- ఆరని మంటల్లో మణిపూర్ తల్లడిల్లుతోంది. ఊళ్లకు ఊళ్లు ఖాళీ అయిపోతున్నాయి. కుటుంబాలన్నీ చెల్లాచెదురై పోతున్నాయి. రక్షణ లేని సమాజంలో లక్షలాది మంది ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. మహిళల పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. కులం, మతం, జాతి అన్న తేడా లేకుండా జరుగుతున్న మణిపూర్ అంత:ఘర్షణల్లో కనిపించని మరో దారుణం.. వేలాదిమంది చిన్నారుల భవిష్యత్తు.. ఈ ఘర్షణల్లో అభం శుభం తెలియని పసివాళ్లు సమిథల్లాగ మిగిలిపోతున్నారు. ఇంఫాల్ పశ్చిమ జిల్లా లాంసాంగ్‌లో ఏర్పాటు చేసిన ఓ పునరావాస కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న చిన్నారులది ఒక్కొక్కరిది ఒక్కో కన్నీటి కథ.
బుడిబుడి అడుగులు వేసుకుంటూ.. చేయి చేయి కలుపుకుని.. బంగారు భవిష్యత్తు నిర్మించుకోవాలన్న ఆశలతో విద్యార్థులు చేరే పాఠశాల ప్రాంగణం అది. కానీ ఇప్పుడు ఏ చిన్నారి ముఖం చూసినా ఏదో దిగులు కనపడుతోంది. పునరావాస కేంద్రంగా మారిపోయిన ఆ స్కూల్లో ఇప్పుడు కూడా పిల్లలున్నారు. మణిపూర్ వివిధ ప్రాంతాల నుండి వారంతా అక్కడికి చేరారు. తల్లిదండ్రులకు దూరంగా ఒక రోజు రెండు రోజులు కాదు.. నెలల తరబడి ఒంటరిగా జీవిస్తున్నారు. అసలు వాళ్ల అమ్మానాన్న బతికున్నారో లేదో తెలియని అయోమయ పరిస్థితి వారిది.
ఘర్షణల తాలూకూ భయాందోళనల మధ్య ఊరిని రక్షించుకోవాలని ఈ పిల్లల తల్లిదండ్రులు గ్రామాల్లోనే ఉండిపోయారు. 'గ్రామ రక్షణ వాలంటీరు'్లగా పగలు రాత్రి తేడా లేకుండా కాపలా కాస్తున్నారు. గ్రామాలకు దూరంగా తరలించబడిన బిడ్డలను తలచుకుంటూ అక్కడ ఆ తల్లులు కంటిమీద కునుకులేకుండా కాలం వెళ్లదీస్తున్నారు.
'మా అమ్మానాన్న ఇంకా గ్రామంలోనే ఉన్నారు. నాన్న గ్రామ రక్షణలో.. అమ్మ 'మేరా పైబీ' (మణిపూర్ అమ్మ) విధుల్లో నిమగమయ్యారు. నేనొక్కదాన్నే ఇక్కడ ఉండిపోయాను' అంటూ ఫయెన్ గ్రామం నుండి పునరావాసానికి చేరుకున్న వల్లీ రోజ్ అనే బాలిక అంటోంది.
'మా తల్లి దండ్రులనే కాదు.. మా గ్రామాన్ని కూడా మేం వదులుకున్నాం. మా ఇంటికి, స్నేహితులకు దూరంగా వచ్చేశాం. ఇక్కడికి వచ్చాక నేను నిద్రపోయింది లేదు. వారంతా గుర్తుకు వస్తుంటే ఏడుపొస్తోంది. మా అన్నయ్య కూడా అమ్మానాన్నతో అక్కడే ఉండిపోయాడు. ఇద్దరు చెల్లెళ్లతో నేను ఇక్కడ ఆశ్రయం పొందుతున్నాను' అంటూ అదే గ్రామం నుండి వచ్చిన ఎలిజా చెబుతున్నప్పుడు దు:ఖంతో ఆ బాలిక మాటలు తడబడుతున్నాయి.
