
- సిద్ధార్థ్ కథానాయకుడిగా నటించడమే కాకుండా, నిర్మాతగా కూడా చేసిన సినిమా 'చిన్నా'. ఈ సినిమా తమిళంలో 'చిత్తా'గా విడుదలై అక్కడ మంచి ప్రశంసలు, పేరు సంపాదించింది. ఆ తరువాత తెలుగులో విడుదల చేసారు సిద్ధార్థ్. అప్పుడే సినిమా ప్రచారాలు సందర్భంగా ఎంతో భావోద్వేగానికి గురయ్యారు కూడా. 'ఈ సినిమా బాగోలేదు అంటే, తాను ఇక తెలుగులోకి తన సినిమాలు విడుదల చెయ్యను' అని చెప్పారు. అంటే అతను ఈ సినిమా మీద ఎంతగా నమ్మకం పెట్టుకున్నారో అర్థమవుతోంది. దీనికి ఎస్ యు అరుణ్‌కుమార్ దర్శకుడు.
ఈ మధ్యకాలంలో చిన్నారులపై, స్కూలు పిల్లలపై అత్యాచారాలు ఎక్కువయ్యాయి. ఈ నేపథ్యంలో వారి కుటుంబ పరిస్థితి, పిల్లల మానసికస్థితి, సమాజం వారిని ఎలా చూస్తుంది అన్న నేపథ్యంలో ఈ సినిమాను తీశారు. అందుకు సిద్ధార్థ్‌లాంటి హీరో ప్రధానపాత్ర పోషించడం కీలకం. ఒక సున్నితమైన అంశం తీసుకొని, దానికి కొంచెం థ్రిల్లింగ్ అంశాలు జోడించి, ఎక్కడా ఎబ్బెట్టుగా గానీ, మితిమీరకుండా చాలా జాగ్రత్తగా తీసిన సినిమా ఈ 'చిన్నా'.
కథలోకి వెళితే.. తెలంగాణలోని యాదాద్రి అనే పట్టణంలో ఒక మున్సిపల్ ఆఫీసులో ఉద్యోగం చేస్తూ ఉంటాడు ఈశ్వర్ అలియాస్ చిన్న (సిద్దార్థ్). అతని అన్నయ్య అకాలంగా మరణిస్తే, అతని కూతురు చిట్టి (సహస్రశ్రీ), వదినని బాధ్యతగా చూసుకుంటూ ఉంటాడు. చిట్టి అంటే చిన్నాకి ప్రాణం, ఎప్పుడూ తనే స్కూలుకి తీసుకెళ్లడం, తీసుకురావటం చేస్తూ ఉంటాడు. అప్పుడప్పుడూ ఎస్సై అయిన తన స్నేహితుడితో కలిసి టైం పాస్ చేస్తూ ఉంటాడు.
ఈ క్రమంలో కాలేజీలో ఉన్నప్పుడు తాను లవ్ చేసిన అమ్మాయి శక్తి (నిమిషా సజయన్) పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తుంటుంది. ఆమెను ప్రేమిస్తాడు. లైఫ్ సాఫీగా సాగిపోతోంది అన్న సమయంలో ఎస్సై మేనకోడలు, చిట్టి స్నేహితురాలు అయిన మున్ని (సబియా తస్నిమ్) లైంగిక దాడికి గురవుతుంది. చిన్నా ఆ రోజు మున్ని అదోలా ఉండటం గమనించి, చిట్టిని స్కూలు దగ్గరే ఉండమని చెప్పి, మున్నిని ఇంటిదగ్గర దింపడానికి వెళతాడు. తరువాత మున్నిపై లైంగిక దాడి చేసింది చిన్నానే అనే ఆరోపణలు వస్తాయి. చిన్నా స్నేహితులు కూడా అదే నమ్ముతారు. పరువుపోతుందని పోలీసు కంప్లైంట్ ఇవ్వడానికి మున్ని కుటుంబ సభ్యులు ఒప్పుకోరు. చిన్నానే చేసాడు అనడానికి ఒక వీడియో కూడా బయటకి వస్తుంది. చిన్నా వదిన కూడా చిన్నానే అనుమానిస్తుంది. అందరూ షాక్‌కి గురవుతారు. అయితే అదే సమయానికి చిట్టి మిస్ అవుతుంది. అసలు మున్నీని అత్యాచారం చేసింది చిన్నానేనా? చిట్టి ఎలా మిస్ అయ్యింది? చిట్టి చివరికి దొరికిందా? లేదా? చిన్నా మీద పడ్డ ఆరోపణలలో నిజమెంత? అనేవి తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. నిజానికి ఈ సినిమా కథ కొత్తది ఏమీ కాదు. కమల్‌హాసన్ 'మహానది', సాయి పల్లవి 'గార్గి' సినిమాలలో చూపించిన చైల్డ్ అబ్యూజ్‌ను ప్రధానాంశంగా ఎంచుకున్నారు. నిజానికి పిల్లలు అన్నం తినడం లేదనో, ఇంకా ఏవేవో కారణాలతోనో వారికి ఫోన్లు ఇచ్చి అలవాటు చేస్తున్నారు. అలా చేయడం ఎంత ప్రమాదకరమో? పిల్లలకి బ్యాడ్ టచ్ గుడ్ టచ్ లాంటివి తెలుపకుండా ఉంటే ఎలాంటి స్థితికి దారి తీస్తుంది అనే విషయాలు చాలా కటువుగా చూపించారు. నిజానికి చైల్డ్ అబ్యూజ్ లాంటివి జరిగినప్పుడు, నిందితులపై బాధితురాలి కుటుంబసభ్యులు మాత్రమే కాదు సభ్య సమాజం కూడా తీవ్రమైన ద్వేషం కనబరుస్తారు. వీలైతే చంపాలి అన్నంత కోపాన్ని చూపిస్తారు. ఇది సరైనది కాదు.
కానీ బాధితులు పక్కన ఉండి, వారికి ధైర్యం చెప్పాలి. ఏమైనా జరిగినా చెప్పాలనీ, మీకు మేం అండగా ఉన్నామని చెప్పే ప్రయత్నం చేయక పోవడాన్ని ప్రశ్నించిన పాయింట్ సినిమాకి హైలైట్. ఇక ఇంట్లో మామలు, బాబాయిలు కూడా ప్రమాదకరమే అని హెచ్చరిస్తూనే బయటివారితో ఎలా మెలగాలి అనే విషయాన్ని చిన్న పిల్లలకి నేర్పాల్సిన విషయాన్నీ సినిమా ప్రధానంగా చర్చకు దారితీస్తుంది. రొటీన్ కథ, కథనాలు అయినా తరువాత ఏమి జరిగిందో తెలుసుకోవాలనే ఆసక్తి ప్రేక్షకుల్లో ఏర్పరచడంలో దర్శకుడు సక్సెస్ అయ్యారు.
నటీనటులు : సిద్ధార్థ్, నిమిషా సజయన్, సహస్రశ్రీ, అంజలి నాయర్ తదితరులు
నేపథ్య సంగీతం : విశాల్ చంద్రశేఖర్
సంగీతం : దిబు నినన్ థామస్, సంతోష్ నారాయణన్
నిర్మాత : సిద్ధార్థ్
దర్శకత్వం : ఎస్‌యుఅరుణ్‌కుమార్