Dec 28,2020 21:34

న్యూఢిల్లీ : నూతన వ్యవసాయ చట్టాలకు సంబంధించిన చర్చల విషయంలో కేంద్రం రెండు నాల్కల ధోరణితో వ్యవహిస్తోందని రైతు సంఘాలు మండిపడ్డాయి. తాము ప్రతిపాదించిన అజెండాను పక్కన పెడుతోందని...సమస్య పరిష్కారానికి కేంద్రం సుముఖంగా లేదని దీన్ని బట్టే అర్థమౌతుందని అఖిల భారత రైతు పోరాట సమన్వయ సమితి పేర్కొంది. వ్యవసాయ చట్టాల రద్దు కోరుతూ దేశ రాజధాని సరిహద్దుల్లో నెల రోజులుగా ఉద్యమ పోరును సాగిస్తున్న రైతులను మరో దఫా చర్చలకు కేంద్రం ఆహ్వానించింది. ఈ నెల 30న చర్చలు జరిపేందుకు రావాలని రైతు సంఘాలను కోరింది. ఈ మేరకు 40 సంఘాలకు కేంద్ర వ్యవసాయ శాఖ తాజాగా లేఖ రాసింది. అయితే గతంలో రైతు సంఘాలు కొన్ని ప్రతిపాదనలను కేంద్రం ముందుంచాయి. వాటిని ఎజెండాలో చేరిస్తే ఈ నెల 29న చర్చలకు వస్తామని కేంద్రానికి సంయుక్త కిసాన్‌ మోర్చా లేఖ రాసిన సంగతి విదితమే. తాజా పిలుపుపై అఖిల భారత రైతు సోరాట సమన్వయ సమితి స్పందిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. తమ అజెండాను చర్చించేందుకు సిద్ధంగా లేని మోడీ సర్కార్‌..మరో వైపు చర్చలకు సిద్ధమంటూ ఆహ్వానాలు పంపుతూ..రెండు నాల్కల ధోరణిని ప్రదర్శిస్తోందని మండిపడింది. చట్టాలు రద్దు చేసే వరకు ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని రైతు సంఘం స్పష్టం చేసింది. హర్యానాలో టోల్‌ రుసుము నిరాకరణ, కార్పొరేట్‌ ఉత్పత్తుల బారుకాట్‌ కొనసాగుతాయని చెప్పింది. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా రైతులకు మద్దతుగా ప్రమాణం చేయాలని పిలుపునిచ్చింది.