ఈ పునరావాస కేంద్రంలో ఆరు నెలల చిన్నారుల నుండి 15 ఏళ్ల పిల్లల వరకు ఆశ్రయం పొందుతున్నారు. స్కూలు పరిసర ప్రాంత గ్రామస్తులే ఈ పునరావాస కేంద్ర రక్షణ బాధ్యతలు తీసుకున్నారు. ఈ కేంద్రానికి దూరంగా గ్రామంలో రక్షణ కోసం ఉండిపోయిన ఆ తల్లిదండ్రుల గురించి ఆరా తీస్తే..
'ఇక్కడ మాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఏ మూల నుండి ఎవరు దాడికి వస్తారో తెలియదు. ప్రతి క్షణం అప్రమత్తతో ఉండాలి. ఈ అల్లర్లు ఎప్పటికి చల్లారుతాయో తెలియదు. అప్పటి వరకు మేం బతికి ఉంటామో లేదో.. కూడా తెలియదు. ఇంతటి అయోమయ పరిస్థితిల్లో చిన్న బిడ్డలను పునరావాస కేంద్రానికి తరలించాను' అంటూ ఎలిజా తండ్రి చెబుతున్న మాటల్లో, బిడ్డలకు దూరమైన ఆ తండ్రి ఆవేదన కనపడుతోంది.
'గ్రామాన్ని వదిలి నా ఒక్కగానొక్క కూతురు ఒంటరిగా పునరావాస కేంద్రంలో ఉంటోంది. బిడ్డను చూసి మూడు నెలలు కావస్తోంది. ఎప్పుడు కలుసుకుంటానో తెలియడం లేదు.. అసలు కలుస్తానో లేదోనని బెంగగా ఉంది' అంటూ వల్లీ రోజ్ తల్లి బిడ్డను తలుచుకుని చెబుతున్నప్పుడు ఆమె కళ్లు కన్నీటి సంద్రాలయ్యాయి.

ఈ పునరావాస కేంద్రంలోనే తలదాచుకుంటున్న 11 ఏళ్ల జాక్సన్ హురేమ్ కళ్లెదుటే ఓ గుంపు అతని ఇంటిని తగలబెట్టింది. 'ఆ భయానక పరిస్థితి నుండి నేను ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాను' అంటున్న జాక్సన్‌కి ఐఎఎస్ కావాలన్నది కల. చదువులో చాలా చురుకుగా ఉండేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. చదువు లేదు. అమ్మానాన్న దగ్గర లేరు. ఇళ్లు తగలబడిపోయి ఊరు కాని ఊరిలో అనాథలా ఆశ్రయం పొందుతున్నాడు. 10 ఏళ్ల రోజియాకి రాజకీయాలంటే చాలా ఆసక్తి. 'పెద్దయ్యాక మంత్రి అవుతాన'ని ఎన్నోసార్లు అమ్మానాన్నతో చెప్పేది. కానీ ఇప్పుడు ఆ చిన్నారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైంది. 'ఆ పిల్ల కళ్లెదుటే కొన్ని గుంపులు గ్రామాన్ని లూటీ చేశాయి. అడ్డుచెప్పిన వారిని కాల్చి చంపాయి. ఈ మారణహోమాన్ని ప్రత్యక్షంగా చూసిన రోజియా నిద్రల్లో కూడా భయంతో వణికిపోతోంది' అంటూ పునరావాస నిర్వహణ సభ్యుడు చెబుతున్నారు.

అమ్మ చేతి గోరుముద్దలు తింటూ.. నాన్న చేయి పట్టుకు నడవాల్సిన ఈ పసివారు.. ఇప్పుడు ఓ భయంకర పరిస్థితిలో చిక్కుకుపోయారు. యుద్ధం.. సంఘర్షణ.. దాడులు, అల్లర్లు.. ఎక్కడ ఏ విధ్వంసకర పరిస్థితులు తలెత్తినా.. అక్కడ.. ఆ సంఘటనలకు ఏ మాత్రం సంబంధం లేని అమాయక ప్రజలు బలైతే.. వారిలో మహిళలు.. పిల్లలు అనుభవించే వేదన ఊహలకందనిది.. ఒక పక్క తల్లులకు రక్షణ లేదు.. మరోపక్క బిడ్డల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతున్న ప్రస్తుత మణిపూర్‌లో ఈ విధ్వంసకర మంటలు ఎప్పుడు చల్లారుతాయో.. ఈలోపు ఎందరి బతుకులు బుగ్గవుతాయో!










