'నేను చాలా పెద్ద తప్పు చేశానురా. బయట తెలిసిందంటే అమ్మో! నేను బతకలేను. మా నాన్నకు ఈ విషయం తెలిసిందంటే నా చర్మం తీసి, డోలు కడతాడు. మొదటిసారి నేను నిన్నటిరోజు పదహారేండ్ల వయసున్న అమ్మాయి పక్కన ..' అంటూ తలపట్టుకొన్నాడు కష్ణమూర్తి.
నేను అయోమయంగా కృష్ణమూర్తి వైపు చూశాను.
'జానపద కథలలోలాగా నీవు రాత్రివేళలో అమ్మాయిగా మారుతున్న సంగతి నిజంగా నాకు తెలీదురా!' తల కొట్టుకుంటున్నట్టుగా నటిస్తూ అన్నాడు.
నన్ను ఎగతాళి చేస్తూ చెబుతున్నాడని గ్రహించాను.
'మా సీనియర్స్ హాస్టల్ గదులు రిపేర్ చేస్తుండటం వలన జూనియర్ హాస్టల్ గదుల్లో కొన్ని రోజులు ఉండమని చెబుతూ నాకు నీ గది చూపించాడు. నిన్న రాత్రి సినిమాకు వెళ్లి, ఆలస్యంగా నేరుగా నీ గదికి వచ్చి, నీ పక్కనే పడుకొన్నాను. ఆ సమయంలో నీవు నిదురపోతున్నావు. ఉదయాన్నే నీలో కలిగిన భయాన్ని చూడగానే నీవు రాత్రివేళ అమ్మాయిగా మారిన సంగతి ఊహించాను' నవ్వుతూ అన్నాడు.
'మనమిద్దరం ఒకే మంచంలో పడుకోవడం.. మీరు మన గ్రామంలో ఊరిపెద్ద కొడుకు, పెద్ద కులపోళ్ళు. నేను తక్కువ కులానికి చెందినవాడిని.
'అలాగా, ఒకే ఒక చిన్న అనుమానం నీ కులం బరువెంత? పొడుగెంత? అలాగే నా కులం బరువెంత? పొడుగెంత? అని చెప్పావంటే నా కులం ఎంతపెద్దదో తెలుసుకొంటాను!' అన్నాడు.
నాకు ఏం సమాధానం చెప్పాలో అర్థంకాక మౌనంగా తలవంచుకొని నిలబడ్డాను.
'రాజబాబూ, కొత్త సంవత్సరం వారంతా నిన్ననే చేరినట్లు తెలుసు. నీకు ఈ ప్రైవేట్ కాలేజీలో ఎలా సీటు దొరికింది?' అన్నాడు.
'పదవ తరగతిలో అన్నింటిలో నూటికి నూరు మార్కులు తెచ్చుకొన్నాను. ఆ సంగతి తెలుసుకొన్న ఈ కాలేజీ వారే హాస్టల్ ఫీజు, చదువుల ఖర్చు భరిస్తామని చెబితే.. నిన్న ఉదయమే వచ్చి చేరాను' అన్నాను.
'నేనిక్కడున్నట్లు ముందుగా తెలిసుంటే ఈ కాలేజీ వద్దనేవాడివా?' అడిగాడు.
'మీ ఇంటిలో మానాన్న చేసే పనులు మీకే తెలుసు. పశువులను మేపుకు రావడం, పాలు పిండడం లాంటి పనులు, తోట పనులు చేస్తున్నాడు. మీతో సమంగా ఈ కాలేజీలో..' అన్నాను.
'కాలేజీలో కులం గురించి ఎవరూ మాట్లాడరు. ఈ రోజు నుండి మనం స్నేహితులు రాజబాబూ' అన్నాడు.
'అదికాదు మీరు...'
'నీ యవ్వ.. మరలా మీరు అన్నావంటే నాలో కోపం.. మర్యాదగా స్నేహితుడిలా నడచుకో, స్నేహితుల మధ్య మర్యాదలుండవు. కృష్ణమూర్తి కాదు, ఒరే కృష్ణమూర్తి అని పిలువు.'
************
మొదట్లో నాకు కాస్త కష్టంగా, సిగ్గుగా అనిపించినా కొన్ని రోజులలో 'ఏరా' అంటూ సహజంగా పిలవడం అలవాటయింది.
