Sep 05,2023 11:01

 శ్రీలంక ప్రయత్నాలు
కొలంబో :
   శ్రీలంకలోని ఉత్తర ప్రావిన్స్‌లో పునర్వినియోగ ఇంధన ప్రాజెక్టును అమలు చేయడానికి అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌తో కుదుర్చుకున్న ఒప్పందాన్ని రెండు ప్రభుత్వాలు భారత్‌, శ్రీలంకల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంగా మార్చాలని శ్రీలంక ఇంధన శాఖ మంత్రి కోరినట్లు శ్రీలంక మీడియా తెలిపింది. మన్నార్‌లో 40కోట్ల అమెరికన్‌ డాలర్ల విలువైన, 500 మెగావాట్ల విద్యుత్‌ ప్రాజెక్టు కోసం అదానీ గ్రీన్‌ ఎనర్జీ లిమిటెడ్‌తో కుదిరిన ఒప్పందాన్ని రెండు ప్రభుత్వాల మధ్య కుదుర్చుకున్న ఒప్పందంలా మార్చాలని గత నెలలో శ్రీలంక కేబినెట్‌ కోరిందని కొలంబో నుంచి వెలువడే వార్తాపత్రిక ది సండే టైమ్స్‌ ఆదివారం పేర్కొంది. ఇటీవల శ్రీలంక విద్యుత్‌, ఇంధన శాఖ మంత్రి కంచనా విజిశేఖర ఈ మేరకు ఒక మెమొరాండాన్ని రూపొందించారు.

ఇదిలావుండగా, మన్నార్‌, పూనిరియాన్‌ల్లో పునర్వినియోగ ఇంధన అభివృద్ధి ప్రాజెక్టును అదానీ గ్రూపునకు ఇవ్వాలన్న నిర్ణయంపై కొన్ని వర్గాలు ఆందోళన వ్యక్తం చేసినట్లు ఆన్‌లైన్‌ పోర్టల్‌ న్యూస్‌ ఫస్ట్‌ పేర్కొంది. అంతర్జాతీయ జర్నలిస్టుల నెట్‌వర్క్‌ అయిన ఆర్గనైజ్డ్‌ క్రైమ్‌ అండ్‌ కరప్షన్‌ రిపోర్టింగ్‌ ప్రాజెక్టు (ఒసిసిఆర్‌పి) నిర్వహించిన దర్యాప్తు నేపథ్యంలో అదానీ గ్రూపుపై అంతర్జాతీయ మీడియా పరిశీలన జరుగుతున్న సమయంలోనే ఈ వార్తలు వెలువడ్డాయి.