- గ్రామోదయంలో వైద్య సిబ్బందిని ఆదేశించిన జిల్లా కలెక్టర్
ప్రజాశక్తి-నరసరావుపేట : జిల్లాలో వినూత్నంగా చేపట్టిన గ్రామోదయం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం జిల్లా కలెక్టర్ శివ శంకర్ లోతేటి రొంపిచర్ల మండలం విప్పర్లపల్లి గ్రామంలో అసిస్టెంట్ కలెక్టర్ కల్పశ్రీ, మండల ప్రత్యేక అధికారి, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, గ్రామ సర్పంచ్ మండల స్థాయి అధికారులతో కలసి గ్రామంలో కలయ తిరిగి పలు సమస్యలను పరిష్కరించేలా చర్యలు చేపట్టారు. పర్యటనలో లో భాగంగా రక్తహీనత ఉన్న పిల్లలకు పరీక్షలు నిర్వహించి వారి తల్లిదండ్రులకు పలు సూచనలు సలహాలు అందజేశారు. అదేవిధంగా తక్కువ ఎత్తు,తక్కువ బరువు, పిల్లలకు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించేలా పలు సూచనలు సలహాలు అందజేశారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్యామిలీ ఫిజీషియన్ కార్యక్రమం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అదేవిధంగా పారిశుధ్యం పనులు లేబర్ మొబిలైజేషన్ వంటివి పలు విషయాలను అడిగి తెలుసుకున్నారు. వుయ్ లవ్ రీడింగ్ కార్యక్రమం క్షేత్రస్థాయిలో అమలుతీరును క్షుణ్ణంగా పరిశీలించి తగు సూచన సలహాలు అందజేశారు. గ్రామంలో ఉన్న చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. పరిశీలన అనంతరం కాఫీ విత్ క్లాప్ మిత్ర కార్యక్రమంలో పాల్గొని పలువురు పారిశుద్ధ్య కార్మికులను శాలువాతో సత్కరించారు. మురుగు కాలువ పరిశీలించి మురుగు కాలువలలో నీరు నిల్వ ఉండకుండా చెత్తను తొలగించాలని సంబంధిత సిబ్బందికి సూచించారు. గ్రామంలోని ప్రైమరీ స్కూల్ పరిశీలించి విద్యార్థులతో పాఠాలు చదివించారు. అదేవిధంగా అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది నుండి ఎప్పుడు ఎప్పుడు ఏమేమి అందిస్తున్నది, ఎంతమందికి సంపూర్ణ పోషణ అందిస్తున్నారు తదితర వివరాలు సేకరించారు.










