- రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర కార్మిక సంఘాల డిమాండ్
ప్రజాశక్తి-కాకినాడ : సిఐటియు కార్యాలయం నందు పోస్టల్ ఉద్యోగుల సమస్యలపై వేసిన రౌండ్ టేబుల్ సమావేశంలో కేంద్ర కార్మిక సంఘాలు పాల్గొని నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ గుర్తింపును పునరుద్ధరించెంత వరకు పోరాడాలని పోస్టల్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు దువ్వ శేషబాబ్జి, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర కార్యదర్శి జే వెంకటేశ్వరరావు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ ఆర్గనైజింగ్ సెక్రటరీ తాళ్లూరి రాజు, ఏఐసీసీటియు జిల్లా సహాయ కార్యదర్శి గొడుగు సత్యనారాయణ, బ్యాంక్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నాయకులు ఆదినారాయణమూర్తి మాట్లాడుతూ బ్రిటిష్ ప్రభుత్వంతో కార్మికులు పోరాడి సంఘం పెట్టుకునే హక్కును 1926 లో సాధించి మొట్టమొదట రిజిస్టర్ చేసిన సంఘం పోస్టల్ ఉద్యోగుల సంఘమని గుర్తుచేశారు. పోస్టల్ ఉద్యోగులలో 70 శాతం సభ్యత్వం కలిగిన నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ గుర్తింపును కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అసంభద్ద కారణాలతో రద్దు చేయడం ట్రేడ్ యూనియన్ 1926 చట్టానికి వ్యతిరేకమని, ఇది కార్మికుల పట్ల, ఉద్యోగ సంఘాల పట్ల బీజేపీ ప్రభుత్వానికి ఉన్న వ్యతిరేకతను తెలియజేస్తుందని విమర్శించారు. 44 కార్మిక చట్టాలను రద్దుచేసి, నాలుగు లేబర్ కోడ్లను కరోనా టైంలో దొంగచాటుగా తీసుకురావడం వెనక అసలు ఉద్దేశాన్ని ఈ చర్య బహిర్గతం చేసిందని, ఉద్యోగులు గమనించి బిజెపి కార్మిక, ఉద్యోగ, రైతాంగ వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పోస్టల్ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వ నిర్బంధాన్ని తట్టుకోలేక 3శాతం సభ్యులు కూడా లేని బీజేపీ అనుకూల సంఘంలో చేరడమంటే మన వేలితో మనకన్నే పొడుచుకున్నట్లు పోస్టల్ ప్రేవేటికరణకు అంగీకరించడమేనని హితవుపలికారు. పోస్టల్ ఉద్యోగులు చేసే పోరాటాలకు కేంద్ర కార్మిక సంఘాలు బ్యాంకు ఉద్యోగులు, ఎల్ఐసి, బిఎస్ఎన్ఎల్, ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు అందరు కూడా సంపూర్ణం మద్దతు తెలియజేస్తామని తెలిపారు. ఈ చర్య పోస్టల్ ఉద్యోగులతో ఆగేది కాదని, మరిన్ని గుర్తింపు సంఘాలను రద్దు చేయడానికి మోడీ ప్రభుత్వం ముందుకెళ్తుందని, విశాఖ ఉక్కు ప్రైవేటికరణ కాకుండా కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిసి పోరాడిన ఫలితంగానే నేటికీ విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయలేకపోవడాన్ని బిజెపి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతుందని ఎద్దేవా చేశారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం 10 గంటలకు హెడ్ పోస్ట్ ఆఫీస్ వద్ద కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్ గుర్తింపును పునరుద్ధరించాలని కోరుతూ చేసే ఆందోళనకు మేధావులు ప్రజా సంఘాలు రాజకీయ పార్టీలు మద్దతు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.ఎఫ్.పి.ఇ కాకినాడ డివిజన్ అధ్యక్షులు జి.అనితాకుమారి, కార్యదర్శి పి.సాగర్, ఉపాధ్యక్షులు కె.పి.వి.ఎల్.ఎస్.ఎన్ మూర్తి, ఎం.అనిల్, సహాయ కార్యదర్శి లోవరాజు, మెంబర్ జి.డి.ఎస్. ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, జిల్లా కోశాధికారి మలకా రమణ, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు నర్ల ఈశ్వరి, ఈపీఎఫ్ పెన్షనర్ల సంఘం రాష్ట్ర కోశాధికారి సత్యనారాయణ రాజు, ఏపీఎంఎస్ఆర్.యు నగర అధ్యక్షులు అప్పలస్వామి తదితరులు పాల్గొన్నారు.










