- సిఐటియు పశ్చిమ నగర 16వ మహాసభలలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు
ప్రజాశక్తి-వన్ టౌన్: కేంద్రంలో బిజెపి, రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వలు విధానాలపై రాజకీయ పోరాటానికైనా సిద్ధం కావాలని కార్మికులకు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. సిఐటియు పశ్చిమ నగర మహాసభ 16వ మహాసభ ఆదివారం మోటూరి హనుమంతరావు శ్రామిక భవనంలో జరిగింది. తొలుతగా సిఐటియు జెండాను ముఠా వర్కర్స్ యూనియన్ నాయకులు పి ఎర్రకయ్య ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల మృతి చెందిన ఎస్ ఎం సుభాని, కే సురేష్, ఎస్.వి పెద్ద చెంచయ్య, ఎం అప్పలస్వామి చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అందరూ ఒక నిమిషం మౌనం పాటించారు. ఈ సందర్భంగా జరిగిన మహాసభ లో ఈవి నారాయణ అధ్యక్షత వహించారు. ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు ఏ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేసేందుకు ప్రయత్నించడం బాధాకరమన్నారు. నాలుగు కార్మిక చట్టాలను అమలు చేయటం తగదన్నారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెడుతున్న బిజెపి విధానాలకు వ్యతిరేకంగా కార్మిక వర్గం సిఐటియు పోరాటాలు చేస్తుందన్నారు. రాష్ట్రంలో విద్యుత్తు మీటర్ల బిగించాలని ఆలోచనను ప్రభుత్వాలు విరమించుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం మోడీ పాలనకు తీరుకు నిరసనగా ఢిల్లీలో రైతులు ఏడాది పాటు చేపట్టిన ఉద్యమం ద్వారానే సమస్యల సాధించుకున్నారని వెంకటేశ్వరరావు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం కార్మికుల బాగోగులను పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. నేడు ముఠా రంగంలో కొత్త కొత్త పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని ఆటో రంగం కుదేలవుతుందన్నారు. వైసిపి ప్రభుత్వం కార్మికుల ఆటోలపై వివిధ రకాల పన్నులు , పోలీసులు కేసులు రూపంలో వేలకువేలు చలానాలు వసూలు చేస్తున్నారని మండిపడ్డారు. మరోపక్క నూతన విద్యా విధానాని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిర్వీర్యం చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో నిత్యవసర ధరలు పెరిగిపోయాయని సామాన్య మానవుడు పేద మధ్యతరగతి కుటుంబీకులు కార్మికులు జీవన భృతి కష్టతరంగా మారిందన్నారు. అన్ని వర్గాలను ఆదుకుంటామని చెప్పి అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం కార్మికుల కష్టాన్ని దోచుకుంటుందన్నారు . కార్మికులకు వేతన సవరణలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరిన పట్టించుకునే పరిస్థితి లేదన్నారు. పశ్చిమ నియోజకవర్గంలో అనేక రంగాలలో చెందిన కార్మికులు ఎక్కువగా ఉన్నారని తెలిపారు. రాబోయే రోజుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు కార్మికులంతా కలిసికట్టుగా ఉద్యమాలకు సిద్ధం కావాలని సిఐటియు అండగా ఉంటుందని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పశ్చిమ సిటీ కార్యదర్శి బోయి సత్యబాబు, అధ్యక్షులు నారాయణ ,ఎస్ సుబ్బారెడ్డి, బాబు ఖాన్, సాంబులు, తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజా నాట్యమండలి జిల్లా కార్యదర్శి పి అప్పన్న విప్లవ గేయాలు ఆలపించారు










