
అనేక సాహిత్య ప్రక్రియల్లో లబ్ధ ప్రతిష్టుడైన రచయిత అట్టాడ అప్పల్నాయుడు ఇప్పటివరకూ 110 కథలు (6 సంపుటాలు), 5 నవలలు (ఇటీవల వచ్చిన 'బహుళ' ఉత్తరాంధ్ర జీవన నేపథ్యంతో వచ్చిన బృహత్‌్ నవలగా విమర్శకుల ప్రశంసలకు నోచుకుంది), 3 నాటకాలు (వంద తెలుగు ఉత్తమ నాటకాల సంకలనంలో ఆయన 'మడిచెక్క' చోటు దక్కించుకుంది), 3 నాటికలు (రేడియో), ఒక కాలమ్ (నేస్తం ఊసులు వ్యాస సంపుటి) వెలువడ్డాయి. ఇవికాక సందర్భోచితంగా అనేక అంశాల మీద ఆయన రాసిన వ్యాసాలు అనేకం.
అట్టాడ తన రచనలన్నిటా ఉత్తరాంధ్ర ప్రజల జీవద్భాషను అద్భుతంగా వినిపిస్తారు. యాసను, సంభాషణల్లో పలికే ఇకటాన్ని పవర్ స్ప్రేయర్‌లా పాఠకుల మెదళ్ళలోకి ఎంతో సాంద్రంగా పిచికారీ చేస్తారు. గత ఆగస్టులో జరిగిన ఆయన సప్తతి ఉత్సవంలో ఆయన సరికొత్త కథా సంపుటి 'చిటికెన వేలు' ఆవిష్కరణ జరిగింది. రచయితకు జన్మదిన కానుకగా దీనిని ఛాయా రీసోర్సెస్ సెంటర్ నిర్వాకులు మోహన్‌బాబు తమ సంస్థ ద్వారా ముద్రించారు. ఈ సంపుటిలో వస్తు వైవిధ్యత కలిగిన 18 కథలున్నాయి. ఒక కథకుడు విభిన్నమైన వస్తువులను పట్టుకోవడం ఒక ఎత్తైతే, వాటిని అంతే సమర్థవంతమైన కథలుగా మల్చడం మరొక ఎత్తు. ఈ రెండు విషయాల్లోనూ అప్పలనాయుడు చెయ్యి తిరిగిన రచయిత. ఈ సంపుటికి శీర్షికగాను, పుస్తకంలో ఆఖరి కథ గాను వున్న 'చిటికెన వేలు' ఓ ఆసక్తికరమైన కథ. మహాభారత కాలంలో గిరిజన యోధుడు ఏకలవ్యుడు, ఉన్నత వర్గాలకు చెందిన గురుశిష్యుల కుట్రకు బలవుతాడు. గురువే కాని గురువు గురుదక్షిణ పేరుతో యాచించడంతో తన కుడిచేతి బొటనవేలిని తనే కోసి ఇస్తాడు. ఈ కథలోనూ కొంచం అటూ ఇటుగా అదే జరిగింది.
ఇటికి జమీందార్ తన జమీలోని గిరిజనులు ఆరుగాలం కష్టించి పండించిన పంటలను వారి తిండికి కూడా లేకుండా వారితోనే తన ఇంటికి మోయించుకు పోతుంటాడు. వారి స్త్రీలను చెరపడతాడు. ఈ ఆగడాలను సహించలేని మల్లయ్య బాధితులందరినీ కూడగట్టి జమీందర్ మీద తిరుగుబాటు చేస్తాడు. జమీందార్ ఆంగ్లేయుల సాయంతో ఆ తిరుగుబాటును అణిచివేసి, మల్లయ్యను ఉరి తీయిస్తాడు. స్వాతంత్య్రానంతరం సర్కారు వారి డిపార్ట్‌మెంట్ల మనుషులు, పల్లం నుంచి వచ్చిన వర్తకులు, కాంట్రాక్టర్లు కుమ్మక్కై గిరిజనులను పీడిస్తుంటారు. ఆ పీడనకు వ్యతిరేకంగా సోమన్న దొర సాయుధుల్లో కలిసిపోయి రాజ్యం మీద తిరుగుబాటు చేస్తాడు. పోలీసులు అతడి కోసం వేట మొదలు పెడతారు. తమ సౌలభ్యం కోసం ఆ ఇటికి గూడ పేరును సోమన్న గూడగా మార్చేస్తారు. సోమన్న దొర పోలీసులకు దొరికిపోయి కొన్నేండ్లు జైలుకెళ్ళి వస్తాడు. అప్పటికి ఊరి తీరు పూర్తిగా మారిపోతుంది. వ్యాపారులు రకరకాల పద్ధతుల్లో గిరిజనులకు కొత్త కొత్త అలవాట్లు నేర్పించి అప్పులపాలు జేశారు. ఆఫీసర్లు సోమన్న గూడను యస్జీ గూడ గాను, దానికి దగ్గర్లోనే ఉండే గెడ్డను ఫాల్స్ గాను మార్చి... ఆ ప్రాంతాన్ని యస్జీ ఫాల్స్ పేరిట పెద్ద టూరిస్ట్ సెంటర్‌గా మార్చేస్తారు. వ్యాపారులు గిరిజనుల భూముల్ని కొనేస్తారు. సోమన్న దొర ఒక్కడూ తన భూమిని అమ్మనని భీష్మిస్తాడు. అధికార్లు, వ్యాపారులు కుమ్మక్కయ్యి అతని కొడుకు బుధడి ద్వారా సోమన్న దొర లొంగివచ్చేలా చేస్తారు. భూమిని అమ్మిన సోమన్న దొర కొడుకుతోపాటు స్టాంప్ పేపర్ల మీద సంతకం పెట్టి .. ఆ కాగితాలతోపాటు తన చిటికెన వేలిని కోసి పేపర్లో చుట్టి ఇస్తాడు. విస్తుబోయిన అధికారులు 'ఇదేంట'ని ప్రశ్నిస్తారు. దానికతను 'మా తాత ముత్తాతల కాలం నుంచి నా తరందాకా మేమంతా మా తండ్రుల చిటికెన వేళ్ళు పట్టుకుని వాళ్ళ అడుగుల్లో అడుగులు వేస్తూ ముందుకు సాగాం. మీ కుట్రల కారణంగా మా పిల్లలకు భూములతో సంబంధాలు తెగిపోయాయి. మమ్మల్ని మాలాగ బతకనివ్వకుండా చేశారు. ఇప్పుడు నాకీ చిటికెనవేలితో పనిలేదు. అందుకే నా అంతట నేనే దానిని కోసుకుని మీకు కానుకగా ఇస్తున్నాను' అంటాడు. ఇదీ కథ. పాఠకులు ఉలిక్కిపడేలా, అన్యాయాన్ని ఎత్తిచూపేలా మలిచిన తీరు ఎంతో గొప్పగా ఉంటుంది.
