అంతా శాకాహారులే ..
బాపనీదిలో రొయ్యల గంపేదని అడక్కండి!
అందరూ సాధుపుంగవులే ..
ఏ చిత్తకార్తె కుక్కలు
ఆమెను పీక్కుతిన్నాయని ప్రశ్నించకండి
ఇక్కడ .. ప్రశ్నించటం రాజద్రోహం!
తన మర్మాంగాన్ని తనే చింపుకుందనీ ..
తన నాలుకను తనే కోసుకుందనీ..
తన వెన్నుముక తనే విరుచేసుకుందనీ..
కులానికి పుట్టిన కొడుకుల పక్షాన
నివేదికలొస్తాయి! మీరూ నమ్మాల ..!
తెల్లారితే వీర్యపు నదుల్లో
కుప్పలుతెప్పలుగా కొట్టుకొస్తున్న
స్త్రీల శవాలనెన్నని చూడలేదు!
ఇదీ .. అంతే !
ఇదీ .. చెరబడ్డ భూమి !
చచ్చిన దళిత మేక సంగతటుంచి
చంపే పెద్దపులుల హక్కులకోసం
ఇవాల దర్నాలు జేయాల
ఒళ్లు పోత్రంతో రంకెలేస్తున్న
నాగరిక మృగాలకు
చెరిచే అధికారాన్ని చట్టబద్దం జేయాల!
నరతోట మీద ఈ మాత్రం
న్యాయం ఉండొద్దూ ..!
ఇవాళామె ..
నాలుకనెవరు తెగ్గోసారని
నేరకపోయి అడక్కండి !
ఈ దేశపు నాలుకేనాడో తెగిపోయింది !
కట్టెను విరిచినట్టు
ఆమె వెన్నెముకనెవరు విరిచేసారని
అన్నీ తెలిసీ అడక్కండి!
ఈ దేశపు వెన్నెముకేనాడో
వొంగిపోయింది !
అంతా నిర్దోషులే ..
ఒక నమ్మకం గుమ్మటాలతో సహా
ఎలా కూలిపోయిందని
ఎవరైనా అడగ్గలరా ..?
అడిగితే .. బతగ్గలరా..!
ఇదీ .. అంతే !
పూడ్చేస్తే సాక్ష్యం లేచొస్తుందేమోననీ..
కాల్చేసిన కారణాల్ని మాత్రం
అస్సలడక్కండి !
కోతబడ్డ నాలుక నిజం చెప్పలేదు!
కాల్చబడ్డ శవం సాక్ష్యమూ చెప్పలేదు !
పురుషాంగాలను పూజిస్తున్న దేశంలో ..
పలుకుబడున్నోడి మాటే చెల్లుబాటు
పెత్తందారులదే జరుగుబాటు
అయినా .. ఒరే నాయనా ..
పచ్చని పంట పొలంలాంటి ఆమెను
అత్యాచారం జేసి చంపింది వాళ్లే గాదు
..
నడిరాతిరి న్యాయాన్ని తగలబెట్టి
ఆమెను మరోసారి హత్యజేసింది
రాజ్యం కూడా ..!!
సిరికి స్వామినాయుడు
94940 10330