Sep 26,2023 11:16

ఒట్టావా :   భారత్‌లోని తమ పౌరులకు కెనడా ప్రభుత్వం సోమవారం రాత్రి ట్రావెల్‌ అడ్వైజరీ జారీచేసింది. భారత్‌లోని తమ పౌరులు జాగ్రత్తగా ఉండాలని, చుట్టూ జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తూ ఉండాలని హెచ్చరించింది. భారత్‌లో పర్యటిస్తున్న సమయంలో అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. కెనడాలోని భారతీయులకు, విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే హెచ్చరికలు జారీచేసింది.

హర్దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్యలో భారతీయ ఏజెంట్ల ప్రమేయం ఉన్నట్లు కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడో ఆరోపణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో కెనడాలోని ఓ భారతీయ అధికారిని అక్కడి ప్రభుత్వం బహిష్కరించడంతో .. కెనడా రాయబారిని కూడా భారత ప్రభుత్వం దేశం విడిచివెళ్లాలని ఆదేశించింది. అలాగే కెనడా పౌరులకు వీసాల జారీని కూడా భారత్‌ నిలిపివేసిన సంగతి తెలిసిందే.