
చైనా కమ్యూనిస్టు పార్టీ (సిపిసి) ఇరవయ్యవ మహాసభ ఈ నెల 22న విజయవంతంగా ముగిసింది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చైనాకు వున్న కీలకమైన స్థానాన్ని దృష్టిలో వుంచుకుని, ఈ మహాసభ కోసం అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురుచూశారు. 2021లో చైనా స్థూల దేశీయోత్పత్తి 17.7 లక్షల కోట్ల అమెరికన్ డాలర్లుగా వుంది. ఇది ప్రపంచ జిడిపిలో 18.5 శాతంగా వుంది. ప్రపంచ సగటు 2.6 శాతాన్ని అధిగమించి, 2013 నుండి 2021 వరకు, సగటున 6.6 శాతం వార్షిక రేటు చొప్పున చైనా ఎదుగుతూ వచ్చింది. 2013-21 కాలంలో, ప్రపంచ ఆర్థిక వృద్ధికి సగటున 38.6 శాతం మేరకు దోహదపడింది. జి-7 దేశాల మొత్తం జిడిపి కన్నా ఇది అధికంగా వుంది. 2020లో, మొదటిసారిగా, చైనా అమెరికాను అధిగమించి, ప్రపంచంలోనే అతి పెద్ద వాణిజ్య దేశంగా మారింది. 2021లో 6.9 లక్షల కోట్ల డాలర్లకు విస్తరించిన విదేశీ వాణిజ్యంతో ఆ స్థానాన్ని నిలబెట్టుకుంది.
చైనా సోషలిస్టు దేశం, గతేడాది ఆ దేశ తలసరి స్థూల జాతీయాదాయం 11,890 డాలర్లకు చేరింది. 2012తో పోలిస్తే రెట్టింపు అయింది. చైనీయుల ఆదాయాభివృద్ధి, విద్య, ఆరోగ్య సంరక్షణలో వారి మెరుగుదలకు అభినందనలు. 2020లో చైనీయుల సగటు ఆయుర్ధాయం 77.9 సంవత్సరాలకు చేరింది. అంటే ప్రపంచ సగటు కన్నా 5.2 సంవత్సరాలు అధికం. ఇవన్నీ కూడా సోషలిస్టు వ్యవస్థ ఆధిక్యతను తెలియచేస్తున్నాయి. అంతర్జాతీయంగా అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
9.6 కోట్ల మందికి పైగా సిపిసి సభ్యులకు, 49 లక్షలకు పైగా పార్టీ ప్రాథమిక సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తూ...2,296 మంది ప్రతినిధులు ఈ మహాసభకు హాజరయ్యారు. మహాసభకు ముందుగా భారీ ప్రజాస్వామ్య ప్రక్రియను అనుసరించి నివేదికను రూపొందించారు. 26 కీలకమైన కర్తవ్యాలపై సిపిసి కేంద్ర కమిటీ నేతృత్వంలో 54 సంస్థలు విస్తృతంగా పరిశోధన నిర్వహించి, 80 నివేదికలను సిద్ధం చేశాయి. వీటి ప్రాతిపదికగా మహాసభకు సమర్పించిన ముసాయిదా నివేదిక రూపొందింది. ఈ ప్రాథమిక ముసాయిదాపై ఆన్‌లైన్ యూజర్ల నుండి వారి అభిప్రాయాలను సిపిసి సేకరించింది. మొత్తంగా 80.54 లక్షల అభిప్రాయాలు అందాయి. ఇరవయ్యవ మహాసభ ముందు ప్రవేశపెట్టిన ముసాయిదా నివేదికపై 4,700 మందికి పైగా తమ అభిప్రాయాలు తెలియచేశారు.