మేము తక్కువ కులానికి చెందిన వారం, ఇప్పటికీ కృష్ణమూర్తి నాన్నగారు ఎదురుపడితే చెప్పులు చేతిలోకి తీసుకొని, తలవంచుకొని నిలబడేవారం. మా ఊరిలో హైస్కూల్ లేనందువలన మా మామయ్య ఊరిలో హైస్కూల్ చదువు పూర్తిచేసుకొన్నాను. సెలవులకు వచ్చినప్పుడు నాన్నతో పాటు పనికి వెళ్ళేవాడిని. ఆ సమయంలో కృష్ణమూర్తితో గొప్పగా పరిచయం లేకున్నా ఏదైనా పని చెప్పవలసినప్పుడు చెప్పేవాడు. కృష్ణమూర్తి నా దగ్గర అధికారంతో మాట్లాడేవాడు కాదు.
నా చదువు వ్యవహారం అంతా మా మామయ్య చూసుకునేవాడు. నేను కాలేజీ చదువుతున్న సంగతి మా నాన్నకు తెలిసినా పట్నంలో నేను చదువుతున్న ఈ కాలేజీ పేరు తెలీదు. ఈ కాలేజీలో డాక్టరు సీటు కోసం జరిగే ఎంట్రన్స్ పరీక్షలకై మొదటి సంవత్సరం నుండే ప్రత్యేక కోచింగ్ కూడా ఇస్తున్నారు. ఎలాగైనా డాక్టర్ కావాలన్న ఉద్దేశ్యంతో శ్రద్ధతో చదువుతున్నాను.
***************
జూనియర్ అంటే సీనియర్లు చాలా చులకనగా చూస్తుంటారు. రాగింగ్ పేరుతో నన్ను ఏడిపించబోతే కృష్ణమూర్తి అక్కడకు వచ్చాడు.
'రేరు, వీడు నాకు స్నేహితుడిలాంటి వాడు మాత్రమే కాదు, నాకు దూరపు బంధువు' అంటూ కృష్ణమూర్తి చెప్పగానే 'ఆ మాట ముందుగా వాడే చెప్పి వుంటే సరదాగా కాస్సేపు ర్యాగింగ్ చేసి వదిలేసేవారం..' అంటూ నన్ను ర్యాగింగ్ చేయడానికి వచ్చిన వారంతా నా గది వదిలి, వెళ్లారు.
కృష్ణమూర్తి నన్ను స్నేహితుడు అని చెప్పినా అంతగా పొంగిపోయి వుండేవాడిని.. నన్ను ఒకేసారి బంధువు అంటూ చెప్పడం నా మనసులో చెప్పలేనంత ఆనందం కలిగింది.
'స్నేహమంటే భుజం మీద చేయివేసి నడవటం మాత్రమే కాదు. ఎన్నికష్టాలొచ్చినా నీ వెనుక నేనున్నానని భుజం తట్టి చెప్పే నీలాంటి స్నేహితుడు దొరకడం.. డొనేషన్ లేకుండా ఈ కాలేజీలో చేరడం. ఈ రెండు సంఘటనలు నా జీవితంలో అద్భుతమైన మరపురాని సంఘటనలు.' అంటూ వాడి భుజంపై చేయివేశాను.
*******************
ఉదయం లేవగానే పక్షుల కిలకిలారావాలు.. సుందరమైన దృశ్యాలు చూస్తుంటే శరీరానికి, మనసుకు ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని ఇచ్చేది. ఆ సమయంలో కృష్ణమూర్తి వచ్చాడంటే మరింత ఆనందం, ఉత్సాహం కలగడం గమనించాను. నేను వాడి మీద ఎక్కువగా అభిమానం పెట్టుకుంటున్నానేమో అనిపిస్తుంది.
కాలేజీలో కులం, మతం చూడకుండా అందరూ స్నేహంగా మెలిగేవారు. ఒకరిద్దరు మాటవరసకు నా కులం గురించి అడిగితే నేను ఎస్టీ అంటూ సమాధానమిచ్చాను. అదొక మామూలు సంగతిగా తీసుకొన్నారు తప్ప.. ఎవరూ నన్ను వేరుగా చూడలేదు. గ్రామంలోనే కులం, మతం అంటూ ఎన్నో గొడవలు, వీటికి పరిష్కారం ఎప్పుడు అన్న ఆలోచనలు నాలో కలగసాగింది.
ఆ రోజు మెడికల్ ఎంట్రన్స్ కోచింగ్ ముగించుకొని, హాస్టల్‌గదికి వెళ్తున్న సమయాన కృష్ణమూర్తి ఫుట్‌బాల్ ఆడుకొంటున్న సమయాన కిందపడి, తలకు గాయమయినట్లు తెలిసింది. వెంటనే ఆసుపత్రికి బయలుదేరాను. పెద్ద కట్టుతో వున్న కృష్ణమూర్తిని చూడగానే నా కంట్లో నీరు జలా జలమని కారింది.
'నా తలకు రక్తం కన్నా.. నీ కంటినీరు ఎక్కువగా కారుతుంది..' మెల్లగా అన్నాడు కృష్ణమూర్తి.. పక్కనే ప్రిన్సిపాల్ వున్నారు
'మూడు రోజులు విశ్రాంతి అవసరమని డాక్టరు చెప్పారు' అని ప్రిన్సిపాల్ అన్నారు.
'మా ఊరికి...' మెల్లగా అంటూ ఊరికెళ్తాను అన్నట్టుగా సైగచేశాడు.
'ఎవరూ తోడు లేకుండా నేను పంపను' అన్నారు ప్రిన్సిపాల్.
'నేను తోడుగా వెళ్తాను సార్' అన్నాను.
కృష్ణమూర్తితో తోడుగా నేను వెళ్ళడానికి ప్రిన్సిపాల్ అంగీకరించారు.
ఉదయాన్నే డిశ్చార్జ్ చేసి పంపుతామని డాక్టరు చెప్పారు. నేను హాస్టలుకు వెళ్లి, కృష్ణమూర్తి దుస్తులు, నా దుస్తులు తీసుకొని వచ్చి ఆసుపత్రిలోనే ఆ రాత్రి కష్ణమూర్తి బెడ్ పక్కనే వున్నాను. ఉదయం పది గంటలకు డిశ్చార్జ్ చెయ్యగానే పదకొండు గంటల పాసెంజరుకు బయలుదేరడానికి వెళ్ళాము.
మేము వెళ్లడం, బండి రావడం, ఎక్కడం జరిగింది. కొన్ని క్షణాలు ఆలస్యమయినా బండి దొరికుండేదికాదు. సీట్లో కూర్చున్నాక 'ఆకలిగా వుందిరా.. బిర్యాని..' అన్నాడు. అప్పుడే వెళ్తున్న బిర్యాని పొట్లం అమ్మే అతనిని పిలిచి, రెండు ఇవ్వమన్నాను.
'రెండు లేవు సార్ ఒకటే వుంది' అంటూ ఒక్క పొట్లం ఇచ్చి, డబ్బులు తీసుకొన్నాడు. అంతలో బండి కదిలింది. ఇద్దరం కలసి ఒకే పొట్లాన్ని అన్నదమ్ముల్లా.. తండ్రి కొడుకుల్లా.. చిన్నపిల్లల్లా తిన్నాము.
మేము దిగవలసిన స్టేషన్ రావడానికి ముందు 'రాజబాబు, నేను ఆటోలో వెళ్తాను.. నీవు' అంటూ మెల్లగా అడిగాడు.
'నేను నడిచే వెళ్తానురా. ఆ సంగతి నీకు ముందుగా చెబుతామనుకొన్నాను' అన్నాను.
'సారీ రా.. అప్పుడప్పుడు..' అంటూ ఫోను చేస్త్తాను అన్నట్టుగా సైగ చేసాడు.
'స్నేహితుల మధ్యలో సారీలు వద్దురా. ఆరోగ్యం జాగ్రత్త, బాగా విశ్రాంతి తీసుకో, ఎవరితోనూ ఎక్కువగా మాట్లాడవద్దు, నాకు ఫోను చేయవద్దు ఏమైనా ఉంటే మెసేజ్ పెట్టు రా. మన ఊరి వారు ఎవరైనా వుంటారు. నీవు ఆ చివర దిగు, నేను ఈ చివర దిగుతాను' అంటూ నా సంచి తీసుకొని ఈ వైపు వెళ్ళాను. స్టేషన్ దిగి వేగంగా నడచుకొంటూ వెళ్ళాను.
ఇంటికెళ్ళగానే మా అమ్మానాన్నల కళ్ళల్లో కోటి దీపాల వెలుగును చూశాను. సంతోషం, ఉత్సాహం గమనించాను.
కుశలములు విచారించారు. వారడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. నేను చదువుతున్న కాలేజీ పేరు అడిగితే 'ప్రభుత్వ కాలేజీ అని చెప్పండి. ఎందుకంటే నేనిప్పుడు చదువుతున్న కాలేజీలో సీటు దొరకాలంటే లక్షలలో చెల్లించాలి. నాకు ఉచితంగా ఇచ్చారు. ఎవరడిగినా ప్రభుత్వ కాలేజీ అని చెప్పాలి' అంటూ చెప్పాను.
ఆశ్చర్యంగా నా వైపు చూస్తూ సరేనంటూ తలాడించారు. 'మీ మామయ్య నాతో ప్రభుత్వకాలేజీ అని చెప్పాడు' అంది అమ్మ.
'నేనే అలా చెప్పమని చెప్పాను!'
