Jul 23,2023 13:31

'మీ అమ్మగారు కనబడటం లేదు' అంటూ కంగారుగా మా ఆవిడ లేపడంతో, బద్ధకంగా కళ్ళు తెరిచాను. టైమ్‌ ఏడున్నర అయింది. క్రితం రాత్రి అత్తాకోడళ్ళు మాట మాట అనుకున్న విషయం గుర్తుకొచ్చింది. దాంతో అత్తగారు ఏ అఘాత్యం చేసిందో అని మా ఆవిడ భయపడిపోయినట్టు కనబడింది.
'అలా నిబ్బరంగా ఉంటారేమిటి? ఆవిడేమైనా అఘాత్యం చేస్తే, అప్రతిష్ఠ కూడానూ!' అంటూ మా ఆవిడ కంగారుగా చూసింది.
మా అమ్మ మనసు నాకూ బాగా తెలుసు. చాలా ప్రాక్టికల్‌గా అలోచిస్తుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోదు. మా ఆవిడకి ఆ విషయాలు చాలాసార్లు చెప్పి చూశాను. కానీ అర్థం చేసుకోదు.
ఇంట్లో అన్ని గదులూ చూసి, బయటకు వెళ్దాం అని నిశ్చయించుకుని, గబగబా బట్టలు మార్చుకుంటుంటే నాకు కాలేజీలో చదువుకునే రోజులు జ్ఞాపకానికి వచ్చాయి.
ొొొ
'ఒక్కర్తే ఆ కొంపలో కూపస్త మండూకంలా కూర్చుని ఉంటుంది. ఇక్కడకి వచ్చి ఉండవే.. అని ఎన్నిసార్లు చెప్పినా వినదు. ఆ ముసల్ది. ఎలా ఉందో ఓ సారి చూసి రా నాయనా!' అని మా అమ్మ వారానికోసారి చెప్పేది.
ఆ ముసల్ది ఏవరో కాదు మా అమ్మమ్మ. మా ఊర్లోనే బొండాడవీధిలో ఉండేది.
'మీ కాలేజీ దగ్గర్నుంచి నాలుగడుగులే కదరా' మా అమ్మ ఆ ఒక్క వాక్యంలో మధ్యాహ్నం లంచ్‌ టైములో ఓసారి వెళ్ళమనే హకుం కనబడేది.
'అబ్బా.. అరగంటే టైము ఉంటుందమ్మా. వెళ్ళిన తర్వాత కాఫీ తాగమంటుంది.. నా వల్ల కాదు' అంటూ తప్పించుకోడానికి ప్రయత్నం చేసేవాణ్ణి.
రెండు వాసల ఇంటి మధ్య వసరాలో నిప్పుల్లేని బొగ్గుల కుంపటి మీద కాఫీ గిన్నె ఉంచి, దాన్ని ఎండలో ఉంచేది మా అమ్మమ్మ. కాఫీ నీళ్లు ఆ ఎండలో వేడెక్కుతుంటే, ఆరారా ఆ కాఫీనే తాగేది. ఇలా నాలాంటి బకరాగాళ్ళు వస్తే, వాళ్ళకీ అదే కాఫీ ఇచ్చేది.
'అదేవిట్రా.. అరగంట ఎందుకూ, కన్యకాపరమేశ్వరి కోవెల పక్కనే పేర్ల వారి ఇల్లు ఉంటుందిగా. ఆ ఇంటి ఎదురు సందులో నాలుగడుగులు వేస్తే, బొండాడ వీధి వస్తుంది. ఆ వీధిలో బంగారయ్య సిల్వరుసామాను కొట్టు, ఆ గుమ్మం దగ్గర గోడ వారగా రేకుతో చేసిన పెద్దమనిషి బొమ్మ ఉంటుంది కదా! ఆ ఎదురుగా ఎత్తు అరుగుల కొంపలో ఒంటిపిల్లి రాకాసిలా ఉంటుంది. ఎంతా.. ఓ పది నిమిషాల్లో చూసి రావచ్చులే' అలా మా అమ్మకి, వాళ్ళ పుట్టింటి చిరునామా చెప్పడం చాలా ఇష్టం. ఆ మాటల్లో.. మా అమ్మకి వాళ్ల అమ్మ మీద అభిమానమో, కోపమో నాకర్థమయ్యేది కాదు.
ఆ ఇంట్లోనే మేం అందరం పుట్టామని, అప్పుడప్పుడు సెంటిమెంట్‌ జోడించి కూడా చెపుతుంది.
ఆ వీధిలో ఒకవైపు ఇళ్లు కంటే, ఎదురు వాసలో ఇళ్ళు ఎత్తుగా ఉండేవి. మా అమ్మమ్మ వాళ్లు ఇంట్లో అడుగు పెట్టాలంటే ఏడు మెట్లు ఎక్కాలి. అక్కడ ఆరడుగుల చిన్న వసరా, అక్కడ్నుంచి ఇంట్లోకి వెళ్లడానికి గుమ్మం ఉండేది. ఆ మెట్లకి కింద నుంచి మునిసిపాలిటీ వారి మురికి కాలువ జీవనదిలా ప్రవహించేది. కొంచెం సుగంధ సువాసన కూడా వెదజల్లేది. ఇంట్లో పనవగానే అమ్మమ్మ ఆ వసరాలో గోడనానుకుని కూర్చుని, వచ్చి పోయేవాళ్లని పలకరించేది.
'అక్కడ కూర్చుని ఆ ముసల్ది కునుకులు తీస్తుంది. ఆ నిద్రతో ఎక్కడ ఆ మురికికాలువలో పడుతుందో అని రోజూ భయపడి చస్తున్నాను. ''లోపలకి వెళ్లి పడుకోవే'' అని ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోదు' అంటూ మా అమ్మా ఎప్పుడూ చెప్తూనే ఉంటుంది.
అప్పుడప్పుడు మా అమ్మతో ఆ ఇంటికి వెళ్లేవాణ్ణి. వాళ్లద్దరి సంభాషణలు తమాషాగా ఉండేవి.
'ఎందుకే అలా ఒంటిపిల్లి రాకాసిలా ఉంటావూ..? నీ కొడుకుల దగ్గరకి పోవచ్చుగా' అని మా అమ్మ చాలసార్లు చెప్పి చూసింది.
'అక్కడ గండుపిల్లి రాకాసులు ఉన్నాయి.. అయినా నీకేం బాధా' అంటూ మా అమ్మమ్మ గట్టిగానే చెప్పేది.
'అంతా మొండితనం ఉండకూడదే అమ్మా, పోని మా ఇంటికొచ్చి ఉండొచ్చుగా' అని ఓసారి గట్టిగానే అడిగింది.
'సర్లే.. ఇల్లరికం ఉంటుంది కానీ, అత్తరికం ఉండదు ఎక్కడా! అయినా నాకేం తక్కువే, మీ పెద్దతమ్ముడు వారం వారం వస్తున్నాడుగా. సామాను, కూరలు తెచ్చి పడేస్తున్నాడు. పదోపరకో చేతిలో పెట్టి వెళ్తున్నాడు. ఇంక నాకేం అవసరం ఉంటుంది?' అంటూ ఆ ఆహ్వానాన్ని తిరస్కరించేది.
'అది కాదే.. ఒక్కదానివి ఉండొద్దూ?' అని మా అమ్మ నచ్చజెప్పడానికి ప్రయత్నం చేసేది.
'మరేం భయంలేదు.. నేను రాక్షసినని వీధిలో వాళ్లందరు వినేటట్టు మీ మరదలు ఆడిపోసుకుంటుందిగా, అది నిజమే అనుకుని ఎవరు రారులే' అంటూ చిరాకు పడే మా అమ్మమ్మ మాటలకి ఒకొక్కసారి మా అమ్మ దగ్గర జవాబులు ఉండేవి కావు.
'అయినా నా దగ్గరేముందే ఎత్తుకు పోవడానికీ?' అంటూ చిరిగిపోయిన చీరచెంగు చూపించేది.
'ఏవిటో నీ కొడుకులు ఎంత సంపాదిస్తున్నా నీకు అనుభవించటం చేతకాదు. ఆ ట్రంకు పెట్టెలో కుక్కేసిన చీరలు తీసి, కట్టుకోవచ్చు గదా, ఎవరి కోసం దాచి పెడతావూ?' మా అమ్మ కూడా చిరాగ్గా అనేసరికి, మా అమ్మమ్మ మూతి మూడు వంకలు తిప్పేది.
'ఆ.. అప్పటికి మీ నాన్న తాసిల్దారు ఉద్యోగం చేసి, డబ్బులు కుప్పపోసి ఉంచారుగా, వాటితో పట్టుచీరలు కొనుక్కున్నాను.. రేపట్నుంచి వాటినే వాడతాన్లే, నాకు అత్తగారు లేని లోటు నువ్వు తీరుస్తున్నావే తల్లీ!' అంటూ మా అమ్మమ్మ చేతులు ఊపుకుంటూ వెటకారంగా అనేది.
ఆ మాటలకి మా అమ్మ ముసిముసిగా నవ్వుకునేది.
ఆ రోజుల్లో మా తాతగారు బరంపురంలో తాసిల్దారుగా పని చేసేవారుట. మా అమ్మ పెళ్ళీడు వచ్చేసరికే ఆయన కాలం చేస్తే, సొంతిల్లు వాకిలి చూసుకోవడానికి నలుగురు పిల్లలతో మా అమ్మమ్మ విజయనగరం వచ్చిసింది. దాయాదుల ఆస్తి పంపకాల్లో ఆ ఇల్లు మా అమ్మమ్మకి వచ్చింది. సంసారాన్ని ఎలా ఇడ్చుకొచ్చిందో గానీ, మొత్తం మీద మగపిల్లలిద్దరూ స్కూలుఫైనల్‌ పాసై, రైల్వేలో స్టేషనుమాష్టర్లుగా ఉద్యోగాలలో చేరిపోయారు. తర్వాత కాలంలో అందరికీ దగ్గర సంబంధాలతో పెళ్ళిళ్ళు కూడా చేసింది. మా దొడ్డమ్మా వాళ్ళు ఎక్కడో మధ్యప్రదేశ్‌లో ఉంటారు. మా పెదనాన్నగారు కూడా రైల్వేలో మాల్‌ బాబ్‌.. అంటే గూడ్స్‌ క్లార్క్‌ అని తర్వాత తెలిసింది.
మా అమ్మమ్మని మా మవయ్యలు వాళ్ళు పనిచేసే ఊర్లకి తీసుకెళ్ళేవారు. ఓ పదిహేను రోజులు గడిచేసరికి, అక్కడ సరిపడక, తిరిగి విజయనగరం వచ్చేసిది. 'అదేమే..?' అని అడిగితే, 'ఆ దిక్కుమాలిన కొంపల్లో రైళ్ళూ పరిగెడతాయి.. గుండెల్లో నా కోడళ్ళూ..' అంటూ చివరిమాట నొక్కి పలికేది.
'నీ కర్మ' అంటూ మా అమ్మ చిరాకు పడేది.
'వెళ్తే మీ తమ్ముళ్ళు గురించి వెళ్లాలి. అయినా ఇక్కడ నాకు ఇబ్బందేం లేదులే.. నువ్వేం బెంగపెట్టుకోకు' అంటూ మా అమ్మమ్మ దైర్యంగానే ఉండేది.
ొొొ
ఓ రోజు ఉదయాన్నే మా అమ్మా కంగారుపడుతూ నన్ను తీసుకుని ఆటోలో మా అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అప్పటికే ఇంటి దగ్గర చుట్టుపక్కల వాళ్ళు చేరారు.
ఆటో దిగి, మా అమ్మ గబగబ ఇంట్లోకి పరిగెత్తింది. ఆటోవాడికి డబ్బులిచ్చి, నేను కూడా లోపలికి వెళ్లా. వెనక వాకిట్లో ఎండపట్టున మా అమ్మమ్మ బుర్ర దించుకుని, కూర్చుని ఉంది. మా పెద్దత్తయ్య వంటింట్లో పని చేసుకుంటున్నది. అక్కడ పరిస్థితి చూస్తే, ప్రమాదం ఏం లేదనిపించింది. వాళ్ళ మాటల బట్టి, మా అమ్మమ్మ కోపం వచ్చి, నూతిలోకి దూకిందని, పక్కింటో ఉన్న రామంగారు నూతిలో దిగి, అమ్మమ్మని బయటకు తీసుకువచ్చారని, నూతిలో ఎక్కువ నీళ్లు లేకపోవడంతో బతికిపోయిందనే విషయాలు తెలిసి, మా అమ్మ ఊపిరి పీల్చుకుంది.
రెండిళ్ళ మధ్య ఉండే ఆ నుయ్యి ఎక్కవ లోతు ఉండదు. ఏడాదిలో మూడు నాలుగు నెలలు ఎండిపోయి ఉంటుంది. నీళ్ళు కూడా నాలుగైదు అడుగులే ఉంటాయి.
'ఏమైందమ్మా.. కాలు జారి పడిపోయావా?' అంటూ ఆవిడ పక్కన కూర్చుంటూ అడిగింది మా అమ్మ.
'అదేం లేదు వదినా.. పిల్లలకు సెలవులిచ్చారు కదా అని, ఓ వారం ఉందామని నిన్ననే వచ్చాను. ఇవాళ ఉదయన్నే కాఫీ కలిపి నేనే ఇస్తే, వేడిగా లేదంటూ నా మీద అరిచారు. కాస్సేపు ఆగండి.. చెయ్యి ఖాళీ అవగానే, వేడి చేసి ఇస్తానని అన్నాను. అంతే.. నా మీద గట్టిగా అరిచి, నూతిలోకి గెంతేశారు. అదృష్టం బావుండీ నూతిలో నీళ్ళు లేకపోవడం.. బతికి బయటపడ్డారు' అంటూ మా పెద్దత్త చెప్పుకొచ్చింది.
'అదేం కోపమే అమ్మా..' అంటూ మా అమ్మ ఇంకా ఏదో చెప్పబోయింది.
'నీకు అర్థం కాదే.. అత్తగారంటే ఇసుమంత కూడా గౌరవం లేదు సరికదా, అసలు ఖాతరే చెయ్యదు. పదిహేను సంవత్సరాలుగా పడుతున్నాను. నేనూ ఆడదాన్నే కదా, ఇక నా వల్ల కాదే తల్లీ, నీకు, నీ మరదళ్లకి ఓ నమస్కారం' మా అమ్మమ్మ ఏడుస్తూ గట్టిగా అన్నది.
'అది కాదే.. వయసు మీద పడుతుంటే, సర్దుకునిపోవాలి. ఊ అంటే కోపం ఊహు అంటే రాద్దాంతం చేస్తే ఎలా చెప్పూ?' అంటూ మా అమ్మ సర్ది చెప్పడానికి ప్రయత్నం చేసింది.
'అవునే.. నీకూ కోడలుంటే తెలిసేది నా బాధలు..'
'సరే.. ఆ గొడవలు చూడ్డానికి నువ్వు ఉండాలి కదా, ఇలా అఘాయిత్యాలు చేస్తే ఎలా?' మా అమ్మ నవ్వుతూ అంది.
'నీకు అన్నీ వెటకారంగానే ఉంటాయి. అయినా.. నా మానాన నా కొంపలో నన్నొక్కర్తినే ఉండనివ్వకుండా, లోకానికి వెరసి ఇదిగో ఇలా వస్తూ పోతూ, నన్ను ఆడిపోసుకోవడానికి నేను బతికుండాలా? నా వల్లకాదే.. నేనే ఏదో నుయ్యో, గొయ్యో చూసుకుంటే, నా గొడవ మీకుండదు' అంది.
'అది సరేనే.. ప్రతి ఇంట్లోనూ ఈ భాగవతం ఉంటూనే ఉంటుంది.. అంతమాత్రంగా చచ్చిపోతమా?'
'ఇప్పుడు నీకు అర్థంకాదులే, నీదాకా వస్తే కానీ ఇటువంటి విషయాలు అర్థం కావు' మా అమ్మమ్మలో ఎక్కడా పశ్చాత్తాపం కనబడటం లేదు.
'ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయభేదాలు రావడం సహజమే అమ్మా, పురాణకాలం నుంచి చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు కొత్తేం కాదుగా, మీ అత్తగారు, నువ్వు దెబ్బలాడుకోలేదా..? నీ మీద కోపంతో మీ అత్తగారు నూతిలో దూకిందా?'
'ఆవిడ్ని ఏం అనకు.. కళ్ళు పోతాయి. నా మంచి కోసమే నాతో దెబ్బలాడేది.'
'ఆహా.. అప్పుడేమో రాక్షసి, ఇప్పుడు ఆవిడ దేవత.. బావుందే అమ్మా, కానీ ఒక్క విషయం గుర్తుంచుకో.. సృష్టిలో ఇద్దరు మనుషుల మధ్య అభిప్రాయభేదాలు ఉండటం చాలా సహజం, మానవ జీవితం అంటే షడ్రుచులతో సమ్మేళనం.. అన్నింటినీ రుచి చూడాలి.. ఆస్వాదించాలి, అంతేకానీ అత్తగారు కోప్పడిందని కోడలు, కోడలు దెబ్బలాడిందని అత్తలు ఆత్మహత్యలు చేసుకోకూడదు. అలా అందరూ చేసుకుంటే సృష్టి ఎప్పుడో ఆగిపోయేది. పక్షులు, జంతువులు కూడా దెబ్బలాడుకుంటాయి. కానీ అవి ఆత్మహత్యలు చేసుకోవు తెలుసా? తరాలు మారుతున్నప్పుడు మనం కూడా మారాలి తెలిసిందా?' అంటూ మా అత్త ఇచ్చిన కాఫీగ్లాసు అందుకుని..
'ఇదిగో అమ్మా.. నువ్వు మళ్ళీ ఇలాంటి అఘాయిత్యం మళ్ళీ చెయ్యనని నాకు మాట ఇవ్వు, లేదా మా ఇంటికి పద.. అక్కడే ఉందువు గానీ' అంటూ చెయ్యి చాపింది.
ఆ చేతిలో చెయ్యి వేసిన మా అమ్మమ్మని చూస్తూనే మా అమ్మా కళ్ళనీళ్లు పెట్టుకుంది. మా అత్త హాయిగా గాలి పీల్చుకుని, మా అమ్మమ్మకి కూడా కాఫీ అందించింది.
ొొొ
ఆలోచనల్నుంచి తేరుకుని, వీధి గుమ్మం వైపు వెళ్ళబోయాను.
'కొంచెం వొంట్లో చక్కెర ఎక్కువవుతున్నట్టు వుందని, ఉదయాన్నే ఓ అరగంట నడుద్దామని అలా వెళ్ళానురా!' అంటూ ఇంట్లోకి వస్తున్న మా అమ్మని చూస్తూనే నాకు ధైర్యంతో పాటు, గర్వంగా అనిపించింది.

జయంతి ప్రకాశశర్మ
9848629151