సమీక్ష జరుగుతున్న గత ఐదేళ్ళ కాలాన్ని చారిత్రాత్మకంగా పేర్కొంటూ...ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సామాజిక, పర్యావరణ అభివృద్ధిని మరింత సమన్వయం చేసుకుంటూ ''ఐదు రంగాల సమీకృత ప్రణాళిక''ను ముందుకు తీసుకెళ్ళడంలో సిపిసి సఫలీకృతమైందని నివేదిక పేర్కొంది. పార్టీ మొత్తంగా ప్రజల సంపూర్ణ ప్రజాస్వామ్య ప్రక్రియను పెంపొందించగలిగిందని, ఆధునీకరించిన సోషలిస్టు సంస్కృతిని అభివృద్ధిపరిచి, ప్రజా సంక్షేమాన్ని మెరుగుపరచగలిగిందని నివేదిక పేర్కొంది. చైనాలో దారిద్య్రాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం, 2021 (సిపిసి వ్యవస్థాపక శతాబ్ది సంవత్సరం కూడా) నాటికి చైనాలో ఒక మోస్తరు సంపద్వంతమైన సమాజాన్ని ఏర్పాటు చేసే దిశగా పురోగతి సాధించడం అనేవి ఈ శతాబ్ది లక్ష్యాలు. వీటిలో మొదటి లక్ష్యాన్ని ఇదే కాలంలో సిపిసి సాధించింది. ఇప్పుడు పార్టీ, శతాబ్ది రెండో లక్ష్య సాధన దిశగా...అంటే 2049 (పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పడిన శతాబ్ది సంవత్సరం)కల్లా చైనాలో అభివృద్ధి చెందిన, సామరస్యతతో కూడిన సోషలిస్టు సమాజ స్థాపన దిశగా దేశాన్ని నడిపించేందుకు నాయకత్వం వహిస్తోంది.
ప్రజల ప్రాథమిక ప్రయోజనాలను పరిరక్షించడం సిపిసి ప్రధాన కర్తవ్యమని ప్రధాని, పొలిట్‌బ్యూరో స్థాయీ సంఘం సభ్యుడు లీ కెకియాంగ్ స్పష్టం చేశారు. ఆధునీకరణ ఫలాలను ప్రజలందరూ మరింత సంపూర్ణంగా, సక్రమంగా పంచుకునేందుకు హామీ కల్పించేలా అభివృద్ధి క్రమాన్ని చేపట్టే ప్రక్రియలో ప్రజల సంక్షేమానికి రక్షణ కల్పించబడిందని, మెరుగుపరచబడిందని ఆయన పేర్కొన్నారు.
దేశంలో దారిద్య్రాన్ని సంపూర్ణంగా నిర్మూలించడానికి కృషి చేసేందుకు, అలాగే కోవిడ్ మహమ్మారిపై సాగించిన యుద్ధంలోనూ సిపిసికి ఈ సూత్రాలు మార్గనిర్దేశనం చేశాయి. సాధ్యమైనంత వరకు ప్రజల జీవితాలకు, ఆరోగ్యానికి రక్షణ కల్పించాయి. పెట్టుబడిదారీ దేశాల్లాగా చైనా ఎన్నడూ తన ఆర్థిక ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ప్రతీసారీ ప్రజల జీవితాలకే ప్రాధాన్యతనిస్తూ వస్తోంది.
సిపిసి ప్రధాన కార్యదర్శి జిన్‌పింగ్ ఈ నివేదికను మహాసభ ముందు ప్రవేశపెడుతూ, పార్టీ వ్యవస్థాపక సూత్రాలను, మార్క్సిజం, సోషలిజం పట్ల నిబద్ధతను ఎన్నటికీ మర్చిపోరాదని ఉద్బోధించారు. పార్టీ ఎన్నటికీ తన స్వభావాన్ని, విశ్వాసాన్ని మార్చుకోదని పేర్కొన్నారు. ''చైనా కాలమాన పరిస్థితులకు తగినట్లుగా, ముఖ్యంగా ప్రస్తుత కాలంలో మన అవసరాలకు అనుగుణంగా అనుసరించినపుడు మార్క్సిజం పనిచేస్తుంది.'' అన్న వాస్తవం కారణంగా సిపిసి, చైనా లక్షణాలతో కూడిన సోషలిజం విజయం సాధించిందని జిన్‌పింగ్ పేర్కొన్నారు. తన స్వభావాన్ని మార్చుకోవడం లేదా సోషలిస్టు వ్యవస్థను విడనాడడం ద్వారా చైనా ఎన్నడూ తన కార్యాచరణకు దూరంగా వెళ్లబోదని ఆయన స్పష్టం చేశారు.
