- స్వాతి అనే కన్నా కలర్ స్వాతి.. అంటే వెంటనే గుర్తొస్తారు. తను నటి, వ్యాఖ్యాత, గాయకురాలు, డబ్బింగ్ కళాకారిణిగా అభిమానులకు తెలుసు. తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో నటించి, ప్రజల మన్ననలను అందుకున్నారు. వివాహం తర్వాత సినిమా కెరీర్‌కు బ్రేక్ ఇచ్చారు. ఇప్పుడు ఇండిస్టీకి మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చి 'మంత్ ఆఫ్ మధు' సినిమా చేశారు. ఈ సందర్భంగా ఆమె అభిమానులు, విలేకర్లతో పంచుకున్న పలుకులు.
స్వాతి తండ్రి నేవీలో ఉద్యోగి. తల్లి కూడా ఉన్నత విద్యావంతురాలే. తండ్రి ఉద్యోగ రీత్యా రష్యాలో ఉండగా, స్వాతి అక్కడే జన్మించారు. పుట్టినపుడు ఈమెకు స్వెత్లానా అని నామకరణం చేశారు. తర్వాత స్వాతిగా మార్చారు. వీరి కుటుంబం రష్యా నుంచి మొదటగా ముంబై, తర్వాత విశాఖపట్నానికి మారింది. ఈమె చిన్నతనంలో ఎక్కువభాగం విశాఖపట్నంలోనే గడిచింది. విద్యార్థి దశలో వక్తృత్వపు పోటీలు, డిబేట్లు, ఆటల పోటీల్లో చురుగ్గా పాల్గొనేవారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో ఉండగా ఈమె హైదరాబాదు వెళ్లారు. ఎంసెట్‌లో మంచి ర్యాంకు సాధించి, ఎం.బి.బి.ఎస్ సీటు తెచ్చుకున్నారు. కానీ తర్వాత బి.ఎస్.సి బయోటెక్నాలజీ చదివారు. తర్వాత ఫోరెన్సిక్‌లో పీజీ చేశారు. ఆమెకు సిద్ధార్థ్ అనే అన్నయ్య ఉన్నారు.
పదహారేళ్ల వయస్సులో ఈమె ఓ టీవీ ఛానల్లో ప్రసారమైన కలర్స్ అనే కార్యక్రమం ద్వారా వ్యాఖ్యాతగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. దాంతో 'కలర్స్ స్వాతి'గా పేరు వచ్చింది. తర్వాత మరికొన్ని ప్రసార కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా పనిచేశారు. ఇందులో భాగంగా నాగార్జున, ఉదరుకిరణ్ లాంటి నటులను ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. అప్పటి నుంచే సినిమా అవకాశాలు రావడం మొదలైంది. నటిగా స్వాతి మొదటి చిత్రం కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్', తర్వాత వెంకటేష్ కథానాయకుడిగా వచ్చిన 'ఆడవారి మాటలకు అర్థాలే వేరులే' సినిమాలో సహాయ పాత్రలో నటించారు. మూడో సినిమా 'అనంతపురం' (తమిళంలో సుబ్రహ్మణ్యపురం) సినిమాలో నేచురల్‌గా కనిపించేందుకు గంట, రెండు గంటల పాటు ఎర్రటి ఎండలో కూర్చున్నారు. దాంతో స్వాతి ఆ సినిమాలో నల్లపిల్లగా కనిపిస్తున్నారు. ఆమె హార్డ్ వర్క్ చూసి దర్శకులు ముచ్చటపడేవారు. 2008లో 'అష్టా చెమ్మా' చిత్రంలో హీరోయిన్‌గా, మహేష్‌బాబు అభిమానిగా నటించి, ప్రేక్షకులకు దగ్గరయ్యారు. సినిమా విజయవంతం అవడం వలన ఆమెకు మంచినటిగా పేరు వచ్చింది. నంది పురస్కారం లభించింది. తర్వాత వరుస సినిమా అవకాశాలు వచ్చాయి. 'జల్సా' సినిమాలో కథానాయిక ఇలియానాకు డబ్బింగ్ చెప్పారు. ఇలా చాలా మంది హీరోయిన్లకు డబ్బింగ్ చెప్పారు. 'తిపుర, కలవరమాయే మదిలో, కథ, స్క్రీన్ ప్లే దర్శకత్వం అప్పల్రాజు, మిరపకారు, స్వామిరారా, గోల్కొండ హైస్కూలు, కార్తికేయ, లండన్ బాబులు' వంటి సినిమాల్లో నటించారు.
స్వాతి కేవలం నటే కాదు, మంచి సింగర్ కూడా. స్వాతిలో ఉన్న ప్రతిభను గుర్తించిన మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ఆమెను ఓ సినిమాలో పాట పాడమని అడిగారు. ఆమె ఒప్పుకోకపోవడంతో ఏకంగా ఇంటికి వెళ్లి, ఆమె తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించారు. అలా సుకుమార్ డైరెక్షన్లో వచ్చిన '100% లవ్ సినిమాలో' ''ఏ స్క్వేర్ బి స్క్వేర్ ..'' అనే పాట ఫిమేల్ వర్షన్ పాడారు. ఈ సినిమాలో ఈ పాట హైలైట్‌గా నిలిచింది. ప్రేమించి పెళ్లి చేసుకుని లైఫ్‌లో సెటిల్ అవుతున్న క్రమంలో విభేదాల వల్ల భర్తతో విడాకులు తీసుకున్నారు. ప్రజెంట్ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి, 'పంచతంత్రం' సినిమాలో నటించారు. తన బెస్ట్ ఫ్రెండ్ అయిన సాయిధరమ్ తేజ్‌తో కలిసి 'సత్య' అనే షార్ట్‌ఫిలిమ్‌లో నటించారు. ఇప్పుడు హీరో నవీన్‌చంద్రతో కలిసి 'మంత్ ఆఫ్ మధు' చేశారు. ఈ సినిమాలో ట్రైలర్ లాంచ్ సందర్భంలో విలేకరులు ఆమెను కొన్ని వ్యక్తిగతమైన ప్రశ్నలు వేశారు. దాంతో ఆమె 'విడాకులకు సంబంధించి మీరు అడిగిన ప్రశ్నకు నేను సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇవ్వా... నేను చెప్పా.. నాకంటూ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. దానికి కట్టుబడి విడాకులపై నేను స్పందించను. ఇది సినిమా ఈవెంట్, ఇక్కడ ఆ ప్రశ్న అప్రస్తుతం' అంటూ నవ్వుతూనే సమాధానం ఇచ్చారు. దటీజ్ స్వాతి.. కలర్స్ స్వాతి..!
పేరు : స్వెత్లానా, స్వాతి, కలర్ స్వాతి
పుట్టిన తేది : 1987 ఏప్రిల్ 19
వృత్తి : నటి, వ్యాఖ్యాత, గాయకులు, డబ్బింగ్ కళాకారిణి
జీవిత భాగస్వామి : వికాస్ వాసు
తల్లిదండ్రులు : శివరామకృష్ణ, ఇందిరా దేవి