- ఎమ్మెల్యే చొరవతో 60 మంది దివ్యాంగులకు వీర్కో కంపెనీస్ ఆధ్వర్యంలో త్రిచక్ర మోటారు వాహనాలు పంపిణీ..
ప్రజాశక్తి-నరసరావుపేట(గుంటూరు) : దివ్యాంగుల పట్ల చిన్న చూపు వివక్ష తగదని ప్రతి ఒక్కరూ వికలాంగుల పట్ల ప్రేమ పూర్వకంగా మెలగాలని జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి అన్నారు. స్థానిక భువనచంద్ర టౌన్ హాల్ నందు శనివారం వీర్కో కంపెనీస్ అధినేత ఎన్.వెంకట రెడ్డి సహాయ సహకారాలతో రూ 1 కోటి విలువ చేసే త్రిచక్ర మోటారు వాహనాలను జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి, దాత వెంకట రెడ్డి లు కలిసి అర్హులైన దివ్యాంగులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల సానుకూల దృక్పథంతో ముందుకు వచ్చి త్రిచక్ర మోటార్ సైకిల్ ను వీర్కో కంపెనీస్ అధినేత వెంకట్ రెడ్డి అందజేయడం గొప్ప విషయమన్నారు. దివ్యాంగుల పట్ల స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి కృషితో వీర్కో కంపెనీ ముందుకు వచ్చి దివ్యాంగుల అవసరాలను తీర్చడం గొప్ప విషయమన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ 90 శాతం అంగవైకల్యం ఉన్నవారికి వాహనాలు అందించడం జరిగిందని ఇంకా చాలామంది దరఖాస్తు చేసుకోవడం జరిగిందని రానున్న రోజుల్లో వాహనాలను అందించడం జరుగుతుందని తెలిపారు. దాత వెంకటరెడ్డిని జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు. వెంకట రెడ్డి స్పూర్తితో ఆర్థిక వెసులుబాటు ఉన్న ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలలో ముందుండాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి వినాయకం, దివ్యాంగుల సంక్షేమ శాఖ అధికారిణి సువార్త తదితరులు పాల్గొన్నారు.










