- డ్రైవర్,కండక్టర్ తో సహా పలువురికి గాయాలు.
ప్రజాశక్తి-రాజవొమ్మంగి : మండలలోని దూశరపాము గ్రామ శివారున శుక్రవారం ఉదయం ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయి అదుపుతప్పి ఆర్టీసీ బస్సు తాటి చెట్టును ఢీకొట్టిన సంఘటనలో ఆర్టీసీ బస్సు డ్రైవర్, కండక్టర్ తో సహా మరో కొంత మందికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి. ఏలేశ్వరం డిపోకు చెందిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు శుక్రవారం ఉదయం రాజవొమ్మంగి నుండి తాళ్లపాలెం 15మంది ప్రయాణికులతో వెళుతుండగా, దూశరపాము గ్రామ శివారున ఎదురుగా వస్తున్న బైకును తప్పించబోయిన డ్రైవర్ ఒక్కసారిగా బస్సు స్టీరింగ్ పట్టి వేయడంతో అదుపుతప్పి తాటి చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో బస్సు డ్రైవర్ బి శివప్రసాద్ కు కాళ్లు చేతులకు గాయాలు కాగా, బస్సు కండక్టర్ వైఎన్ బాబుకు మొహంపై తీవ్ర గాయమైంది. అలాగే బస్సులో ప్రయాణిస్తున్న కిండ్ర, లాగరాయి, రాజవొమ్మంగి, తదితర గ్రామాలకు చెందిన వి వెంకటరమణ, శిరీష, సాయి, కలింకోట లక్ష్మి, ఎం.అప్పారావు, అఖిల, వనిత గాయాలు కాగా విషయం తెలుసుకున్న స్థానికులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకొని 108కి సమాచారం ఇవ్వగా 108లో క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులకు రాజవొమ్మంగి పిహెచ్సి వైద్యాధికారి లిఖిత ప్రథమ చికిత్స నిర్వహించారు. మెరుగైన వైద్యం కోసం పలువురిని ఏలేశ్వరం రిఫర్ చేశారు. బస్సులో ప్రయాణికులు ఎక్కువ మంది లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది.










