
బొలీవియాలో ఏదో ఒక చోటు (1966)
నా ప్రియాతిప్రియమైన అల్యూషా, కామిలో, సెలిటా, టాటికో,
నేను ఎక్కడో చాలా దూరం నుండి, ఎంతో హడావిడిగా ఈ లేఖ రాస్తున్నాను. అంటే నా తాజా సాహసాల గురించి సవివరంగా ఇప్పుడు మీకు చెప్పలేను. విచారకరమైన విషయమేమంటే, పెపీ మొసలి (అంకుల్ శామ్ లేదా అమెరికాకు మరొక గమ్మత్తయిన పేరు) ద్వారా అత్యంత ఆసక్తికరమైన కొందరు మిత్రులను కలుసుకున్నాను.
దాని గురించి మరోసారి...
మిమ్మల్నందరినీ, మీ అమ్మను ఎంతగానో ప్రేమిస్తున్నానని మాత్రమే ఇప్పుడు చెప్పగలను. చిన్నవాళ్ళను నేను ఫొటోల ద్వారా మాత్రమే చూస్తున్నాను. నేను వదిలి వచ్చే సమయంలో వారు పసివాళ్ళు. మరో నిమిషంలో నా ఫొటో తీసుకుంటారు. ఇప్పుడు నేను ఎలా ఉన్నానో మీరు తెలుసుకోగలుగుతారు. నేను కొద్దిగా ముసలివాడినయ్యాను. అందవికారంగా కూడా తయారయ్యాను.
అల్యూషా ఆరవ పుట్టిన రోజుకల్లా ఈ లేఖ మీకు చేరుతుంది. ఈ లేఖ తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. అల్యూషా తన పుట్టినరోజు ఆనందంగా జరుపుకోవాలని కోరుకుంటున్నాను. అల్యూషా, నీవు కష్టపడి చదవాలి. మీ అమ్మకు ప్రతి విషయంలో చేయగలిగినంత సహాయం చేయాలి. నీవు అందరికన్నా పెద్దదానివని గుర్తుంచుకో.
కామిలో, నీవు స్కూల్లో ఎక్కువగా మాట్లాడవద్దు. నీకు తగిన విషయాలను నేర్చుకో. సెలిటా, మీ అమ్మమ్మకు ఇంటిలో తిరగటానికి సహాయం చెయ్యి. నేను వీడ్కోలు చెప్పినప్పుడు ఎంత సంతోషంగా ఉన్నావో, ఎప్పుడూ నీవు అంతే సంతోషంగా ఉండాలి. అలా ఉండకుండా ఎలా ఉంటావులే. టాటికో నీవు ఉత్తమ పురుషునిగా పెరగాలి. నీవు ఎలా తయారయ్యావో మనం మళ్ళీ కలుసుకున్నప్పుడు చూస్తాను. సామ్రాజ్యవాదం ఉన్నంత వరకు దానికి వ్యతిరేకంగా మనం పోరాడాలి. అది ఓడించబడిన తర్వాతనే మీరు, నేను చందమామ మీద ఆనందంగా శలవులను గడుపుతాము. మీ అమ్మమ్మ, తాతయ్యలను అడిగినట్లు చెప్పండి. ఆమె బిడ్డకు నా ముద్దులు. ఎస్టెలా, కార్మిటాలకు కూడా. అందరికీ పెద్ద ఏనుగంతటి ముద్దు...
- నాన్న