
- 2030 నాటికి చంద్రుడిపైకి
బీజింగ్ : మంగళవారం అంతరిక్షంలోకి ముగ్గురు వ్యోమగ్యాములను పంపేందుకు చైనా పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేసింది. ఇందులో ఒకరు పౌర వ్యోమగ్యామి కావడం విశేషం. చైనా నిర్మిస్తున్న అంతరిక్ష కేంద్రం (టియాంగాంగ్ స్పేస్‌స్టేషన్ మిషన్) వద్దకు వీరు వెళతారు. ప్రస్తుతం అక్కడ ముగ్గురు వ్యోమగ్యాములు ఉన్నారు. బీజింగ్ విశ్వవిద్యాలయంలో ఏరోనాటిక్స్ అండ్ ఆస్ట్రోనాటిక్స్ విభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేసే పేలోడ్ నిపుణులు గురు హైచావ్‌ను మంగళవారం అంతరిక్ష కేంద్రం వద్దకు పంపేందుకు ఏర్పాట్లు చేసింది. దీంతో చైనా నుంచి అంతరిక్షంలోకి వెళుతున్న తొలి పౌర వ్యోమగ్యామిగా గురు నిలవనున్నారు. ఇప్పటి వరకు చైనా అంతరిక్షంలోకి పంపిన వారంతా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీకి చెందిన వ్యోమగాములే. ఈ మిషన్ వాయువ్య చైనాలోని జ్యూకాన్ శాటిలైట్ లాంఛ్ సెంటర్ నుంచి మంగళవారం ఉదయం 9.31 గంటలకు ప్రారంభం అవుతుందని స్సేస్ ఏజెన్సీ వెల్లడించింది. 2003లోనే మానవ సహిత అంతరిక్ష యాత్ర చేసిన మూడో దేశంగా చైనా ఘనత సాధించింది. అంతకు ముందు అమెరికా, రష్యాలు ఈ యాత్రను చేశాయి.
కాగా, 2030 నాటికి చంద్రుడిపైకి వ్యోమగ్యాములను పంపాలని చైనా లక్ష్యంగా పెట్టుకుంది. ఈ విషయాన్ని సోమవారం చైనా మ్యాన్డ్ స్పేస్ ఏజెన్సీ డిప్యూటీ డైరెక్టర్ లిన్ కిక్వైవాంగ్ సోమవారం ధృవీకరించారు. అయితే నిర్థిష్ట తేదీని చెప్పడానికి నిరాకరించారు.