Jul 27,2023 10:43
  • కార్యకర్తలందరికీ బొత్సను ఓడించడమే ప్రధాన లక్ష్యం కావాలి
  • నాలుగు స్థాయిలలో మీ పనితీరు ను పరిశీలన జరుగుతుంది 
  • గ్రౌండ్ లెవెల్ లో కష్ట పడినవారికి తగిన గుర్తింపు ఇస్తాం

ప్రజాశక్తి-మంగళగిరి : రానున్న సార్వత్రిక ఎన్నికలులో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కిమిడి నాగార్జునను గెలిపించాలని అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. బుధవారం మంగళగిరి టిడిపి కార్యాలయంలో చీపురుపల్లి నియోజకవర్గం ముఖ్య నేతలతో సమీక్ష సమావేశం నిర్వహించారు. టిడిపి గ్రామస్థాయి కార్యకర్త నుండి బొత్సను ఓడించడమే ప్రధాన లక్ష్యం కావాలని పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. ఎన్నికలు సమీపిస్తున్నాయని, భవిష్యత్తు తెదేపాదేనని స్పష్టం చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులు,  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, బూరగడ్డ వేదవ్యాస్ కూడా పార్టీ నాయకులతో విడివిడిగా సమావేశమై నియోజకవర్గంలో తాజా పరిస్థితి పై చర్చించారు. నిరంతరం ప్రజలతో మమేకమవుతూ.. విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని అధినేత చంద్రబాబు సూచించారు. వైకాపా ప్రభుత్వం అధికార బలంతో రానున్న ఎన్నికల్లో అడ్డదారులలో గెలుపొందేందుకు పెద్ద ఎత్తున నకిలీ ఓట్లను స్పృష్టిస్తోందని.. దీనిపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి ఇంటిలోనూ ఓటర్ల పరిస్థితి పైన, జాబితాలో ఉన్న పేర్ల పైన క్షుణ్ణంగా పరిశీలించాలని దిశా నిర్దేశం చేశారు.  వైకాపా ప్రభుత్వ అరాచకాలను, వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. తెదేపా ప్రకటించిన మినీ మేనిఫెస్టో ప్రతి ఇంటికీ చేరాలన్నారు. స్థానికంగా ఉన్న సమస్యలపై పోరాటం చెయ్యాలిని అన్నారు. అందరు కలిసికట్టుగా ముందుకు సాగాలని, పార్టీలో ప్రతి ఒక్కరికీ సముచిత ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పారు. ఎన్నికలు ముగిసే వరకు కార్యకర్తలు అందరూ అలసత్వం చూపవద్దని... వైకాపా దుష్ట పాలన నుంచి ప్రజలను విముక్తులను చేయడమే అందరి కర్తవ్యం కావాలని పిలుపునిచ్చారు. త్రిమూర్తులు రాజుకు తగిన గౌరవం ఇస్తామని హామీ ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో పైల బలరాం, తిరుమల రాజు కిరణ్ కుమార్ రాజు, సారేపాక సురేష్ బాబు, చనమల మహేశ్వరరావు, దన్నాన రామచంద్రుడు, తాడ్డే సన్యాసి నాయుడు, రెడ్డి గోవింద, కెంగువ ధనుంజయ, బలగం వెంకటరావు, యజ్జిపరపు సత్యం, పిల్లా అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు.