
ప్రియమైన వృద్ధమూర్తులారా,
రొసినాంటే వీధుల్లో మళ్ళీ నడుస్తున్న అనుభూతి కలుగుతున్నది. దాదాపు పదేళ్ళ క్రితం మీకు ఒక వీడ్కోలు లేఖ రాశాను. నేనొక మంచి సైనికునిగాను, మంచి డాక్టరుగాను లేనందుకు ఆ లేఖలో విచారం వ్యక్తం చేశాను. కానీ ఇప్పుడు అలా భావించడం లేదు. ఎందువల్లనంటే నేనిప్పుడు అప్పటి మాదిరిగా నాసిరకమైన సైనికుడిని కాదు.
అయితే సారం రీత్యా ఎలాంటి తేడా లేదు. దానిపట్ల చైతన్యం మాత్రం మరింత పెరిగింది. నా మార్క్సిజం మరింత వేళ్ళూనుకున్నది. మరింత పరిశుద్ధంగా తయారయింది. స్వేచ్ఛ కోసం ఉద్యమించే ప్రజలకు సాయుధపోరాటమే ఏకైక మార్గం అని నేను నమ్ముతున్నాను. నా నమ్మకాలపట్ల నికరంగా ఉన్నాను. చాలా మంది నన్ను దుందుడుకువాడినని అంటారు. నేను దుందుడుకువాడినే కావచ్చు. కానీ భిన్నమైన తరహాకు చెందినవాడిని. నేను సత్యమని నమ్మినదాన్ని నిరూపించడం కోసం ఏ కష్టానికయినా సిద్ధపడినవాడిని. ఇదే చివరి లేఖ అయ్యే అవకాశం ఉంది. అలా కావాలని నేను అనుకోవడంలేదు. కానీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటే అదే జరుగుతుందని అనిపిస్తుంది. అలాగే అయినట్లయితే, ఇది నా చివరి ఆలింగనం. నేను మిమ్మల్ని ఎంతగానో ప్రేమించాను. నా ప్రేమను ఎలా వ్యక్తం చేయాలో నాకు తెలియలేదు. నా చర్యలు అత్యంత తీవ్రంగా ఉండేవి. కొన్నిసార్లు మీరు నన్ను అర్థం చేసుకోలేరని నాకు తెలుసు. నన్ను అర్థం చేసుకోవడమూ కష్టమే. అయినా నన్ను నమ్మండి. ఒక కళాకారుడు నిరంతరం ఎలా ఆనందంగా ఉంటాడో, అలాగే నేనూ నా దీక్షను దృఢతరం చేసుకుంటూ వచ్చాను. అందువల్లనే నేను బలహీనమైన కాళ్ళతోను, అలసిపోయిన ఊపిరితిత్తులతోను నెట్టుకురాగలిగాను. అలా నేను ఉండగలను.
20వ శతాబ్దపు అదృష్టానికి చెందిన ఈ చిన్ని సైనికుని అప్పుడప్పుడూ గుర్తుకు తెచ్చుకోండి. సెలియా, రాబెర్టో, జువాన్ మార్టిన్, పటోటిన్, బియాట్రిజ్ ప్రతి ఒక్కరికీ నా ముద్దులు. మంకుపట్టు కలిగిన, అసాధారణ లక్ష్యం కలిగిన కుమారుని నుండి మీకు పెద్ద ఆలింగనం.
- ఎర్నెస్టో