Jun 03,2023 15:53

ప్రజాశక్తి-కాకినాడ : ఏపీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమైన నేపథ్యంలో శనివారం కాకినాడ జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ బ్లాక్ లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని జిల్లా కలెక్టరు డా. కృతికాశుక్లా అదనపు ఎస్పీ పీ.శ్రీనివాసు, రెవిన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. పరీక్షల నిర్వాహణ, అభ్యర్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టరు కృతికా శుక్లా ఈ సందర్భంగా పరిశీలించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరు మాట్లాడుతూ జూన్ 03 నుంచి 10వ తేదీ వరకు గ్రూప్-1 ప్రధాన పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించ బడుతున్నాయన్నారు. కాకినాడ జిల్లా జేఎన్టీయూలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రంలో రెండు బ్లాకుల్లో 460 మంది అభ్యర్థులు ఈ పరీక్షలకు హాజరువుతున్నారని ఆమె తెలిపారు. తొలి రోజు తెలుగు పరీక్షకు సంబంధించి 460 మందికి గాను 365 మంది అభ్యర్థులు హాజరైనట్లు కలెక్టరు కృతికా శుక్లా తెలిపారు. ఈ పర్యటనలో కలెక్టరు వెంట లైజనింగ్ ఆఫీసర్, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ వైస్ చైర్మన్ కె.సుబ్బారావు, జేఎన్టీయూ చీఫ్ సూపరింటెండెంట్, ప్రిన్సిపల్ డా.యూ.వీ.రత్నకుమారి, ఏపీపీఎస్సీ అసిస్టెంట్ సెక్రటరీ బీఎస్ఆర్.మూర్తి, ఎ.ఎస్వో బివీవీఎస్.శేఖర్, అర్బన్ తహసీల్దార్ సీతాపతి రావు ఇతర అధికారులు తదితరులు ఉన్నారు.