సంపుటిలో మొదటి కథ 'భౌ.. భౌ .. భౌ..'. ఇందులో గౌరీశ్వరి... వీథులెంట కాగితాలు ఏరి అమ్ముకుంటూ పొట్టపోసుకునే కుటుంబంలోని అమ్మాయి. ఆ అమ్మాయిని వల్లో వేసుకోవాలనే ఆలోచనతో పెళ్ళి చేసుకుందామంటూ, ఊరి సర్పంచ్ పెంపుడు కుక్క లాంటి సింహాచలం చేసే వ్యవహారాలన్నింటినీ చూపించుకుంటూ వచ్చిన కథకుడు... చివరికొచ్చేసరికి గౌరీ వాళ్ళ ఊరు మొత్తాన్ని సర్పంచ్ వాళ్ళు కబ్జా చెయ్యడానికి ఎత్తు వెయ్యడాన్ని, ఊర కుక్కల మూకుమ్మడి దాడికి సర్పంచ్ సీమకుక్కలు పలాయనమైపోవడాన్ని చెబుతారు. సాధారణ జనం తిరగబడితే ఎంతటి వాడైనా అంతిమంగా తోక ముడవాల్సిందేనన్న నగ సత్యాన్ని ఈ కథలో చూపిస్తాడు. అధికారం, డబ్బు, హౌదా ఉన్నాయి కదాని పేదల జోలికి వస్తే... అదీ వారి మౌలిక అవసరాలైన కూడు, గూడు కొల్లగొట్టాలని చూస్తే.. పెను పామును చంపే చలి చీమల్లా తిరుగుబాటు చేస్తారంటూ కథను పతాకస్థాయికి తీసుకుపోతాడు. ఇక్కన్నుంచి కథాగమనం ఎలా వుండాలో మీరే ఊహించండి అన్నట్టు పాఠకుల మెదళ్ళకు పని కల్పిస్తాడు.
మరో మంచి కథ 'దెయ్యపు భరోసా'. ఇవ్వాళ రాజకీయ నాయకుల భరోసా దెయ్యాలిస్తున్న భరోసాల్లా అన్పిస్తున్నాయి తప్ప నాయకులిస్తున్నట్టుగా లేవు అన్న ఎరుకను అందిస్తుంది. మనచుట్టూ ఏం జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి అంటూ అప్రమత్తం చేసే కథ 'పితలాట కం'. ఇప్పుడున్న స్వార్థ పార్టీల దొంగా టకంలో దేశప్రజలు ఎలా నలిగిపోతున్నారో కళ్ళకు కట్టినట్టు చెబుతుంది. భగవంతుడికి కూడా తెలియకుండా భాగ్యవంతుడు పేదవాళ్ళ బతుకుల మీద యెక్కి తొక్కి తొక్కి కుమ్మేస్తున్న వైనాన్ని 'పిడికిలి' కథలో వివరించారు.
ఇలా సంపుటంలోని ప్రతి కథా అట్టడుగు ప్రజల కడగండ్ల పట్ల సానుభూతితో, వర్గ స్ప ృహతో చెప్పినదే! అవినీతి, ఆశ్రిత పక్షపాత నాయకుల, భూ కబ్జాదార్ల, అవినీతిపరులైన అధికార్ల మీద సంధించిన ఫిరంగి గుండ్ల లాంటి కథలివి. కమ్యూనిస్టు పార్టీల చీలిక వల్ల ఈ దేశ రాజకీయాలకు, సామాన్యులకు, శ్రామికవర్గానికి ఎంత నష్టం జరిగిందో, జరుగుతుందో, జరగనుందో అంటూ కథకుడు అప్పల్నాయుడు వెలిబుచ్చిన ఆవేదన ఎన్నో కథల్లో వినబడుతుంది. సామాజిక ప్రయోజనం గల ఇలాంటి కథలు అట్టాడ గారి కలం నుంచి మున్ముందు మరిన్ని రావాలి!
- శిరంశెట్టి కాంతారావు
98498 90322