Oct 05,2023 06:43

దేశాభివృద్ధి అంటే గ్రామాభివృద్ధి అని చాటిచెప్పిన మహాత్ముని సందేశంలో సమగ్రాభివృద్ధి అనే దూరదృష్టి స్పష్టమవుతుంది. అన్ని ప్రాంతాలు, అన్ని జాతులు సమగ్రంగా అభివృద్ధి చెందడమే దేశాభివృద్ధి. గాంధీ జయంతి అక్టోబర్‌ 2 నుండి ప్రపంచ విప్లవ దినోత్సవం నవంబర్‌ 7 వరకు సిపిఎం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తతంగా 'ప్రజా రక్షణ భేరి' జరుగుతున్నది. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లక్ష కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజి అమలు చేయాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై అనంతపురంలో జరిగిన రాష్ట్ర సదస్సు తీర్మానించింది. ఆంధ్రరాష్ట్ర విభజన జరిగి సుమారు పది సంవత్సరాలు పూర్తవుతున్నది. ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన హామీల గడువు పది సంవత్సరాలే. కొద్ది నెలల్లో ఈ హామీల అమలు గడువు ముగుస్తుంది. కాని హామీల అమలు మాత్రం కంటికి కనిపించనంత దూరంగా నిలిచింది. రాయలసీమ లోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఉత్తరాంధ్ర లోని ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు మరియు ప్రకాశం జిల్లాలు అభివృద్ధి చెందకుండా రాష్ట్రం ఎలా అభివృద్ధి చెందుతుంది? ఈ అభివృద్ధికి కేంద్రం చట్ట ప్రకారం ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా ఈ ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయి? రాష్ట్ర ప్రజల హక్కుగా ఉన్న విభజన చట్టం హామీల గురించి అడగాల్సిన, పోరాడాల్సిన రాష్ట్ర ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షాలు...ఆ బిజెపి భజనలో తరించి రాజకీయ మోక్షం పొందాలని చూడడమంటే... రాష్ట్రానికి ద్రోహం చేయడమే.
వ్యవసాయం, పారిశ్రామిక రంగాల్లో తరతరాలుగా అట్టడుగున ఉన్న ఈ ప్రాంతాల వెనుకబాటు గురించి, దాని పరిష్కారం గురించి ప్రజలను మభ్య పెట్టడానికి వివిధ ప్రభుత్వాలు అనేక కమిషన్లు వేశాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన నేపథ్యంలో నియమించిన శ్రీకృష్ణ కమిషన్‌ ఈ ప్రాంతాల వెనుకబాటు గురించి మరింత సమగ్రంగా వివరించింది. ఈ జిల్లాలు ఆర్థికంగా వెనుకబడ్డాయేకాని ఇక్కడున్న సహజ వనరులు, నిక్షేపాలు, నీటి వనరులను సక్రమంగా ఉపయోగించగలిగితే వేగంగా అభివృద్ధి అవుతాయని ఈ కమిషన్లు నివేదించాయి. నేతలు మారుతున్నారేగానీ ఈ ప్రాంత ప్రజల బతుకులు మారడంలేదు.

  • రాష్ట్ర విభజన హామీలు- అమలు

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నాటికి వున్న 13 జిల్లాల్లో అత్యంత వెనుకబడిన జిల్లాల్లో విజయనగరం 13వ స్థానం, శ్రీకాకుళం 12వ స్థానం, అనంతపురం 11వ స్థానం, కర్నూలు 10వ స్థానం, చిత్తూరు 9వ స్థానం, ప్రకాశం 8వ స్థానం, కడప జిల్లా 7వ స్థానంలో వున్నాయి. అనంతపురం జిల్లా మొత్తం సాగుభూమిలో వర్షంపై ఆధారపడిన భూమి 85.39 శాతం వుండగా, కర్నూలు జిల్లాలో 72.31 శాతం ఉంది. ప్రకాశం జిల్లాలో 14 లక్షల ఎకరాల సాగుభూమిలో సుమారు తొమ్మిదిన్నర లక్షల ఎకరాలు వర్షాధారం మీదనే సాగవుతుంది. రాష్ట్ర విభజన వల్ల ఏర్పడే ఆంధ్రప్రదేశ్‌లో అత్యధిక జిల్లాలు వెనుకబడిన జిల్లాలు కావున వీటి అభివృద్ధి గురించి నాటి విభజన నేపథ్యంలో చర్చ జరిగింది. ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టకుండా రాష్ట్ర విభజన జరిగితే మరోసారి విభజన ఉద్యమాలు ఏర్పడే ప్రమాదం ఉందని నిపుణులు చెప్పారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్‌ పునర్‌వ్యవస్థీకరణ చట్టం లేక విభజన చట్టం-2014 రాష్ట్రంలోని ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజి ప్రకటించింది. విభజన చట్టంలోని సెక్షన్‌ 46 (2) ప్రకారం 'రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు తగిన ప్రయోజనాలు మరియు ప్రోత్సహకాలను అభివృద్ధి ప్యాకేజీ రూపంలో ఇవ్వాలి' అని పేర్కొంది. నాటి ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ ఈ ప్రాంతాల అభివృద్ధికి బుందేల్‌ఖండ్‌ తరహాలో, బొలంగీర్‌- కలహండి- కోరాపుట్‌ (బికెకె) తరహాలో సహాయం అందిస్తామని ప్రకటించారు. నాటి ప్రధాన ప్రతిపక్షపార్టీ బిజెపి ఈ ప్రతిపాదనలను ఆమోదించింది. బుందేల్‌ఖండ్‌ కు రూ.9 వేల కోట్లు, బికెకె ప్యాకేజికి 15 వేల కోట్లు కేటాయించారు. అయితే రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలకు మాత్రం ఆ తరహా ప్యాకేజీలు అమలు చేయలేదు.
బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత విభజన చట్టంలో పేర్కొన్న ఈ ఉమ్మడి 7 జిల్లాలకు జిల్లాకు సంవత్సరానికి రూ.50 కోట్ల చొప్పున మూడు సంవత్సరాలకు రూ.1050 కోట్లు మాత్రమే ఇచ్చి నిలిపివేసింది. ప్రత్యేకంగా విభజన చట్టంలో భాగంగా అనంతపురం జిల్లాలో కేంద్రీయ విశ్వవిద్యాలయం, బెల్‌, నాసెన్‌ పరిశ్రమలు, టైక్స్‌టైల్‌ పార్క్‌, కడపలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో రూ.400 కోట్లతో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ (ఐఐఐటి), రైల్వే కోచ్‌ నిర్మాణ పరిశ్రమ, తిరుపతిలో కండలేరు ప్రాజెక్టు, చిత్తూరులో చెన్నై-విశాఖ పారిశ్రామిక కారిడార్‌ వంటి అనేక హామీలలో గత తొమ్మిది సంవత్సరాల్లో ఒక్కటి కూడా పూర్తిగా అమలు కాలేదు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార వంటి ప్రాజక్టుల నిర్మాణం, నిర్వాసితులకు పునరావాసం, విజయనగరంలో నిర్మిస్తామన్న గిరిజన కేంద్రీయ యూనివర్శిటీ, విశాఖపట్నంలో పెట్రోలియం యూనివర్శిటీలు ఇప్పటి వరకు పూర్తికాలేదు. ఇచ్చిన హామీలు అమలు చేయని కేంద్ర బిజెపి ప్రభుత్వం విశాఖపట్నంలో ఆంధ్రుల ఆత్మాభిమానానికి, వేల కుటుంబాలకు జీవనానికి ఆధారంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నది. అదానీ లాంటి కార్పొరేట్‌ కంపెనీలు ఆంధ్ర రాష్ట్రంపై డేగల్లా వాలుతున్నాయి.

  • అన్నీ వున్నా అభివృద్ధికి దూరంగా...

