Sep 10,2023 15:23

బ్రెజిల్‌: 2024లో రియో జీ20 సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ హాజరైతే ఎవరూ అరెస్టు చేయబోరని బ్రెజిల్‌ అధ్యక్షుడు లూల డ సల్వా శనివారం రాత్రి ప్రకటించారు. జీ20 సైడ్‌లైన్స్‌ సందర్భంగా ఆయన ఓ ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ విషయాన్ని వెల్లడించారు. వచ్చే ఏడాది జీ20కి తాను ఆయన్ను ఆహ్వానిస్తున్నానని చెప్పారు. అంతేకాదు.. రష్యాలో జరిగే బ్రిక్స్‌ సమావేశానికి తాను హాజరయ్యేందకు ప్లాన్‌ చేసుకొంటానని తెలిపారు.''పుతిన్‌ బ్రెజిల్‌కు చాలా తేలిగ్గా రాగలరు. అప్పటికి నేనే అధ్యక్షుడిగా ఉంటే మాత్రం ఆయన్ను అరెస్టు చేసే అవకాశమేలేదని చెప్పగలను'' అని వివరించారు. అంతర్జాతీయ క్రిమినల్‌ కోర్టు ఏర్పాటు కోసం జరిగిన రోమ్‌ ఒప్పందంలో బ్రెజిల్‌ కూడా సంతకం చేసింది. అయినా.. ఢిల్లీ జీ20 వేదికగానే పుతిన్‌కు బ్రెజిల్‌ అధ్యక్షుడు ఆహ్వానం పలకడం విశేషం. తాజాగా జరుగుతున్న న్యూఢిల్లీ జీ20లో కూడా పుతిన్‌ పాల్గొనకుండా.. ఆయన ప్రతినిధిగా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోవ్‌ను పంపించారు.