ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : భారీ వర్షాలు, వరదల పట్ల అప్రమత్తంగా వుండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. వరదలు, వర్షాలపై సిఎం జగన్‌మోహన్‌రెడ్డి క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లతో శుక్రవారం సమీక్షించారు. వరదల ప్రభావం ఎక్కువగా వుండే అల్లూరి సీతారామరాజు, ఏలూరు, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, అంబేద్కర్ కోనసీమ జిల్లాల కలెక్టర్లు మరింత జాగ్రత్తగా ఉండాలన్నారు. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 53.81 అడుగులకు చేరుకునే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోందని, ధవళేశ్వరం వద్ద కూడా వరద ప్రవాహం 16 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశాలు ఉన్నట్టుగా అంచనా వేస్తున్నారని వివరించారు. వరద ప్రభావం ఉన్న ప్రాంతాల్లో సహాయం, పునరావాసం కార్యక్రమాలు అత్యంత సమర్థవంతంగా సాగాలన్నారు. అధికారులు మానవీయ కోణంలో సహాయం అందించాలని ఆదేశించారు. అదనంగా ఖర్చు చేసి అయినా బాధితులకు అండగా ఉండాలని ఆదేశించారు..లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని అన్నారు. వరద సహాయ శిబిరాల్లో మంచి సదుపాయాలు కల్పించాలన్నారు. ముంపునకు గురైన ఇళ్లు, అలాగే వరదనీరు ప్రవహించిన ఇళ్లు ఉను ప్రాంతాల్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేయాలనాురు. ఉదారంగా నిత్యావసరాలను అందించాలన్నారు. 25 కేజీల బియ్యం, కేజీ ఉల్లిపాయలు, కేజీ బంగాళా దుంపలు, కేజీ పామాయిల్, కేజీ కందిపప్పు ఇవ్వాలన్నారు. ప్రతి కుటుంబానికి రెండు వేలు ఇవ్వాలన్నారు. వ్యక్తులకైతే వెయ్యి రూపాయలు ఇవ్వాలన్నారు. ఇళ్ల నుంచి సహాయ శిబిరాలకు వచ్చిన వారిని తిరిగి పంపించేటప్పుడు ఇళ్లు దెబ్బతిను వారికి రూ.10 వేలు సహాయం అందించాలన్నారు. కచ్చా ఇంటిని నిర్మించుకోవడానికి ఈ డబ్బు ఉపయోగపడుతుందనాురు. ఈ నాలుగు సంవత్సరాల్లో ప్రతి ఏడాది కూడా ఇలాంటి పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొంటున్నామని ఈ ఏడాది కూడా అదేమాదిరి పనిచేయాలన్నారు. ప్రతి సచివాలయంలో కంట్రోలు రూమ్స్ ఏర్పాటు చేయాలన్నారు. ఈ కంట్రోల్ రూమ్స్‌ను జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకూ నిరంతరం సమీక్షిస్తుండాలని తెలిపారు. సచివాలయాల సిబ్బందిని, వలంటీర్ల సేవలను పూర్తిగా వినియోగించుకోవాలన్నారు.
- అండగా నిలవండి : ఎమ్మెల్యేలకు ఆదేశం
వరద బాదితులకు అండగా నిలవాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్యేలను ఆదేశించారు . ప్రతి ఎమ్మెల్యే వరద ప్రాంతాల్లో పర్యటించాలని కోరారు. ప్రజలు ఇబ్బందుల్లో వుండే ఇలాంటి సమయాల్లోనే క్షేత్రస్థాయిలో అండగా నిలవాలని సూచించారు.










