
రాయ్ పూర్ : ఛత్తీస్‌గఢ్‌లో తిరిగి అధికారం చేపట్టేందుకు కాంగ్రెస్ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తోంది. సోమవారం ఖైరాఘర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని జల్‌బంధాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలపై వరాల జల్లు కురిపించారు. స్వయం సహాయక బృందాలకు (ఎస్‌జిహెచ్) సాక్షమ్ యోజన కింద రుణమాఫీచేస్తామని ప్రకటించారు. మహిళల కోసం మహతారీ న్యారు యోజన కింద వంట గ్యాస్ సిలిండర్‌లపై రూ. 500 రాయితీ ఇస్తామని అన్నారు. మరో అడుగు ముందుకు వేసి, తమ పార్టీ అధికారంలోకి వస్తే రోడ్డు ప్రమాద బాధితులకు ముఖ్యమంత్రి ప్రత్యేక వైద్య సహాయం పథకం కింద ఉచిత వైద్య చికిత్సనందిస్తామని అన్నారు. అకస్మాత్తుగా జరిగే ఇతర ప్రమాద బాధితులకు ఉచిత వైద్యం అందుతుందని చెప్పారు.
200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తునందిస్తామని చెప్పారు. 6,000కు పైగా ప్రభుత్వ హయ్యర్ మరియు హైస్కూల్స్‌ను స్వామి ఆత్మానంద్ ఇంగ్లీష్ మరియు హిందీ మీడియం స్కూల్స్‌గా అప్‌గ్రేడ్ చేయనున్నట్లు తెలిపారు. 'తివారా' ( చిక్కుడు తరహా మొక్క) ను రైతుల నుండి కనీస ధరకు కొనుగోలు చేస్తామని ప్రకటించారు. మీ సంక్షేమం కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం కృషి చేసే పార్టీకే ఓటు వేయాలని పిలుపునిచ్చారు. మతం పేరుతో మిమ్మల్ని పక్కదారి పట్టించే వారికి ఓటు వేసి మీ జీవితాల్లో సమస్యలను తెచ్చుకుంటారా అంటూ పరోక్షంగా బిజెపి పార్టీపై నిప్పులు చెరిగారు.