May 27,2023 15:27
  • సీఐటీయూ

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ : రాజంపేట కేంద్రంగా 30 పడకల ఈయస్ ఐ ఆసుపత్రి నిర్మించాలని సీఐటీయూ జిల్లాప్రధాన కార్యదర్శి ఎ.రామంజులు, జిల్లా ఉపాధ్యక్షులు సి.రవికుమార్  డిమాండ్ చేశారు. శనివారం స్థానిక  మున్సిపల్  కార్యాలయం ఎదుట  సీఐటీయూ రాష్ట్ర  కమిటీ పిలుపు మేరకు ఈయస్ఐ పథకాన్ని బలోపేతం చేయాలని జరిగిన ధర్నా  కార్యక్రమంలో వారు మాట్లాడుతూ అసంఘటితరంగ కార్మికుల వైద్యం కొరకు కార్మికుల జీతాలలో డబ్బు కట్ చేసి స్లిప్పులు ఇస్తున్నారు తప్ప ఆ డబ్బులు రిజర్వ్ బ్యాంకులో వేసి పెట్టుబడిదారులకు రాయితీ రూపంలో ఇస్తున్నారని.. అసంఘటితరంగ కార్మికులకు వైద్యసదుపాయాలు కల్పించలేదని అన్నారు. రాజంపేటలో వేలాదిగా ఇయస్ఐ నోచుకోని కార్మిక, ఉద్యోగుల సంక్షేమం కోసం ఈయస్ఐ డిస్పెన్సరీ ఏర్పాటుచేయాలన్నారు. ఈయస్ఐ స్కీమ్ ద్వారా కార్మికులు, ఉద్యోగులకు మందులు, సిక్ లీవులు, నిరుద్యోగభృతి, పెన్షన్లు వంటి తదితర సౌకర్యాలకొరకు తమ వేతనం లోని కొంత నగదును  ఎంప్లాయ్ మెంట్ స్టేట్ ఇన్సూరెన్స్ పేరుతో  రిజర్వ్ బ్యాంక్ లో జమ చేసిన మొత్తం లక్షా పదివేల కోట్లు ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్కడా కూడా పరికరాలు, మందులు, ఉద్యోగ నియామకాలు చేపట్టకుండా పేద కార్మికులకు అరకొరగా అందుతున్న వైద్యాన్ని కూడా పూర్తి ప్రైవేటీకరణ  చేసే దశలో భాగంగా డిస్పెన్సరీలను నిర్వీర్యం చేస్తున్నాయని తెలిపారు. కార్మికులు ప్రజలతో కలసి ఈయస్ ఐ పథకాన్ని బలోపేతం చేసే వరకు ప్రభుత్వాల పై ఒత్తిడి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ  కార్యక్రమంలో మున్సిపల్  కార్మికులు ఓబయ్య, ప్రసాద్, లక్ష్మిదేవి, మధు, సాలమ్మ, నాగరాజ, శ్రీను, రాములమ్మ, వరలక్ష్మి తో పాటు పలువురు మున్సిపల్  కార్మికులు పాల్గొన్నారు.