Nov 15,2023 12:29

ఒట్టావా   :    ఇజ్రాయిల్‌ అమానవీయ దాడుల్లో గాజాలో చిన్నారులు, మహిళలు మరణించడంపై కెనడా ప్రధాని స్పందించారు. స్థానిక మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో  ట్రూడో  మాట్లాడారు. గాజాపై ఇజ్రాయెల్‌  జరుపుతున్న దాడులను సోషల్‌మీడియా ద్వారా ప్రపంచమంతా చూస్తోందని   అన్నారు. ఇజ్రాయెల్‌ ప్రభుత్వం సంయమనం పాటించాలని కోరారు. దాడుల నుండి బయటపడిన వైద్యులు, కుటుంబసభ్యులు, తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల సాక్ష్యాలను విన్నామని అన్నారు. మహిళలు, చిన్నారుల హత్యలను కూడా చూస్తున్నామని, దయచేసి   ఈ చర్యలను ఆపాలని ట్రూడో కోరారు.  హమాస్‌పై కూడా  ట్రూడో కీలక వ్యాఖ్యలు చేశారు.  యుద్ధంలో అమాయక పాలస్తీనా ప్రజలను అడ్డు పెట్టుకుని ఉగ్రవాదులు రక్షణ పొందడం సరికాదని,    బందీలుగా ఉన్న ఇజ్రాయెల్‌ పౌరులను విడిచిపెట్టాలని సూచించారు. 

ట్రూడో వ్యాఖ్యలపై ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు ఎక్స్‌ (ట్విటర్‌)లో ఘాటుగా స్పందించారు. తమ పౌరులపై హమాస్‌ జరిపిన దాడిని ప్రస్తావిస్తూ..  పౌరులను లక్ష్యంగా చేసుకుని ఇజ్రాయెల్‌ దాడులు జరపడం లేదని, హమాస్‌ ఉద్దేశపూర్వకంగా పౌరులకు హాని కలిగించేందుకు ప్రయత్నిస్తోందని అన్నారు.  ప్రస్తుత చర్యలకు బాధ్యత వహించాల్సింది ఇజ్రాయెల్‌ కాదని, హమాస్‌ అని అన్నారు. సామాన్య పౌరులను ఉగ్రవాదులు ఊచకోత కోశారని, గాజా ప్రజల కోసం ఇజ్రాయెల్‌ మానవతా కారిడార్లను అందిస్తుంటే .. హమాస్‌ వాటిని అడ్డుపెట్టుకుని నేరాలకు పాల్పడుతోందని ఆరోపించారు.  హమాస్‌ను ఓడించేందుకు అన్ని దేశాలు ఇజ్రాయెల్‌కు మద్దతు పలకాలని కోరారు.