రాష్ట్ర జనాభాలో రాయలసీమ జనాభా 30 శాతం. రాష్ట్ర సాగు భూమి విస్తీర్ణంలో 36.8 శాతం. అయితే ఈ ప్రాంతంలోని సాగు భూమిలో కేవలం 7.6 భూమికి మాత్రమే సాగునీటి వసతి వుంది. కోటికి పైగా జనాభా ఉన్న ఉత్తరాంధ్ర పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఈ ఏడు ఉమ్మడి జిల్లాల్లో విశాఖపట్నం మినహా కనీసం పది వేల మందికి ఉపాధి చూపే పరిశ్రమ ఒక్కటి కూడా లేదు. రాయలసీమలో అనేక దశాబ్దాల క్రితం నిర్మించిన తుంగభద్ర హెచ్‌ఎల్‌సి, ఎల్‌ఎల్‌సి కాల్వలు వ్యవసాయ అవసరాలను ఏమాత్రం తీర్చేవిగాలేవు. ఈ సాగునీటి కాల్వలు క్రమంగా తాగునీటి కాల్వలుగా మారిపోతున్నాయి. హంద్రీ-నీవా పథకం ద్వారా పంట పొలాలకు నీరు ఇవ్వాల్సిందిపోయి, చెరువులకు నీరు నింపే పథకంగా మారింది. ఈ జిల్లాల్లో 24 లక్షల ఎకరాల సాగుభూమి వుండగా సాగునీటి వసతి మాత్రం తొమ్మిది లక్షల ఎకరాలకు మాత్రమే ఉంది. విశాఖ నగరం మినహా మిగిలిన ఉత్తరాంధ్ర ప్రాంతమంతా తీవ్రంగా వెనుకబడి ఉంది. ప్రకాశం జిల్లా కూడా వ్యవసాయ, పారిశ్రామిక, సేవా రంగాల్లో వెనుకబడి వుంది. రాష్ట్ర తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉన్న జిల్లాలో ప్రకాశం జిల్లా ఒకటి. రాయలసీమ జిల్లాల్లో 64 రకాల ఖనిజ సంపద ఉన్నట్టుగా శాస్త్రీయ సర్వేలు చెబుతున్నాయి. ఇనుము, బైరైట్స్‌, స్టైలైట్‌, ఆస్బెస్టాస్‌, రాగి, వజ్రాలు, కాల్‌సైట్‌, బంగారం, డోలమైట్‌, క్లే...వంటి ఖనిజ సంపదకు కొదవలేదు. కడప, చిత్తూరు జిల్లాల్లో లభించే పులారిన్‌ ప్రపంచంలోనే అత్యంత అరుదైన ఖనిజం. దీని ధర బంగారం కన్నా 150 రెట్లు అధికం అంటారు. నల్లమల అడవుల్లో దొరుకుతున్న అత్యంత విలువైన ఎరచ్రందనం, శ్రీగంధం, శేషాచలం కొండల్లోను, కదిరి, కుప్పం గుట్టలలోనూ, ప్రకాశం జిల్లాల్లోని శింగరాయకొండ, కొణిజేడు, వై.పాలెం, ఒంగోలు, అద్దంకి, కనిగిరి కొండల్లో అపారమైన ఖనిజ సంపద ఉంది. అత్యంత విలువైన ఔషధ మొక్కలు ఈ ప్రాంతంలో ఉన్నాయి. ఉత్తరాంధ్రలో విలువైన గనులు ఉన్నాయి. అభివృద్ధికి అనేక అవకాశాలు ఉన్నప్పటికీ పాలకుల చిత్తశుద్ధిలోపం వల్ల వెనుకబడిన ప్రాంతాలు అభివృద్ధికి దూరంగా ఉన్నాయి. గత పది సంవత్సరాల్లో ఈ ప్రాంతాల అభివృద్ధికి సాగునీటి వనరులు కల్పించడంలో, పరిశ్రమలు స్థాపించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా ఉన్నాయి.

