Sep 28,2023 06:36

అనగనగా రాములవారి కోట అనే గ్రామంలో అనూష, బిందు స్నేహితులు. ఇద్దరూ ఒకే పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నారు. అనూష ఎప్పుడూ స్నేహితులతో గొడవ పడుతూ ఉండేది. పరీక్షలు దగ్గరికి వచ్చాయంటే మాత్రం అందరికీ చాక్లెట్లు, బిస్కెట్లు ఇస్తూ స్నేహం పెంచుకునేది. బిందు మాత్రం అలా కాదు. రోజూ బిందు, అనూష పాఠశాలకు నడుచుకుంటూ వెళ్లేవారు.
ఓ రోజు దారిలో ఒక మర్రి చెట్టు కింద ఒక ముసలాయన కూర్చొని ఉన్నాడు. వీళ్ళిద్దరినీ చూసి 'తల్లులూ...ఇటు రండి' అని పిలిచాడు. బిందు అతని దగ్గరికి వెళ్లి 'ఏంటి తాతయ్య' అని అడిగింది. 'కాస్త ఈ సీసాలో నీరు నింపి ఇవ్వమ్మా' అంటూ పక్కనే ఉన్న కుళాయి చూపించాడు. అప్పుడు అనూష 'ఒక పక్క స్కూలుకు లేటు అవుతుంటే నువ్వేంటి.. మంచినీళ్లు పట్టుకుంటూ కూర్చుంటావా?' అని విసుక్కుంటూ బిందును పట్టించుకోకుండా స్కూలుకు వెళ్లిపోయింది. బిందు మాత్రం తాతయ్య సీసాలో నీళ్లు నింపి ఇచ్చింది.
స్కూలుకు వచ్చిన బిందు దగ్గరికి అనూష పరుగెత్తుకుంటూ వెళ్లి 'చెట్టు కింద తాతయ్య ఊరికే ఉన్నాడు కదా! తన పని తను చేసుకుంటాడు. నువ్వు అనవసరంగా సాయం చేశావు' అన్నది. 'ఆ తాతయ్య నడవడానికే చాలా ఇబ్బంది పడిపోతున్నాడు. అందుకే నీరు పట్టి ఇచ్చాను' అని చెప్పి బిందు అక్కడి నుండి వెళ్లిపోయింది.
ఇది జరిగిన కొన్ని రోజులకు ఒకరోజు పాఠశాలకు ఆలస్యంగా బయలుదేరారు బిందు, అనూష. బాగా ఆలస్యమైపోయిందని పరిగెత్తుకుంటూ వెళ్లారు. మర్రిచెట్టు దగ్గరకి వచ్చేసరికి రాయి తగిలి అనూష కింద పడిపోయింది. కాలుకి బాగా దెబ్బ తగిలి రక్తం కారుతుంటే నొప్పితో లేవలేకపోయింది. ఇదంతా చూసిన చెట్టు కింద తాతయ్య వచ్చి తన ధోతిని చింపి కట్టుకట్టాడు. బిందు సాయంతో పక్కనే ఉన్న డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లారు.
హాస్పటల్‌ వరకు చాలా జాగ్రత్తగా అనూష చేయి పట్టుకుని నడిపించాడు తాతయ్య. కాలు నొప్పి కంటే ఆ తాతయ్య గురించి గతంలో తను అన్న మాటలు గుర్తుకువచ్చి, అనూషకు దుఃఖం ఆగలేదు. 'నన్ను క్షమించు తాతయ్య' అని అడిగింది. 'ఎందుకమ్మా ఈ చిన్న సాయానికే అంతలా కన్నీళ్లు పెట్టుకుంటావు. ఏం పర్లేదు' అని బుజ్జగించాడు తాతయ్య.
ఆ రోజు నుండి అనూష తన స్నేహితులతో గొడవలు పడటం మానేసింది. ఎవరికి ఏ అవసరం వచ్చినా వెంటనే సహాయం చేసేది. అనూషలో వచ్చిన మార్పును చూసి బిందు చాలా సంతోషించింది.


- నరాలశెట్టి నిఖిత, 7వ తరగతి,
మేళ్ళచెరువు, సూర్యాపేట జిల్లా.