Oct 05,2023 06:57

ఆ పాఠశాలకు కొత్తగా సైన్సు మాస్టారు వచ్చారు. ఆయనకు పాటలంటే చాలా ఇష్టం. పిల్లలకు రోజూ పాటల రూపంలోనే పాఠాలు చెప్పేవారు. ఒకరోజు పరిసరాల విజ్ఞానంలో ప్రాజెక్టు పని చేయమని పిల్లలకు చెప్పారు. అయితే వారి కష్టాలు, ఇష్టాలు అన్నీ పాటల రూపంలోనే చెప్పాలని షరతు పెట్టారు.
విద్యార్థులు గ్రూపులుగా తయారయ్యి ప్రాజెక్టు పని పూర్తి చేశారు. మరుసటి రోజు మాస్టారు క్లాసు ప్రారంభమైంది.
'ఏ' గ్రూపులో ఒక విద్యార్థి లేచి 'మీ నాన్నెలా ఉంటాడని- ఎవరైనా అడిగితే- మా అన్నలా ఉంటాడని అంటాను నేను' అని పాడాడు. ఆ పాట ఎందుకు ఎంపిక చేసుకున్నావు అని మాస్టారు అడిగారు. 'నాకు అమ్మానాన్న లేరు సార్‌! మా అన్నయ్యే కష్టపడి ఇల్లు నడిపిస్తున్నాడు' అని అన్నాడు. మరో విద్యార్థి లేచి 'జగమంత కుటుంబం నాది- ఏకాకి జీవితం నాది' అని పాడి 'నేను అనాథను సార్‌... హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నాను' అని అన్నాడు.
'బి' గ్రూప్‌ విద్యార్థి లేచి 'అయ్యా నే చదివి బాగుపడతా- ఓరయ్య నే చదువు బాగుపడతా- పుస్తకాలు చదివి నేను- మన బతుకులు మారుస్తా' అని పాడుతూ' మా నాన్న మేకలు కాయడానికి వెళ్ళమంటాడు సార్‌' అని అన్నాడు.
'సి'గ్రూప్‌లో నుంచి ఒక పిల్లవాడు లేచి 'భలే మంచి రోజు- పసందైన రోజు' అని పాడి, 'మా నాన్నకు ఉద్యోగం వచ్చింది సార్‌' అని అన్నాడు. మరో విద్యార్థి లేచి 'చందమామ కథలో చదివా- రెక్కల గుర్రాలు ఉంటాయని' అంటూ 'నాకు హాయిగా పక్షుల్లా ఆకాశంలో ఎగరాలని ఉంది సార్‌' అని అన్నాడు.
'డి' గ్రూప్‌ నుంచి ఒక విద్యార్థి లేచి 'కొత్తగా రెక్కలొచ్చినా-గూటిలోని గువ్వపిల్లకు' 'నేను ఫ్యాక్టరీలో పని చేస్తుంటే అధికారులు విడిపించి ఈ బడిలో చేర్పించారు సార్‌' అని అన్నాడు. మరో విద్యార్థి లేచి 'ఏమున్నదక్కో ఏమున్నదక్కో- ముల్లె సర్దుకుని వెళ్ళిపోతావున్న' అని పాడుతూ 'మా అమ్మ నాన్న వలస వెళ్లిపోతామంటున్నారు సార్‌' అని ఏడుస్తూ అన్నాడు. ఇలా పిల్లలంతా పాటలు పాడుతూ వారి బాధలు, ఇష్టాలు, కష్టాలు చెబుతున్నప్పుడే పాఠశాలకు డిఇఓ వచ్చారు.
పిల్లలకు పాఠాలు చెప్పకుండా పాటలు, డాన్సులతో కాలక్షేపం చేస్తున్నారని మాస్టారు మీద స్కూలు సిబ్బంది డీఈవో గారికి ఫిర్యాదు చేశారు. దీంతో తనిఖీ చేసేందుకు వచ్చిన డిఇఓ, మాస్టారు క్లాసు ముందే నిలబడి జరిగిందంతా చూశారు. చివర్లో ఆయన కూడా 'నూటికో కోటికో ఒక్కరు- ఎప్పుడో ఎక్కడో పుడతారు- అది మీరే మీరే మాస్టారు' అంటూ' ప్రాజెక్టు పని పేరుతో పిల్లల ఇష్టాయిష్టాలు, సాధకబాధలు అన్నీ తెలుసుకున్న మీకు అభినందనలు' అని మెచ్చుకున్నారు.
- ద్వారపురెడ్డి జయరాం నాయుడు,
94415 19570