May 20,2023 15:00

ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం పట్టణ పరిధిలో ట్రాఫిక్ ఇబ్బందుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని సీఐ షేక్ అబ్దుల్ నబీ అన్నారు. శనివారం స్థానిక మున్సిపల్ సెంటర్లోని అంబేద్కర్ భవనంలో మున్సిపల్ కమిషనర్ జె సురేంద్ర అధ్యక్షతన ట్రాఫిక్ నియంత్రణపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ ఎస్ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు డి.ఎస్.పి లతా కుమారి సూచనలతో పెద్దాపురం ఎస్సై వి సురేష్, పోలీసు సిబ్బంది పట్టణ పరిధిలో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి ట్రాఫిక్ సమస్యలు ఎక్కడ ఉత్పన్నమవుతున్నాయో ఆయా స్పాట్లు గుర్తించామన్నారు.ఈ ట్రాఫిక్ సమస్య నివారణకు అన్ని శాఖల అధికారులతో జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం నిర్వహించామన్నారు. ప్రతి ఒక్కరూ,వ్యాపారులు ట్రాఫిక్ నియంత్రణలో పోలీసులకు సహాయ సహకారాలు అందించాలన్నారు. ప్రతి షాపు వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పలువురు వ్యాపారులు పలు సూచనలు తెలియజేశారు. ఈ సమావేశంలో ఎస్సై వి సురేష్, మున్సిపల్ చైర్ పర్సన్ బొడ్డు తులసి మంగతాయారు, వైస్ చైర్మన్లు నెక్కంటి సాయి ప్రసాద్, కనకాల మహాలక్ష్మి, పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు.