
అది పున్నమి వెన్నెల రాత్రి. 'తాతయ్యా!' అన్న పిలుపుతో ఆలోచనల్లోంచి బయటపడ్డాడు ఆనందరావు.
'ఏంటి తాతయ్యా, ఆ చందమామను చూస్తూ అలా ఆలోచిస్తున్నావు?' అంటూ వచ్చింది అవని.
అవనిని దగ్గరకు తీసుకున్నాడు ఆనందరావు. 'ప్రపంచం ఎంతలా మారిపోయిందోనని ఆలోచిస్తున్నానమ్మా!' అంటూ చిరునవ్వుతో సమాధానమిచ్చాడు.
'ఇప్పుడు ప్రపంచం అంతలా ఏం మారింది తాతయ్యా?' అన్న ప్రశ్నకు జవాబుగా.. 'నీకు ఏం మారిందో అంతగా తెలియదు తల్లీ. నా చిన్నతనానికి ఇప్పటికీ మారనిదేదైనా ఉందంటే అది ఆ వెన్నెలే. ఇప్పుడు త్వరలో అది కూడా మారే రోజులు వస్తాయి. రాత్రి తొమ్మిది దాటితే చిమ్మ చీకట్లు కమ్ముకునే రోజుల నుంచి ఎంత రాత్రినైనా పగలుగా కనిపించేలా చేయగల సాంకేతికత వచ్చింది. అలాగే అప్పట్లో వెన్నెల అంటూ కేవలం రాత్రి పూట వెనుగునిచ్చేది. కానీ ఇప్పుడది పరిశోధనల పుట్ట.' అంటూ చెప్పాడు ఆనందరావు.
'చంద్రునిపై ఏం పరిశోధనలు చేస్తున్నారు? వెన్నెల ఎందుకు మారుతుంది? ఇక్కడి నుంచి అక్కడి దాకా వాళ్ళకి కనిపిస్తుందా?' అంటూ అవని ప్రశ్నల వర్షం కురిపించింది.
అవని చిన్నపిల్ల కావడంతో వాటన్నింటికీ ఓపికగా సమాధానంగా చెబుదామను కున్నాడు ఆనందరావు.
'మన దేశంలో 'ఇస్రో' అనే అంతరిక్ష పరిశోధన సంస్థ ఉంది. ఆ సంస్థ అంతరిక్షంలోకి, వేరే గ్రహాల మీదకి రాకెట్‌లను పంపుతుంది. అలాగే చంద్రుని పైకి కూడా రాకెట్‌లను పంపింది.' అంటూ చెప్పసాగాడు.
'మరి వేరే దేశాలు అలా రాకెట్‌లను పంపవా?' అని అవని అడిగింది.
'ఎందుకు పంపవమ్మా.. పంపుతాయి. మన దేశం చంద్రునిపైకి పంపిన రాకెట్‌లే చంద్రయాన్ 1, 2, 3. 2008లో అంటే నువ్వు పుట్టడానికి ఏడేళ్ల ముందు చంద్రయాన్-1ను పంపింది. అది చంద్రునిపై దిగలేకపోయింది. అయినా దాని ఆర్బిటర్ చక్కగా పనిచేస్తుంది. ఇక ఇప్పుడు, నీ పుట్టినరోజు నాడు చంద్రయాన్ -3ని పంపాయి. ఇప్పటివరకు వేరే దేశాలు ఎన్నో రాకెట్‌లు పంపాయి. కానీ దీనికొక ప్రత్యేకత ఉంది. ఇది ఇప్పటివరకూ ఎవరూ చూడని దక్షిణ ధృవం పైకి వెళ్ళింది. 44 రోజుల ఎదురుచూపుల తర్వాత అది విజయవంతంగా చంద్రుని దక్షిణ ధృవంపై కాలు మోపింది తల్లీ! అయితే మన దేశమే ముందు దక్షిణ ధృవంపైకి రాకెట్‌లను పంపింది.
'అయినా అలా పంపితే ఉపయోగమేమిటి?' అంటూ కుతూహలాన్ని వ్యక్తపరిచింది అవని.
'అలా పంపడం వల్ల చంద్రునిపై మనం బతకగలిగే పరిస్థితులు ఉన్నాయా? లేవా? అని తెలుసుకోవచ్చమ్మా! అక్కడ వాతావరణం ఎలా ఉంది? చంద్రుని ఉపరితలం దేంతో తయారైంది? ఇలాంటివన్నీ తెలుసుకోవచ్చు తల్లీ!' అని వివరించాడు ఆనందరావు.
'అయితే త్వరలో నేను కూడా చందమామపైకి వెళ్తాను' అంటూ గంతులేసుకుంటూ లోపలికి పరిగెత్తింది అవని.
జి.సిరివేద
9వ తరగతి ఎ1
విజరు ఉన్నత పాఠశాల,
నిజామాబాద్, తెలంగాణ.