- 36.7 శాతానికి పడిపోయిన ఉపాధి రేటు
- హర్యానాలో అత్యధికం... ఛత్తీస్‌గఢ్ అత్యల్పం
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : దేశంలోకి భారీగా పెట్టుబడులు వస్తున్నాయని, ఉపాధి అవకాశాలు పెరుగుతున్నాయని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఓ పక్క విస్తృతంగా ప్రచారం చేసుకుంటుండగా, వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. దేశంలో నిరుద్యోగ రేటు మార్చిలో మూడు నెలల గరిష్ట స్థాయికి చేరింది. 7.80 శాతానికి పెరిగిపోయింది. ఈమేరకు ఆదివారం సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ (సిఎంఐఇ) విడుదల చేసిన గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. పట్టణ నిరుద్యోగ రేటు 8.51శాతం కాగా, గ్రామీణ నిరుద్యోగ రేటు 7.47 శాతం నమోదైంది. జనవరిలో 7.14 శాతం నిరుద్యోగ రేటు ఉండగా, అది ఫిబ్రవరి నాటికి 7.45 శాతానికి పెరిగింది. మార్చిలో 7.80 శాతానికి పెరిగింది. దేశంలో అత్యధికంగా నిరుద్యోగ రేటు నమోదైన రాష్ట్రాల్లో 26.8 శాతంతో హర్యానా, 26.4 శాతంతో రాజస్థాన్, 23.1 శాతంతో జమ్ముకాశ్మీర్ మొదటి మూడోస్థానాల్లో నిలిచాయి. 20.7 శాతంతో సిక్కిం, 17.6 శాతంతో బీహార్, 17.5 శాతంతో జార్ఖండ్, 15.9 శాతంతో గోవా, 11.7 శాతంతో హిమాచల్ ప్రదేశ్, 9.7 శాతంతో ఢిల్లీ తరువాత స్థానాల్లో నిలిచాయి. మిగిలిన రాష్ట్రాలనీు జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటును నమోదు చేసుకున్నాయి. 0.8 శాతంతో ఛత్తీస్‌గఢ్ అత్యల్ప నిరుద్యోగ రేటు నమోదు చేసుకుంది.
ఉపాధి రేటు ఫిబ్రవరిలో 36.9 శాతం నుంచి మార్చిలో 36.7 శాతానికి పడిపోయింది. సంఖ్యా పరంగా ఉపాధి రేటు 409.9 మిలియన్ల నుంచి 407.6 మిలియన్లకు పడిపోయింది. ''మార్చిలో దేశ కార్మిక మార్కెట్లు క్షీణించాయి. నిరుద్యోగిత రేటు ఫిబ్రవరిలో 7.5 శాతం నుంచి మార్చిలో 7.8 శాతానికి పెరిగింది. శ్రామిక శక్తి భాగస్వామ్య రేటు ఏకకాలంలో పడిపోవడంతో దీనిప్రభావం 39.9 శాతం నుంచి 39.8 శాతానికి పడిపోయింది'' అనిసిఎంఐఇ మేనేజింగ్ డైరెక్టర్ మహేష్ వ్యాస్ తెలిపారు.
- రాష్ట్రంలో స్వల్ప పెరుగుదల
ఆంధ్రప్రదేశ్‌లో 7.5 శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. జనవరి నెలలో 5.5 శాతం నిరుద్యోగ రేటు నమోదు కాగా, ఫిబ్రవరి నాటికి 6.6 శాతానికి పెరిగింది. మార్చిలో 7.5 శాతానికి పెరిగింది. తెలంగాణలో 5.2 శాతంతో జాతీయ సగటు కంటే తక్కువ నిరుద్యోగ రేటు నమోదైంది. ఫిబ్రవరి (5.8 శాతం) కంటే స్వల్పంగా తగ్గింది.










