Nov 06,2022 10:04
  • ఆరోగ్యానికి ఆకుకూరలు పెట్టింది పేరు. ఇప్పుడున్న జనరేషన్‌కు తోటకూర, గోంగూరలాంటి ఆకుకూరలు మాత్రమే తెలుసు. కానీ పూర్వం మన అమ్మమ్మలు, నానమ్మలు చేల గట్ల మీద దొరికే ఆకుకూరలను విరివిగా వాడేవారు. అవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేసేవి. అజీర్ణ సమస్యలు తీర్చే, మరిన్ని ఔషధ గుణాలున్న చెన్నంగి గురించి మనకు తెలీదు. దీనినే కొంతమంది 'కసివింద, కసింద' అని కూడా పిలుస్తారు.

ఈ చెన్నంగి ఆకు గ్రామీణ వైద్యానికి పెట్టింది పేరు. నరాల నొప్పులను తగ్గించడానికి, వాపులకు పైపూతగా, నోటి మందుగా, కడుపులో ఇన్‌ఫెక్షన్లు తగ్గించడానికి వాడేవారు. పరమౌషధిగా పేరుగాంచిన ఈ చెన్నంగిని ఆహారంగా ఎలా తీసుకోవాలో ఈ వారం రుచిలో తెలుసుకుందాం..

  • పప్పు..

కావలసిన పదార్థాలు : చెన్నంగి ఆకు- కప్పు, కందిపప్పు-1/2 కప్పు, టమోటాలు- 3, ఉల్లిపాయ - 1(మీడియం సైజుది), పచ్చిమిర్చి- 2, నూనె- 2 స్పూన్లు, కరివేపాకు- 2 రెబ్బలు, ఉప్పు- తగినంత, కారం- 2 స్పూన్లు, పసుపు- 1/4 చెంచా
తయారీ : పప్పును ముందుగానే ఉడికించి సరిపోను ఉప్పు కలిపి ముద్దపప్పుగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. బాండీలో నూనె వేడి చేసి పోపుపెట్టి, ఉల్లి తరుగు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి రెండు నిమిషాలు వేపాలి. తర్వాత టమోటా ముక్కలు, ఉప్పు, కారం వేసి వేపి, రెండు నిమిషాల తర్వాత చెన్నంగి ఆకు వేసి, ఉడికించాలి. అన్నీ మగ్గిన తరువాత ముద్దపప్పును నీటితో జారుగా కలుపుకొని, బాండీలోని మిశ్రమానికి కలపాలి. దీన్ని మూడు నిమిషాలు ఉడికించాలి. అంతే చెన్నంగి ఆకు పప్పు రెడీ.

  • పొడి..

కావలసిన పదార్థాలు :
చెన్నంగాకు- మూడు కప్పులు, ఎండుమిర్చి- 12, జీలకర్ర-స్పూను, ధనియాలు-2 స్పూన్లు, మెంతులు- 1/4 స్పూను, చింతపండు- నిమ్మకాయంత, పసుపు- చిటికెడు, ఇంగువ- చిటికెడు, ఉప్పు- తగినంత, నూనె- మూడు చెంచాలు
తయారీ:
ముందుగా చెన్నంగి ఆకుని శుభ్రం చేసిన తర్వాత తడి లేకుండా నీడ పట్టున ఆరబెట్టుకోవాలి. బాండీలో నూనె వేడెక్కిన తర్వాత అందులో ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర, మెంతులు వేసి దోరగా వేయించుకుని, పక్కన పెట్టుకోవాలి. అదే బాండీలో నూనె వేసి, అందులో ఆరిన చెన్నంగి ఆకును చెమ్మ పోయేంత వరకూ నిదానంగా వేయించుకోవాలి. మిక్సీలో ముందుగా వేయించుకున్న దినుసులని బరకగా పొడి చేసుకోవాలి. తర్వాత దానిలో చెన్నంగాకు, చింతపండు, ఇంగువ, పసుపు, తగినంత ఉప్పు వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా పొడి చేసుకోవాలి. చల్లారిన తర్వాత సీసాలో పెట్టుకుంటే నెలపైనే నిల్వ ఉంటుంది.

  • పచ్చడి..

కావలసిన పదార్థాలు: చెన్నంగి ఆకు- కప్పు, చింతపండు- నిమ్మకాయ సైజంత, ఎండుమిర్చి- 12/ పచ్చిమిర్చి-8, ఉప్పు- తగినంత, ధనియాలు- 2 స్పూన్లు, జీలకర్ర- స్పూను, పచ్చి శనగపప్పు-.2 స్పూన్లు, మినప్పప్పు- 2 స్పూన్లు, వెల్లుల్లి రెబ్బలు- 12, కరివేపాకు- గుప్పెడు.
తయారీ: బాండీలో నూనె వేసి పైన చెప్పిన వాటన్నింటినీ వేయించి ఒక గిన్నెలోకి తీసుకొని, అదే బాండీలో ఆకులను వేయించాలి. చల్లారిన తర్వాత అన్నింటినీ మిక్సీ పట్టి, తాలింపు పెట్టుకోవాలి.

  • కూర..

కావలసిన పదార్థాలు : చెన్నంగి ఆకు- కప్పు, టమోటాలు- 3, ఉల్లిపాయ - 1 (మీడియం సైజుది), పచ్చిమిర్చి- 2, నూనె- 2 స్పూన్లు, కరివేపాకు- 2 రెబ్బలు, ఉప్పు- తగినంత, కారం- 2 స్పూన్లు, పసుపు- 1/4 చెంచా, నీరు- చిన్న గ్లాసు
తయారీ : బాండీలో నూనె వేడిచేసి పోపుపెట్టి ఉల్లి తరుగు, నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు వేసి రెండు నిమిషాలు వేపాలి. ఇప్పుడు టమోటా ముక్కలు, ఉప్పు, కారం వేసి, ఉడికించాలి. ఇలా రెండు నిమిషాలు ఉడికిన తర్వాత చెన్నంగి ఆకువేయాలి. ఈ ఆకును కొద్దిసేపు వేపి, తర్వాత నీళ్ళుపోసి బాగా ఉడికించాలి. దగ్గరగా అయిన తర్వాత దింపి, సర్వ్‌ చేసుకోవాలి.