ఎలాంటి ఒత్తిళ్లకు లేదా బెదిరింపులకు చైనా తలొగ్గదని, ఎలాంటి సవాలునైనా ఎదుర్కొంటుందని జిన్‌పింగ్ ప్రతినబూ నారు. 'మన కాలంలోని సమస్యలకు' పరిష్కారాలు కనుగొనేందుకు, ప్రజల ఆకాంక్షలను ఎదుర్కొనగలిగేందుకు అచంచలమైన నిబద్ధత, పట్టుదలతో ముందుకు సాగడం ద్వారా మాత్రమే పార్టీ పురోగమిస్తుందని అన్నారు. స్వీయ సంస్కరణలకు కమ్యూనిస్టులు ఎప్పుడూ సిద్ధంగా వుండాలన్నారు. సోషలిస్టు నిర్మాణానికి అనుసరించే పంథాలో ఎదురయ్యే అడ్డంకులన్నింటినీ అధిగమించాలన్నారు. ఈ క్రమంలో అవినీతిపై, వాటికి సంబంధించిన పరిస్థితులపై పార్టీ పోరాడుతుందని హామీ ఇచ్చారు.
అవినీతిపై కృతనిశ్చయంతో పార్టీ పోరాటాన్ని కొనసాగిస్తోందని, ఇది ఫలితాలను కూడా ఇస్తోందని 'కేంద్ర క్రమశిక్షణ పర్యవేక్షక సంఘం' (సిసిడిఐ) సమర్పించిన నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ప్రకారం, 19వ మహాసభ ముగిసినప్పటి నుండి అవినీతికి సంబంధించిన కేసుల్లో 74 వేల మందికి పైగా విచారించి, శిక్ష అమలు చేశారు. వీరిలో 48 శాతం మంది 18వ మహాసభకు ముందు మొదటిసారిగా పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారు. 11.1 శాతం మంది 19వ మహాసభ తర్వాత ఉల్లంఘించారు. దీన్నిబట్టి కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోందని తెలుస్తోంది. సిపిసి నాయకత్వం నిరంతరంగా చేపడుతున్న చర్యలు, చేస్తున్న కృషి కారణంగా పార్టీ పూర్తి స్థాయిలో, చేపట్టిన స్వపరిపాలన అత్యంత సమర్ధవంతంగా వుందని 2022లో సర్వేచేసిన ప్రజల్లో 97.4 శాతం మంది విశ్వసిస్తున్నారు. 2012లో ఈ సంఖ్య కేవలం 22.4 శాతంగా వుంది. 2015 నుండి పార్టీ అధికారుల, వారి కుటుంబ సభ్యుల వ్యాపార కార్యకలాపాలపై నిఘా పెరిగింది. 4700 మందికి పైగా అధికారుల భాగస్వాములు, వారి పిల్లల వ్యాపారాలు కూడా క్రమబద్దీకరించబడ్డాయి. అవినీతిపై జరిగే కీలకమైన పోరాటంలో విజయం సాధిస్తామని నివేదిక పేర్కొంది.
1982 నుండి పార్టీ అన్ని మహాసభలలో పార్టీ నిబంధనావళికి సవరణలనేవి సర్వసాధారణమైన అంశంగా మారిపోయింది. ఇదంతా కూడా సైద్ధాంతిక అన్వేషణలు, ఆచరణలో వచ్చే పరిణామాల అవసరాలను తీర్చేందుకే. ఈ సూచించిన సవరణలనేవి వ్యూహాత్మక ఆలోచనలు అభివృద్ధి చెందడంలో, అలాగే చైనా అవసరాలకు తగినట్లుగా, ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా మార్క్సిజాన్ని అనుసరించడంలో తాజాగా సాధించిన విజయాలను ప్రతిబింబిస్తున్నాయి. ఆధునీకరణకు చైనా అనుసరించే మార్గం ద్వారా అన్ని రంగాల్లో చైనా పునరుజ్జీవనాన్ని ముందుకు తీసుకెళ్ళడమనేది పార్టీ కీలక కర్తవ్యంగా వుంది. సవరించిన పార్టీ నిబంధనావళిలో దీన్ని చేర్చారు.
గత శతాబ్ద కాలంలో పార్టీ సాధించిన ప్రధాన విజయాలు, చారిత్రక అనుభవాలను, పార్టీ మూల స్ఫూర్తిని, వ్యవస్థాపక కర్తవ్యాన్ని పార్టీ నిబంధనావళిలో పొందుపరచడానికి మహాసభ ఆమోద ముద్ర వేసింది. పోరాట స్ఫూర్తిని, పోరాట సామర్ధ్యాన్ని నిర్మించడాన్ని ముందుకు తీసుకెళ్ళడంపై చేసిన ప్రకటనను కూడా పార్టీ నిబంధనావళిలో చేర్చడానికి మహాసభ ఆమోదం తెలిపింది.
''ప్రజా యాజమాన్యం ప్రధానంగా వుండే వ్యవస్థతో పాటు... ప్రాథమిక సోషలిస్టు ఆర్థిక వ్యవస్థలు, వివిధ రకాలైన యాజమాన్య వ్యవస్థలు కలిసి అభివృద్ధి చెందుతాయి. పని ప్రకారం పంపిణీ ప్రధానంగా వుండే వ్యవస్థ అయితే, దానితో పాటు మనుగడలో వున్న బహుళ రూపాల పంపిణీ, సోషలిస్టు మార్కెట్ ఆర్థిక వ్యవస్థ ఇవన్నీ కూడా చైనా లక్షణాలతో కూడిన సోషలిజానికి కీలకమైన మూలస్తంభాలుగా వున్నాయి.'' అన్న అంశాన్ని నిబంధనావళిలో పొందుపరచాలన్నది మరో ప్రధానమైన సవరణగా వుంది.
పార్టీ క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలు సవరించబడ్డాయి. ఇవి, అవినీతి పద్ధతులను అణచివేయడానికి ఉద్దేశించిన, ప్రత్యేక హక్కులు కావాలని కోరుకునే మనస్తత్వాన్ని, పద్ధతులను వ్యతిరేకించాలని అన్ని స్థాయిల్లోని పార్టీ అధికారులను నిర్దేశిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఎదురవుతున్న సవాళ్ళను ఎదుర్కొనడానికి పార్టీ సభ్యులకు కొత్త బాధ్యతలను, కర్తవ్యాలను నిర్దేశించాయి. ప్రజల సంపూర్ణ ప్రజాస్వామ్య క్రమాన్ని మరింత విశాలంగా, పూర్తి స్థాయిలో, మరింత చురుకుగా అభివృద్ధిపరచడంపై... ప్రజాస్వామ్య ఎన్నికలు, సంపద్రింపులు, నిర్ణయాక క్రమాలు, నిర్వహణ, పర్యవేక్షణలకు సంబంధించిన సమర్ధవంతమైన వ్యవస్థలు, పద్ధతుల స్థాపనపై చేసిన ప్రకటనలను పార్టీ నిబంధనావళికి చేర్చేందుకు కూడా మహాసభ అంగీకరించింది.
205 మంది సభ్యులు, 171 మంది ప్రత్యామ్నాయ సభ్యులతో కొత్త సిపిసి కేంద్ర కమిటీని మహాసభ ఎన్నుకుంది. 133మంది సభ్యులతో కొత్త సిసిడిఐని ఏర్పాటు చేశారు. 23వ తేదిన కొత్తగా ఎన్నికైన కేంద్ర కమిటీ సమావేశమై జిన్‌పింగ్‌ను పార్టీ ప్రధాన కార్యదర్శిగా తిరిగి ఎన్నుకుంది. జిన్‌పింగ్‌తో పాటు కేంద్ర కమిటీ ఏడుగురు సభ్యులతో పొలిట్‌బ్యూరో స్థాయీ సంఘాన్ని ఎన్నుకుంది. సిపిసి కేంద్ర మిలటరీ కమిషన్ చైర్మన్‌గా కూడా జిన్‌పింగ్ ఎన్నికయ్యారు.
పోరాడే సాహసం, గెలవాలనే పట్టుదల సిపిసికి వున్నాయని ముగింపు ఉపన్యాసంలో జిన్‌పింగ్ స్పష్టం చేశారు. ''నూతన శకం దిశగా సాగే ఈ నూతన ప్రయాణంలో వినూత్నమైన, మరింత మహత్తరమైన అద్భుతాలను సృష్టించగలమని...ఆ అద్భుతాలు ప్రపంచాన్ని అశ్చర్యపరచగలవని మేం పూర్తిగా విశ్వాసిస్తున్నాం.'' అని పేర్కొన్నారు. ఆ తర్వాత, 23వ తేదీన మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ''మన పతాకాన్ని మరింత సమున్నంతంగా చేతబూని...బలాన్ని సమీకరించుకుంటూ సంఘీభావాన్ని, అంకిత భావాన్ని పెంచుకున్న'' మహాసభలే ఇవని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు.
చైనాలో సోషలిస్టు సమాజాన్ని నిర్మించాలన్న కర్తవ్య నిర్వహణలో సిపిసి విజయం సాధించాలని మనందరం ఆశిద్దాం.
/ వ్యాసకర్త : ఆర్. అరుణ్ కుమార్, సిపిఎం కేంద్రకమిటీ సభ్యులు /