- కీలక లోహాల ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయం
బీజింగ్ : అమెరికా, జపాన్‌లతో సాగుతున్న చిప్ యుద్ధంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. చిప్‌ల తయారీలో కీలక లోహాలైన గాలియం, జర్మానియం ఎగుమతులను, ఆ లోహాల కాంపౌండ్ల ఎగుమతులను నియంత్రించాలని నిర్ణయించింది. అధునాతనమైన చిప్‌లు, చిప్ తయారీ పరికరాలను చైనాకు పంపకుండా అమెరికా, జపాన్‌లు ఎగుమతులను నిషేధించిన నేపథ్యంలో చైనా అందుకు ప్రతిగా ఈ నిర్ణయం తీసుకుంది. ఆగస్టు 1 నుండి ఈ నిర్ణయం అమలు కానున్నట్లు చైనా వాణిజ్య మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. గాలియం నైట్రైడ్, జర్మానియం డయాక్సైడ్‌లతో పాటు 38 ఉత్పత్తుల ఎగుమతులకు ప్రభుత్వ లైసెన్సుల కోసం చైనా రసాయన సరఫరాదారులు దరఖాస్తు చేసుకోవాలని ఆ ప్రకటన కోరింది. ఈ లోహాలను చిప్‌ల తయారీతో పాటు సమాచార పరికరాలు, వివిధ రక్షణ ఉత్పత్తుల్లోనూ ఉపయోగిస్తారు. మొబైల్ ఫోన్ల స్క్రీన్లు, సౌర ఫలకాలు, రాడార్ల సామర్ధ్యాన్ని పెంచేందుకు వాడతారు. ఈ రెండు లోహాల ఉత్పత్తిలోనూ చైనా అగ్ర స్థానంలో వుంది. 94శాతం గాలియం, 83శాతం జర్మానియం ఉత్పత్తి అయ్యేది చైనాలోనే. అయితే ఈ ఎగుమతుల నిషేధం వల్ల అమెరికా, జపాన్‌లపై ప్రభావం పరిమితంగానే వుండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇతరదేశాల నుండి దిగుమతి చేసుకోవడమో లేదా దేశీయంగానే ఉత్పత్తి చేసుకోవడమో చేస్తారని భావిస్తున్నారు. అయితే అందుకయ్యే వ్యయం కూడా చాలానే వుంటుంది. అయితే అమెరికా, జపాన్ చిప్‌ల తయారీ క్రమాన్ని మందగింపచేయడమే చైనా లక్ష్యమని చైనా వ్యాఖ్యాతలు పేర్కొంటున్నారు. అంతర్జాతీయ పారిశ్రామిక, సరఫరా మార్గాలు భద్రంగా, సురక్షితంగా వుండాలన్నదే చైనా అభిమతమని, దానికే కట్టుబడి వుంటామని చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి తెలిపారు.










