May 20,2023 15:53

ప్రజాశక్తి - పెద్దాపురం : పెద్దాపురం ప్రాంతీయ ప్రభుత్వాసుపత్రిలో మెరుగైన వైద్య సదుపాయాల కోసం కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. శనివారం స్థానిక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆసుపత్రి సూపరింటెండెంట్  డాక్టర్ సూర్య కుమారి అధ్యక్షతన జరిగిన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోస్టుమార్టం రూమును  మార్చవలసి ఉందన్నారు.ఆసుపత్రి అభివృద్ధికి సంబంధించిన పెండింగ్ వర్క్ లన్ని వేగవంతంగా పూర్తి చేయాలన్నారు.ఆపరేషన్ థియేటర్లో అవసరమైన సదుపాయాలన్నీ ఏర్పాటు చేయాలన్నారు.ఆసుపత్రిలో రోగులకు,సందర్శకులకు స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ఆర్ ఓ ప్లాంట్ ఏర్పాటు చేస్తామన్నారు.ఆసుపత్రికి బయట వేచి ఉండేందుకు షెడ్డు నిర్మిస్తామన్నారు. ఈ ఆసుపత్రికి రావాల్సిన ఇద్దరు స్టాఫ్ నర్సులను వెంటనే పంపించాలని వైద్య విధాన పరిషత్ అధికారులతో ఆయన ఫోన్లో మాట్లాడారు.పెద్దాపురం పరిసరాలలోని పారిశ్రామికవేత్తల సహాయ సహకారాలతో మరిన్ని సదుపాయాలు కలిపిస్తామన్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి అంతా పరిశీలించి రోగులతో మాట్లాడారు.ఈ సమావేశంలో సూపరింటెండెంట్ డాక్టర్ సూర్య కుమారి, డాక్టర్లు సతీష్, శ్రీనివాస్, జగదాంబ, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు మామిడి ఈశ్వరరావు,   చల్లా బ్రహ్మాజీరావు, పద్మావతి తదితరులు పాల్గొన్నారు.