  • సామాజిక న్యాయానికి విఘాతం

ఈ ప్రాంతాల్లో వెనుకబడిన తరగతులు, దళిత, గిరిజన కుటుంబాలు ఎక్కువ. వీరిని పేదరికం నుండి విముక్తి చేయడానికి భూపంపిణీ చేయాలి. కాని కొన్ని స్కీమ్‌లు ఇచ్చి ఉద్ధరిస్తున్నట్లు పాలకులు ప్రచారం చేసుకుంటున్నారు. బీడు భూమలు అన్యాక్రాంతం అవుతుండడంతో పాటు, అసైన్డ్‌ చట్టాల్లో మార్పుచేసి పెత్తందార్లకు భూములు అప్పగిస్తున్నారు. జీవాలకు వస్తున్న వివిధ వ్యాధులవల్ల గొర్రెల, మేకల పెంపకందార్లు, ముడి సరుకుల ధరలు, విదేశీ దిగుమతుల పోటీతో చేనేత కార్మికులు, సామాజిక వివక్షతో పాటు వృత్తి రక్షణ లేక రజక వృత్తిదారులు కష్టాలకు గురవుతున్నారు. కుమ్మరి, కమ్మరి, వడ్డెర లాంటి అనేక వృత్తిదారులు పట్టణాలకు వలసలు వెళ్ళి నివాసాలతోపాటు అనేక సమస్యలను ఎదుర్కొం టున్నారు. పట్టణాల్లో మైనారిటీ కుటుంబాల స్వయం ఉపాధికి పెద్ద కంపెనీల పోటీలు, ప్రభుత్వాల నిర్లక్ష్యంతో తీవ్ర ఆర్థిక వెనుకబాటుకు గురవుతున్నారు. కౌలు రైతులకు చట్టబద్ధ రక్షణ లేకపోవడంతో ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. విద్య, వైద్యం, సామాజిక సేవలు ప్రైవేటు పరం కావడంతో పేద, దిగువ మధ్య తరగతి ప్రజలపై అదనపు భారాలు పెరిగాయి.
రాష్ట్ర విభజన చట్టంలో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేయాలి. కడప జిల్లాలో ప్రభుత్వ రంగంలో ఉక్కు పరిశ్రమ నిర్మించాలి. రాయలసీమ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం రూ.50 వేల కోట్లు, ఉత్తరాంధ్ర జిల్లాలకు రూ.25 వేల కోట్లు, ప్రకాశం జిల్లాకు రూ.10 వేల కోట్లు, నెల్లూరు, ఇతర జిల్లాల్లోని వెనుకబడిన మండలాల అభివృద్ధికి మరో రూ.15 వేల కోట్లు మొత్తం లక్ష కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజిని బడ్జెట్‌లోనే కేటాయించి, 3 సంవత్సరాలలో ఖర్చు చెయ్యాలి. పరిశ్రమల పేరుతో ప్రభుత్వం సేకరించిన భూముల్లో పరిశ్రమలు స్థాపించాలి. లేదా ఆ భూములను తిరిగి రైతులకు అప్పగించాలి. లేపాక్షి నాలెడ్జ్‌ భూముల్లో ఐ.టి పరిశ్రమను స్థాపించాలి. రాయలసీమ, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాల్లోని ప్రతిపాదిత ప్రాజెక్టులన్నీ 3 సంవత్సరాలలో పూర్తి చేసి ఈ ప్రాంతాల్లోని సాగు భూమికి సంవత్సరానికి ఒక పంటకైనా సాగునీరు అందించాలి. ప్రభుత్వ రంగంలోనే విద్యా, వైద్యం అందించాలి. సాంఘిక సంక్షేమ హాస్టళ్లను మెరుగుపరచాలి. వృత్తిదారులకు రక్షణ కల్పించాలి. ఎస్‌.సి, ఎస్‌.టి సబ్‌ప్లాన్‌ను పటిష్టంగా అమలు చేయాలి. హంద్రీ-నీవాకు 80 టిఎంసిల నీరు కేటాయించాలి. పిల్లకాల్వలు తవ్వి ఆయకట్టుకు సాగునీరు అందించాలి. రాయలసీమలో మైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ను ఏర్పాటు చేయాలి. మైనింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో 50 శాతం రాయలసీమ అభివృద్ధికి ఖర్చు చేయాలి. గత ప్రభుత్వం శాసనసభలో రాయలసీమకు, ఉత్తరాంధ్ర, ప్రకాశం జిల్లాలకు ప్రకటించిన అభివృద్ధి పథకాలను పూర్తి చేయడంతో పాటు, కొత్త పరిష్కార చర్యలను చేపట్టాలి. అందుకోసం సిపిఎం రాష్ట్ర వ్యాప్త ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలను కేంద్ర ప్రభుత్వం తన ఇష్టానుసారంగా ఆడిస్తున్నది. ఎన్నికల లబ్ధి కోసం కేసులు, జైళ్లు, బెయిళ్ల రాజకీయం నడుస్తున్నది. ఈ పరిస్థితుల్లో సిపిఎం ప్రజా రక్షణ భేరి నిర్వహిస్తున్నది.

 rambhupal

 

 

 

వ్యాసకర్త - వి రాంభూపాల్, సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు