Nov 30,2022 21:06
  • చైనా రోదసీ స్టేషన్‌లో 6కి పెరిగిన వ్యోమగాముల సంఖ్య
  • చేపట్టనున్న 40కి పైగా ప్రయోగాలు

బీజింగ్‌ : మానవ సహిత రోదసీ నౌక షెంఝూ-15ని చైనా మంగళవారం రాత్రి విజయవంతంగా ప్రయోగించింది. వాయవ్య చైనాలోని జియూక్వాన్‌ ఉపగ్రహ ప్రయోగ కేంద్రం నుండి స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 11.08గంటలకు లాంగ్‌ మార్చ్‌-2ఎఫ్‌ వై 15 రాకెట్‌ ఈ రోదసీ నౌకను తీసుకుని నింగికెగిసింది. షెంఝూలోని ముగ్గురు వ్యోమగాములు చైనా రోదసీ స్టేషన్‌లోకి ప్రవేశించారు. అప్పటికే అక్కడ వున్న ముగ్గురినీ బుధవారం కలుసుకున్నారు. దీంతో చైనా రోదసీ స్టేషన్‌లో వ్యోమగాముల సంఖ్య ఆరుకు పెరిగింది. అంతరిక్ష స్టేషన్‌ నిర్మాణం చివరి భాగాన్ని ఈ పర్యటనలో వారు పూర్తి చేయనున్నారు. తొలి దశ కార్యక్రమాలను, కార్యకలాపాలను ప్రారంభించనున్నారు. ప్రయోగించిన పది నిముషాల వ్యవధిలోనే రాకెట్‌ నుండి షెంఝూ-15 విడివడి నిర్దేశిత కక్ష్యలోకి ప్రవేశించింది. బుధవారం తెల్లవారు జామున 5.42గంటలకు వేగంగా ఆటోమేటెడ్‌ విన్యాసాన్ని నిర్వహించి రోదసీ స్టేషన్‌ ముందు భాగంలోని తియాన్హె మాడ్యూల్‌తో అంతరిక్ష నౌక అనుసంథానమైంది. మూడు మాడ్యూల్స్‌, మూడు రోదసీ నౌకలు పట్టేంత రీతిలో రోదసీ స్టేషన్‌ను విస్తరించారు. దాదాపు వంద టన్నుల బరువు వుంటుంది. ఉదయం 7.33 గంటలకు షెంఝూ-14 సిబ్బంది కమాండర్‌ చెన్‌ డాంగ్‌ కొత్తగా వచ్చిన వారికి సాదరంగా స్వాగతం పలికారు. అందరూ కలిసి గ్రూపు ఫోటో తీసుకున్నారు. ఈ రోదసీ స్టేషన్‌లో సుదీర్ఘకాలం నివసించడానికి సంబధించిన వివిధ పరీక్షలను షెంఝూ-15 సిబ్బంది చేపట్టనున్నారు. మొత్తంగా 15 శాస్త్రీయ ప్రయోగాలను నిర్వహించనున్నారు. రోదసీ శాస్త్ర పరిశోధనలో 40కి పైగా ప్రయోగాలు, పరీక్షలు జరగనున్నాయి.