దిగులు ఆకాశాన్నై దిక్కులన్నీ గాలిస్తున్నాను
ఇంకా దరికిచేరని లేగదూడను పలవరిస్తూ
సేపుతున్న పాలపొదుగు సలపరంతో
గుంజకు చుట్టుకుపోతున్న గోమాతలా నులుసుకుపోతున్నాను
అర్ధరాత్రి అవుతున్నా నిద్రపట్టని నలత ముఖంతో
లోకానికి కలత పాఠాన్ని బోధిస్తున్నాను..
హృదయాలు తరలిపోయిన తరగతిగదిలో
అక్షరాలన్నీ ఆవిరైపోయిన ఖాళీ నల్లబల్లలా
నిస్తేజంగా నిలబడిపోయాను
వెలుతురు సుద్ద అంటని చేతివేళ్ళతో
చీకటి తెరలను చీల్చలేక చతికిలబడుతున్నాను
క్రిమి కాటుకు భయపడి..
కాల పట్టికలో ఎంతకీ కదలని పీరియడ్స్‌లా
ధూళి పట్టిపోతున్నాను
ఇనుపదేహంపై ప్రేమగా వాలి
ఏ పిల్ల పిచ్చుకైనా పలకరించకపోతుందా అని
బడిగంటలా బయటే వ్రేళ్లాడుతున్నాను
ఆటల వర్షం ఆగిపోయి
అల్లరి హక్కులు కోల్పోయిన ఆవరణలో
లేతపాదాల సడి తగలక కొర్రుబారిన
ఆటస్థలంలా బోసిపోతున్నాను
కాలం ఆడుతున్న ఆటలో
మనసు బంతి మెతకబారాక
పేర్పుకందని ఏడు పెంకుల్లా ముక్కలైపోతున్నాను
చనువు భుజంపై తలవాల్చిన రాతపుస్తకాల
పేజీల జుట్టు నిమురుతూ తప్పొప్పులు సరిచేసే ఎర్రసిరా
ఇంకిపోతున్నట్టు ఒకటే పెంకిటిల్లిపోతున్నాను
నీతిపద్యానికి చేతి తాళం పడని మేజాబల్లలా
మూగగా ముడుచుకుపోతున్నాను
ఎన్ని ధైర్యపు గింజల్ని అట్టిపెట్టుకున్నా
కాలంపుస్తకంలో నెమలీకలా
కొత్త కలల్ని పొదగలేకపోతున్నాను
సెలవుల శరపరంపరకు
సుదీర్ఘ విరామం చేదెక్కుతుంటే
ఆదివారం రుచి కోసం ఆరాటపడుతున్నాను
సైన్యం చెదిరిన తర్వాత స్థైర్యం కోల్పోయిన రాజులా
పాఠశాల రాజ్యంలో పరాయిగా పాలిపోతున్నాను
పత్తిపువ్వుల్లాంటి పసిహృదయాలు ముద్దాడక
అట్ట చిరిగిన కొత్తపుస్తకంలా కళ కోల్పోతున్నాను
- చొక్కాపు లక్ష్మునాయుడు
95732 50528