May 15,2023 16:26
  • కలెక్టరేట్ కు చొచ్చుకుని వెళ్లేందుకు కార్మికుల ప్రయత్నం
  • అడ్డుకున్న పోలీసులు              
  • అర్థగంట పాటు కార్మికులకు, పోలీసులకు వాగ్వాదం
  • భవన నిర్మాణ కార్మికుల క్లెయిమ్స్ 5 కోట్ల 60  లక్షలు నిధులు తక్షణమే మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ కి వినతి.  

ప్రజాశక్తి-కాకినాడ : ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ అనుబంధ సంఘం రాష్ట్రవ్యాప్తి పిలుపులో భాగంగా కాకినాడలో ధర్నా చౌక్ సెంటర్ వద్ద సోమవారం ఆంధ్రప్రదేశ్ బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్  జిల్లా నాయకులు టీ.అన్నవరం అధ్యక్షతన భవన నిర్మాణ కార్మిక సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తూ నిరసన ధర్నా  జరిగింది. ఈ ధర్నాకు ముఖ్య అతిథులుగా ఏపీ.బిల్డింగ్ అండ్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ యూనియన్ గౌర అధ్యక్షులు తాటిపాక మధు, జిల్లా ప్రధాన కార్యదర్శి తోకల ప్రసాద్ హాజరయ్యారు. తాటిపాక మధు ఈ సందర్భంగా మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందిందని, పాలన చేసే అర్హత కోల్పోయిందని మధు ఆవేదన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగ కార్మికుల జోలికొస్తే ఎక్కడ నిర్మాణాల అక్కడే నిలిచిపోతాయని, ఈ నిర్బంధ పాలనకు భవన నిర్మాణ కార్మికులు స్వస్తి పలుకుతారని ఆయన అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చిత్తశుద్ధితో భవన నిర్మాణ కార్మికుల సమస్యల పరిష్కరించాలని, లేకుంటే 2024లో ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతామని మధు అన్నారు. తోకల ప్రసాద్ మాట్లాడుతూ 2019 వరకు భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా సంక్షేమ పథకాలు అమలు జరిగేవని, 2020 నుండి ఒక్క రూపాయి కూడా భవన నిర్మాణ కార్మికులకు ప్రభుత్వం మంజూరు చేయలేదని, నిర్మాణా రంగంలో భవన నిర్మాణ కార్మికుల కొరకే వన్ పర్సన్స్ సెస్ ద్వారా వసూలు చేస్తున్న కోట్లాది రూపాయల నిధులు కార్మికులకి ఖర్చు చేయకుండా ఈ నిధులు ప్రభుత్వ ఆర్భాట ప్రచారాలకు, పార్టీ రాజకీయ ప్రయోజనాల కొరకు వాడుకుంటుందని, మా నిధులు మాకే ఖర్చు చేయాలని ప్రసాదన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో మ్యారేజ్, డెలివరీ, టెంపరరీ డిజిబిలిటీ ,పర్మినెంట్ డిజేబులిటీ, యాక్సిడెంట్ ,సాధారణ మరణం, దహన సంస్కరణ ఖర్చులు తదితర క్లెయిమ్స్. 2445 క్లెయిమ్స్ పెండింగ్లో ఉన్నాయని, సుమారు 5 కోట్ల 60 లక్షల రూపాయల నిధులు మంజూరు చేయాలని, ఆంధ్రప్రదేశ్ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు ద్వారా భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ పథకాలు నేరుగా సంక్షేమ బోర్డు ద్వారానే యధావిధిగా కొనసాగించాలని, పెండింగ్లో ఉన్న గుర్తింపు కార్డులు తక్షణమే మంజూరు చేయాలని, భవన నిర్మాణ కార్మికులు ఈఎస్ఐ సౌకర్యం కల్పించాలని, భవన నిర్మాణ కార్మికులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని ప్రసాద్ అన్నారు. ఈ ఆందోళన నిరసన ధర్నా అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి చొర్చుకుని వెళ్లేందుకు యూనియన్ నాయకులు, కార్మికులు ప్రయత్నించగా అరగంటసేపు కార్మికులకు పోలీసులకు వాగ్వాదం జరిగిందన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ కృతిక శుక్లకి భవన నిర్మాణ కార్మికుల సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్ల సత్యనారాయణ, కామిరెడ్డి బోడకొండ, రాజు, లక్ష్మణరావు, సత్తిబాబు, మంగరాజు, భాను, యేసు, రామకృష్ణ, ప్రసాద్, హరి, పద్మనాభం, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, గొల్లప్రోలు, కాకినాడలో ఏపీఎస్పీ, తిమ్మాపురం, దుమ్ములపేట, వీర కమల్ సెంటర్, వాకలపూడి తదితర ప్రాంతాల భవన నిర్మాణ కార్మికులు పాల్గొన్నారు.