చింతాకు, చింత చిగురు .. ఎలా పిలిచినా.. దాని లేలేత తాజా పులుపులో ఢోకా ఉండదు. చింతచిగురును పప్పుతో కలపి వండితే రుచి అద్భుతంగా ఉంటుంది. చింత పువ్వులతో పప్పు, చట్నీ చేసుకుంటారు. ఇక చింత చిగురుతో రొయ్యలు, చికెన్ కలిపి వండితే ఎంతో రుచిగా ఉంటుంది. చింతచిగురు పొడి వేడి వేడి ఇడ్లీల్లో నంజుకుని తింటే ఆ మజానే వేరు.. చింత చిగురు పులుపుతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. ఇంకెందుకు ఆలస్యం.. ప్రస్తుతం చింతచిగురు సీజనే కాబట్టి.. ఎలాంటి వెరైటీలు చేసుకోవాలో తెలుసుకుందాం..
పొడి
కావాల్సిన పదార్థాలు : చింతచిగురు-200 గ్రాములు, ఎండుమిర్చి-15, ధనియాలు-అరకప్పు, మినపప్పు-నాలుగు స్పూన్లు, ఉప్పు-రుచికి తగినంత, నూనె-ఐదు స్పూన్లు, ఆవాలు-టీస్పూన్, జీలకర్ర-2 టీస్పూన్లు, వెల్లుల్లి-ఆరు రెబ్బలు.
తయారీ విధానం : ముందుగా చింతచిగురుని శుభ్రం చేసుకుని, చేత్తో బాగా నలిపి, చిన్న పుల్లలు, ఈనెలు తీసేయ్యాలి.
ఙ తర్వాత అరగంట సేపు నీడన ఆరనివ్వాలి.
ఙ తర్వాత స్టౌపై బాండీ పెట్టి నూనె వేసి వేడెక్కిన తర్వాత ఎండుమిర్చి, ధనియాలు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర వేసి వేయించుకోవాలి.
* నలిపి ఉంచిన చింతచిగురు వేసి, వేయించాలి.
* చల్లారగానే ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసి, తగినంత ఉప్పు వేసి మెత్తగా మిక్సీ వేసుకోవాలి.
* కారప్పొడి ఇష్టమైనవారు పొట్టు తీయని కొన్ని వెల్లుల్లి రేకలు వేసి మిక్సీ వేసుకోవాలి.
బిర్యానీ
కావాల్సిన పదార్థాలు: బాస్మతి బియ్యం- ఒకటిన్నర కప్పు, చింతచిగురు- అరకప్పు, ఉల్లి తరుగు- అరకప్పు, అల్లం- చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు- ఆరు, మసాలా దినుసులు- సరిపడినన్ని, పచ్చిమిర్చి- ఐదు, పచ్చికొబ్బరి ముక్కలు-పావు కప్పు, సోంపు- టీస్పూను, ఉప్పు-రుచికి సరిపడా, నూనె- టీస్పూను.
తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని కడిగి, నీరు వార్చాక, మూడు గంటలు నానబెట్టాలి.
* చింత చిగురుని శుభ్రంగా కడిగి ఆరబెట్టాలి. తడిదనం తగ్గాక స్టవ్‌పై కళాయిలో కాస్త నూనె పోసి వేయించాలి.
* తర్వాత కొద్దిగా నీళ్లు పోసి, ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
* పచ్చి మిరపకాయలు, అల్లం, వెల్లుల్లి, పచ్చికొబ్బరి ముక్కలు, సోంపు కలిపి మిక్సీలో మెత్తని పేస్టులా చేయాలి.
* స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేసి వేడెక్కాక మసాలా దినుసులు, ఉల్లితరుగు వేయించాలి.
* ఇందులో చింతచిగురు వేసి వేయించాలి.
* రెండు నిమిషాల పాటు వేగాక, నానబెట్టిన బియ్యాన్ని వేసి కలపాలి.
* రండు కప్పుల నీరు పోసి, తగినంత ఉప్పువేసి కలపాలి.
* మూత పెట్టి అన్నం ఉడికే వరకూ ఉంచాలి.
* దించేముందు ఒకసారి గరిటెతో కలపాలి.
* అంతే చింతచిగురు బిర్యానీ రెడీ. దీనిలో చికెన్ కర్రీ వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది.
చికెన్‌తో..
కావాల్సిన పదార్థాలు : బోన్‌లెస్ చికెన్-అరకేజీ, చింతచిగురు- ఒకటిన్నర కప్పు, కొబ్బరి తురుము- రెండు చెంచాలు, అల్లంవెల్లుల్లి ముద్ద- చెంచా, ఉల్లిపాయలు- రెండు, పచ్చిమిర్చి-మూడు, పసుపు-పావుచెంచా, కారం-రెండు చెంచాలు, ధనియాలపొడి-చెంచా, గరంమసాలా- అరచెంచా, ఉప్పు-తగినంత, నూనె-అరకప్పు, దాల్చినచెక్క-రెండు ముక్కలు, యాలకులు-రెండు, లవంగాలు-మూడు.
తయారీ విధానం: చింతచిగురును శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. స్టౌపై కడాయి పెట్టి, నూనె వేయాలి.
* వేడయ్యాక దాల్చినచెక్క, లవంగాలు, యాలకులు వేయించుకోవాలి.
* ఇందులోనే ఉల్లిపాయముక్కలు, పచ్చిమిర్చి తరుగు వేయాలి.
* బాగా వేగాక అల్లంవెల్లుల్లి ముద్ద, చికెన్ ముక్కలు వేసి, కలిపి మూత పెట్టేయాలి.
* ఐదు నిమిషాలయ్యాక పసుపు, కారం, తగినంత ఉప్పు, ధనియాల పొడి, కొబ్బరి తురుము, గరంమసాలా వేసి కలిపి మూత పెట్టాలి.
* చికెన్ పూర్తిగా ఉడికాక, చింతచిగురు వేసి కలపాలి.
* స్టౌని సిమ్‌లో పెట్టి, మధ్యమధ్యలో కలుపుతూ ఉంటే కాసేపటికి కూర పొడిపొడిగా అవుతుంది. అప్పుడు దింపేయాలి.
రొయ్యలతో
కావాల్సిన పదార్థాలు : రొయ్యలు-పావుకేజీ, చింతచిగురు-కప్పు, ధనియాలపొడి-టేబుల్‌స్పూను, పసుపు-పావుచెంచా, కారం-రెండు టేబుల్‌స్పూన్లు, ఉప్పు-తగినంత, ఉల్లిపాయ ముక్కలు-ముప్పావుకప్పు, వెల్లుల్లి తరుగు-టేబుల్‌స్పూను, నెయ్యి-పావుకప్పు, కరివేపాకు రెబ్బలు-రెండు, పచ్చిమిర్చి-రెండు, కొబ్బరిపొడి-చెంచా.
తయారీ విధానం: స్టౌపై పాన్ పెట్టి నెయ్యి వేయాలి. వేడెక్కాక రొయ్యలు వేసి వేయించాలి.
* వేగాక వెల్లుల్లి తరుగు, ఉల్లిపాయముక్కలు, పసుపు, ఉప్పు, కారం, ధనియాలపొడి, చింతచిగురు, కరివేపాకు, పచ్చిమిర్చి ముద్ద వేసి అన్నింటినీ బాగా కాలపాలి.
* ఇది కూరలా అయ్యాక కొబ్బరిపొడి చల్లి దింపేయాలి.