'ఒరే అయ్యగారింటికి పనికి వెళ్ళాలి. నీవూ వస్తావా నిన్ను ఇంతవరకు చూడలేదు.' అన్నాడు.
'నాన్నా, మీరెళ్ళకండి. ఈ వేళ సాయంత్రం నేను వెళ్ళాలి. ఈ రోజు మాత్రమే నాకు సెలవిచ్చారు. చాలారోజులైంది మిమ్మల్ని చూద్దామని వచ్చాను' అన్నాను.
'మామిడితోటకు నీళ్లు పట్టాలి. పని పూర్తికాగానే వెంటనే వచ్చేస్తాను' అంటూ వెళ్లారు.
అమ్మ వంటలో మునిగింది. అలా వెళ్లి వస్తానని చెప్పి, వెళ్ళాను.
ఎదురుచూడని విధంగా కృష్ణమూర్తి తల్లితండ్రులతో మెల్లగా వస్తున్నాడు.
ఒక్క క్షణం ఆలోచించాను అనడం కన్నా ఎప్పుడో నిర్ణయించుకొన్నదే.. నా చెప్పులు చేతులో తీసుకొని, తల వంచుకొని నిలబడ్డాను.
వాళ్ళు వెళ్ళాక కాళ్లకు చెప్పులు వేసుకున్నాను.
సెల్ ఫోను నందు మెసేజ్ వచ్చిన శబ్దం విని తీసి చూసాను
'మానాన్న నీతో మాట్లాడే పరిస్థితిలో లేడు. నాకు దెబ్బ తగిలిందన్న బాధలో వున్నారు. కాలేజీలో నీలోని మార్పును, నీ ఆలోచనా ధోరణిని చూసి ఈ రోజు ఇలా ప్రవర్తిస్తావనుకోలేదు. నీవింకా మారలేదా?'
'మన తల్లిదండ్రుల తరం ఆఖరి దశలో వుంది. వారిలో మార్పు కోసం ప్రయత్నించడం కన్నా మన యువతరంలో మార్పు కోసం ఎక్కువ ప్రయత్నించాలి. మన తల్లిదండ్రులు మారరని మనకు తెలుసు. మన స్నేహం కలకాలం ఉండాలంటే పెద్దవాళ్ల దగ్గర చిన్న చిన్న అబద్ధాలు ఆడుతూ నాటకం ఆడాలి. యువతరం మారిందంటే పెద్దవారిలో మార్పు రాకున్నా సర్దుకుపోవడానికి అలవాటుపడతారు.' అంటూ బదులు ఇచ్చాను.
'నువ్వు చెప్పింది కరెక్ట్.. మనం మారాలి.. సర్టిఫికెట్స్ నందు ఏ కులం అన్న ప్రశ్న తొలగించాలి. తమిళనాడులో స్నేహ అనే మహిళ ఏడు సంవత్సరాలు పోరాడి తనకు కులం, మతం లేవంటూ సర్టిఫికెట్ పొందింది. ఆమె అలాంటి సర్టిఫికెట్ పొందిన తొలి భారతీయ మహిళ!' అంటూ సమాధానం ఇచ్చాడు కృష్ణమూర్తి.
టీ అంగడి ముందు వెళ్తున్నప్పుడు 'ఒరే' అంటూ కులం పేరు పెట్టి నన్ను పిలిచాడు. వాడు డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్నాడు.
'ఏరా నల్లోడా బాగున్నావా.. రా' అంటూ వాడి దగ్గరకు వెళ్లి అడిగేటప్పటికీ వాడి ముఖం కోపంతో ఎర్రబడటం గమనించాను.
'ఒరే నా కొడుకా, నన్ను మర్యాద లేకుండా' అంటూ నా దగ్గరకు వచ్చి నా చొక్కా పట్టుకొనగానే, నేనూ వాడి చొక్కా పట్టుకున్నాను.
చుట్టూ వున్నవారు వచ్చి విడిపించారు.
'నీవూ కాలేజీ చదువుతున్నావు. అక్కడ ఎవరినన్నా కులం పేరుతో పిలిచావా? అన్ని కులాల వారు, అన్ని మతాల వారు స్నేహితుల్లా, అన్నదమ్ముల్లా కల్సి వున్న సంగతి మరిచావా? పల్లెటూరికి రాగానే కులాలు గుర్తుకు వచ్చాయా?' ఈ తరం యువకులు మారాలి. అప్పుడే కులమత ఘర్షణలు తొలిగిపోయేది' కోపంగా చెప్పి, అక్కడినుండి వెళ్ళాను.
- ఓట్ర్ర ప్రకాష్‌రావు
9787446026