- కేంద్రకార్మిక సంఘాల పిలుపు
ప్రజాశక్తి-కాకినాడ : మోడీని సాగనంపండి - దేశాన్ని కాపాడండి నినాదంతో కేంద్ర కార్మిక సంఘాలన్నీ కలిపి ఆగస్టు 9వ తారీఖున విజయవాడలో నిర్వహించే మహాధర్నాని జయప్రదం చేయాలని ఉద్యోగ, కార్మిక, రైతాంగానికి కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా కాకినాడ సిఐటియు కార్యాలయంలో జరిగిన కేంద్ర కార్మిక సంఘాల సన్నాహక సమావేశం లో ఏఐటియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజకుమార్, ఐ.ఎఫ్.టి.యు రాష్ట్ర ఉపాధ్యక్షులు జే వెంకటేశ్వరరావు, ఐఎన్టీయూసీ ఏపీ అండ్ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ తాళ్లూరి రాజు మాట్లాడుతూ, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం కార్మికులకు ఆసరాగా ఉండే 44 కార్మిక చట్టాలను రద్దు చేస్తూ, యజమానులకు అనుకూలంగా తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రాష్ట్రంలో అమలు జరిగితే సుమారు కోటి మంది కార్మికులు ఏ హక్కులు లేని బానిసలుగా మారే ప్రమాదం ఉందని హెచ్చరించారు. తక్షణమే రాష్ట్రంలో నాలుగు లేబర్ కోడ్ల అమలుని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో నవరత్నహోదా కలిగి, పోరాడి సాధించుకున్న ఏకైక పరిశ్రమ విశాఖ ఉక్కుని కూడా అదానీపరం చేయడానికి మోడీ ప్రభుత్వం తహతహలాడుతుందని, అందులో భాగంగానే విశాఖ ఉక్కు పరిశ్రమకు బొగ్గు సరఫరాను అదాని కంపెనీ నిలిపివేసిందన్నారు. రాష్ట్రంలో అధికారిక వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం, జనసేన పార్టీలు, బీజేపీ ఆర్ధిక, మతతత్వ, ప్రజావ్యతిరేక విధానాలను మెచ్చుకుంటూ రాష్ట్ర ప్రజలకు, కార్మికులకు, రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదలకు, నిరుద్యోగం పెరగడానికి, దళితులు, మైనరిటీలపై దాడులు జరగడానికి, ప్రజల కొనుగోలు శక్తిని హరించి దేశం ఆర్ధిక సంక్షోభంలోకి నెట్టడానికి కారణమయ్యే బీజేపీ విధానాలు అంతగా నచ్చినట్లయితే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీలో విలీనం చేస్తే మంచిదని సలహా ఇచ్చారు. తక్షణం కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను, స్కీం వర్కర్లను రెగ్యులర్ చేయాలని, అసంఘటిత కార్మికులైన భవన నిర్మాణ కార్మికులు, హమాలి, ఆటో, ట్రాన్స్ పోర్ట్ కార్మికులను ఆదుకోవడానికి సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. జులై 27న జిల్లా సదస్సు కాకినాడలో నిర్వహించాలని, ఆగస్టు 2వ తేది మెయిన్ రోడ్డు పోస్టాఫీస్ వద్ద చలో విజయవాడ పోస్టర్ ఆవిక్షరణ చేయాలని, ఆగస్టు 7వతేది కాకినాడలో ద్విచక్ర వాహనాల ర్యాలీ నిర్వహించాలని, ఆగస్టు 9న వేలాదిగా విజయవాడకు తరలివెళ్లాలని కార్యాచరణ ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో పెన్షనర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే సత్తిరాజు, ఆశా వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నర్ల ఈశ్వరి, చంద్రమళ్ల పద్మ, సిఐటియు నగర ఉపాధ్యక్షులు మేడిశెట్టి వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.










