Aug 03,2023 16:33

ఒట్టావా  :    18 ఏళ్ల వైవాహిక బంధానికి కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో స్వస్తి పలికారు. తన భార్య సోఫీ గ్రెగోయిర్‌ ట్రూడోతో విడిపోతున్నట్లు బుధవారం తన ఇన్‌స్టాగ్రామ్‌ పోస్ట్‌లో ట్రూడో ప్రకటించారు. గత కొన్ని సంవత్సరాలుగా జంటగా వీరు బయట తక్కువగా కనిపిస్తున్నారు. సుదీర్ఘ చర్చలు తరువాత వీరు విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఇద్దరూ చట్టపరమైన విభజన ఒప్పందంపై సంతకం చేసినట్లు ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. తన పిల్లలకు ఒక కుటుంబంలా ఉంటానని జస్టిన్‌ ట్రూడో పేర్కొన్నట్లు ఆ ప్రకటన తెలిపింది. పిల్లలను సురక్షితమైన, ప్రేమ పూర్వక వాతావరణంలో పెంచడంపై ఇద్దరూ   దృష్టి పెట్టనున్నట్లు ప్రకటించారు.

జస్టిన్‌ ట్రూడో, సోఫీలు 2005 మే లో మాంట్రియల్‌లో వివాహం చేసుకున్నారు. సోఫీ గ్రెగోయిర్‌ ట్రూడో యూనివర్శిటీలో కామర్స్‌ చదివారు. క్యూబెక్‌లో టెలివిజన్‌ రిపోర్టర్‌గా కూడా పనిచేశారు. ఆమె జస్టిన్‌ ట్రూడోతో కలిసి మూడు ఎన్నికలకు ప్రచారం కూడా చేశారు. ఆమె మహిళల హక్కులు, మానసిక ఆరోగ్య సమస్యలపై ప్రస్తావించడం ద్వారా చాలాసార్లు వార్తల్లో నిలిచారు. వీరికి ముగ్గురు పిల్లలు. 15ఏళ్ల జేవియర్‌, 14ఏళ్ల ఎల్లాగ్రేస్‌, తొమ్మిదేళ్ల హాడ్రియన్‌. 2015లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టినప్పటికీ.. కుటుంబ జీవితానికి ప్రాముఖ్యతనివ్వాలంటూ అనేక సందర్భాల్లో ప్రస్తావించేవారు.

కెనడా పాలక లిబరల్‌ పార్టీ వెనుకంజలో ఉండటంతో   ట్రూడో  గతవారం భారీ కేబినెట్‌ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. వారంరోజుల అనంతరం అనూహ్యంగా ఈ ప్రకటన వెలువడటం గమనార్హం. 2025లో జరిగే ఎన్నికల్లో లిబరల్స్‌ పార్టీకి నాయకత్వం వహించాలని నిర్ణయించుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.

ప్రధాని పదవిలో ఉండగా భార్య నుండి విడిపోయిన రెండో ప్రధానిగా జస్టిన్‌ ట్రూడో నిలిచారు. ఆయన తండ్రి పియరీ ట్రూడో 1979లో భార్య మార్గరెట్‌ నుండి విడిపోయారు. ఇద్దరూ 1984లో వీరిద్దరూ విడాకులు తీసుకున్నారు.