- ప్రమాద భరితంగా వంతెన.
ప్రజాశక్తి-ఏలేశ్వరం: శుద్ధ గడ్డకు వాగు పొంగి ప్రవహించడంతో అనేక ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో వంతెన నిర్మాణాలకు అప్పటి అధికారులు 2.7 కోట్ల రూపాయలను మంజూరు చేశారు. దీంతో పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ 2021 సంవత్సరం మందకొడిగా పనులు నిర్వహించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 22న స్థానిక శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యురాలు వంతెన ప్రారంభోత్సవం చేశారు. అప్పటికి వంతెన ఒకవైపు రెయిలింగ్ నిర్మించకపోవడం, తూతూ మంత్రంగా రోడ్డు వేయడంతో వంతెనపై ప్రయాణించాలంటే భయపడవలసిన దుస్థితి నెలకొంది. దీనికి తోడు ప్రారంభించి మూడు నెలలైనా కాకుండానే రోడ్డు కృంగిపోయి గోతులు ఏర్పడ్డాయి. ఈ వంతెన గుండా అనునిత్యం ప్రత్తిపాడు మండలంలోని 15 గ్రామాలకు వెళ్లే వాహనాలతో పాటు గ్రానైట్ లారీలు ప్రయాణించడంతో ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందో అని ప్రయాణికులు భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు రెయిలింగ్ నిర్మించి నాణ్యమైన రోడ్డును ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు.










