. సమిష్టి శ్రమ ఇందులో దాగుంది. గీత రచయిత చంద్రబోస్‌, స్వరకల్పన చేసిన కీరవాణి, ఆలపించిన రాహుల్‌ సిప్లిగంజ్‌, కాలభైరవ, నర్తించిన ఎన్‌టిఆర్‌, రామ్‌చరణ్‌, కొరియోగ్రాఫర్‌ ప్రేమ్‌ రక్షిత్‌, తెరకెక్కించిన దర్శకుడు రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య, చిత్ర నిర్మాణం కోసం అహర్నిశలూ పని చేసిన ప్రతి ఒక్కరూ అభినందనీయులు. స్వాతంత్య్రోద్యమ వీరులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం మధ్య స్నేహాన్ని చాటిచెప్పే సందర్భంలో 'నాటు నాటు' పాట వస్తుంది. బ్రిటీష్‌ వలసవాద వ్యతిరేక ఇతివృత్తాన్ని సజీవంగా చిత్రీకరించారు. తెలంగాణ సంస్కృతికి, తెలుగువారి అభిరుచికి తార్కాణంగా నిలిచింది. తెలుగు మట్టి వాసనలను గీత రచయిత చంద్రబోస్‌ వెలుగులోకి తెచ్చి తెలుగు జానపదాన్ని విశ్వవ్యాప్తం చేశారు. తిరుగులేని గాన బృందం, ఉర్రూతలూగించే బీట్స్‌, అదరహో అనిపించే స్టెప్స్‌ 'నాటు నాటు' పాటను ప్రపంచ సంచలనంగా మార్చేశాయి.
            ప్రతిష్టాత్మక ఆస్కార్‌ అవార్డును ప్రవేశపెట్టి 125 సంవత్సరాలు కాగా అవార్డులు గెలుచుకున్న భారతీయుల సంఖ్య చాలా తక్కువ. ఇప్పటి వరకు 17 మంది నామినేట్‌ కాగా 10 మందికి పురస్కారం దక్కింది. 1957లో తొలిసారి మన దేశం నుంచి హిందీ సినిమా 'మదర్‌ ఇండియా' ఇంటర్నేషనల్‌ ఫీచర్‌ ఫిలిం కేటగిరిలో నామినేట్‌ కాబడి స్వల్ప ఓట్ల తేడాతో అవార్డు కోల్పోయింది. అప్పటి నుంచి ఆస్కార్‌కు మన దేశం నుంచి నామినేట్‌ అవుతున్నప్పటికీ, 1982లో 'గాంధీ' సినిమాకు బెస్ట్‌ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌గా భాను అతైయా మొదటిసారి ఆస్కార్‌ సాధించారు. ఆర్ట్‌ ఫిలింలు, జన జీవన ఇతివృత్తాలతో సినిమాలు తీసిన సుప్రసిద్ధ బెంగాలీ చిత్ర దర్శకనిర్మాత సత్యజిత్‌రేకు 1992లో ఆస్కార్‌ గౌరవ అవార్డు లభించింది. ఇప్పటి వరకు ఆ పురస్కారం అందుకున్న భారతీయుడు ఆయనొక్కరే. 2009లో 'స్లమ్‌ డాగ్‌ మిలియనీర్‌' అనే బ్రిటీష్‌ సినిమాకు సాంకేతిక విభాగాల్లో పని చేసిన భారతీయులు నలుగురికి ఆస్కార్‌ దక్కింది. ఆ సినిమాకే సంగీత దర్శకుడు ఎఆర్‌ రెహ్మాన్‌కు సౌండ్‌ మిక్సింగ్‌, మ్యూజిక్‌ రెండు అవార్డులొచ్చాయి. బెస్ట్‌ షార్ట్‌ ఫిలిం కేటగిరీలో గునీత్‌ మోంగాకు 2019లో ఆస్కార్‌ వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ యూనిట్‌కు, బెస్ట్‌ షార్ట్‌ ఫిలిం 'ఎలిఫెంట్‌ విస్పరర్స్‌'కు ఆస్కార్‌ లభించింది. ఉన్నత విలువలతో ఆస్కార్‌ దక్కేలా పోటీపడి సినిమాలు నిర్మించే విషయంలో భారతీయ చలన చిత్ర రంగం ఇంకా వెనుకనే ఉన్నదన్నది నిర్వివాదాంశం. నయా-ఉదారవాదం వచ్చాక మార్కెటింగ్‌ సూత్రాలు తప్ప సినిమాలకు మరొక లక్ష్యం ఉండటం లేదు. వినోదం కోసం నిర్మించే సినిమాలను సైతం విద్వేషాలకు వాడుకునే దుర్మార్గం బయలు దేరింది. ప్రస్తుతం దేశాన్ని ఏలుతున్నవారు వారే. వివాదాస్పద 'కాశ్మీర్‌ ఫైల్స్‌' మూవీ అందుకు ఉదాహరణ. నేటికీ సినిమా మాధ్యమం సమాజంపై ప్రభావం చూపిస్తోంది. ఉన్నత విలువలు, సాంకేతిక పరిజ్ఞానం, సందేశాత్మక, పురోగామి దిశలో సినిమాలు వస్తేనే సమాజ హితం. ఆస్కార్‌ సహా మరిన్ని పురస్కారాలను మన దేశ సినిమా, తెలుగు సినిమా సాధించాలని కోరుకుందాం.