Jan 08,2021 21:51

లాపాజ్‌ : బ్రెజిల్‌లో మరో కేపిటల్‌ తరహా దాడి జరగాలని బ్రెజిల్‌ అధ్యక్షుడు బోల్సనారో వ్యాఖ్యానించారు. కాగా, ఇలాంటి ఘటనలు, వ్యాఖ్యలు ప్రజాస్వామ్యాన్ని స్తంభింపచేస్తాయని ప్రతిపక్షం హెచ్చరించింది. ప్రాసిక్యూటర్‌ కార్యాలయం, సుప్రీం ఎలక్టోరల్‌ కోర్టు ముందు బోల్సనారో చేసిన వ్యాఖ్యలను ప్రధాన ప్రతిపక్షం వర్కర్స్‌ పార్టీ (పిటి) తీవ్రంగా నిరసించింది. ఎన్నికల వ్యవస్థకు వ్యతిరేకంగా బోల్సనారో నేరానికి పాల్పడుతున్నారని, ఆయన వ్యాఖ్యలు బ్రెజిల్‌ ప్రజాస్వామ్యానికి ముప్పుగా పరిణమించాయని పేర్కొంది. కరోనా కారణంగా అమెరికాలో ప్రజలు మెయిల్‌ ద్వారా ఓటు వేశారని, దానివల్ల చాలామంది మూడు నాలుగు సార్లు ఓటు వేశారని, చివరకు చనిపోయిన వారు కూడా ఓటు వేశారని బోల్సనారో వ్యాఖ్యానించారు. బోల్సనారో మద్దతిచ్చిన మితవాద అభ్యర్ధులు గతేడాది నవంబరులో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఓడిపోయారు. దాంతో ఆటోమేటిక్‌ ఓటింగ్‌ వ్యవస్థ పట్ల బోల్సనారో సందేహాలు వ్యక్తం చేశారు.