Jul 28,2023 15:48
  • అధికారులను ఆదేశించిన జాయింట్ కలెక్టర్..

ప్రజాశక్తి - పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేటలో ఆగష్టు-20వ తేది నుండి ౩౦  వరకు నిర్వహించనున్న ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీని విజయవంతం అయ్యేలా తమకు కేటాయించిన పనులు పూర్తి చేయాలనీ జాయింట్ కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక నరసరావుపేట కలెక్టర్ కార్యాలయంలో స్పందన హాలులో ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశము నిర్వహించారు. ఈ సందర్బంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ క్రీడా ప్రాంగణములో ట్రాక్ ఏర్పాటు చేయుటకు ప్రతిపాదనలు సిద్దం చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అదే విధంగా  24 గంటలు వైద్య సేవలు అందించే విధముగా టీములను ఏర్పాటు చేయాలనీ, అంబులెన్స్ మరియు స్ట్రెచర్ లు అందుబాటులో ఉండేలా చూడాలని  జిల్లా వైధ్యాదికారిణి డాక్టర్ జి.శోభారాణి ని ఆదేశించారు. విధ్యుత్ అంతరాయం కలగకుండా నిరంతరం ఉండేలా చూడాలని అవసరమైన జనరేటర్ లను అందుబాటులో ఉంచాలన్నారు. మరుగుదొడ్లు, మంచి నీరు అందుబాటులో ఉంచాలన్నారు. క్రీడా ప్రాంగణములో ఇంటర్నెట్ సదుపాయము అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారికి సూచించారు. రిక్రూట్ మెంట్ విధులకు వచ్చే ఆర్మీ సిబ్బందికి  వసతి ఏర్పాటు చేయాలన్నారు. అవసమైన చోట సి.సి కెమేరాలను శాశ్వత ప్రాతిపదిక ఏర్పాటు చేయాలన్నారు. 6,7 జిల్లాల నుండి వచ్చే అభ్యర్ధులకు అర్ధం అయ్యేలా గుర్హింపు బోర్డులను, మ్యాపు బోర్డులను అవసరమైన ప్రాంతాలలో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమములో జిల్లా రెవిన్యూ అధికారి వినాయకం, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.